YS Sharmila: లక్ష కోట్లు అడిగితే రూ.15 వేల కోట్లేనా? ఇది బడ్జెట్ కాదు, మేనిఫెస్టో - వైఎస్ షర్మిల
APPCC News: పోలవరం లాంటి ముఖ్యమైన ప్రాజెక్టుకు నిధులు ఎంత ఇస్తారో ఎందుకు చెప్పలేదని షర్మిల అన్నారు. ఇతర పనులకు ఎంత నిధులు ఇస్తారు? హామీలు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు.
YS Sharmila on Budget Allocations: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన కేటాయింపుల పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఇది బడ్జెట్ కాదని.. ఎన్నికల మేనిఫెస్టో అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లక్ష కోట్లు అడిగితే ఇచ్చింది రూ.15 వేల కోట్లేనా అని అన్నారు. పోలవరానికి ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించారు.
‘‘ఇది బడ్జెట్ కాదు.. ఎన్నికల మ్యానిఫెస్టో. ఏది పడితే అది చెప్పొచ్చు. ఏదైనా హామీ ఇవ్వొచ్చు. బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి. కాలపరిమితి ఉండాలి. ఇది పూర్తిగా మేనిఫెస్టో. చంద్రబాబు రూ.లక్ష కోట్లు కావాలని అడిగారు. నిజానికి ఏపీకి దాదాపు 12 లక్షల కోట్లు కావాల్సి ఉంది. కానీ బాబు అడిగింది కేవలం రూ.లక్ష కోట్లు మాత్రమే. 5 ఏళ్లకు రూ.5 లక్షల కోట్లు ఎలా సరిపోతాయో తెలియదు. బడ్జెట్ లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారు. పోలవరం మీద ఎన్నో కబుర్లు చెప్పారు. లైఫ్ లైన్ అన్నారు.. ఫుడ్ సేఫ్టీ అన్నారు. ఇంత లైఫ్ లైన్ అయితే పోలవరంకి ఎన్ని నిధులు ఇచ్చారు?
పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఎంతో తెలియదు. రూ.12 వేల కోట్లు రీహాబిలిటేషన్ కే కావాలి. ముఖ్యమైన ప్రాజెక్టు అయితే నిధులు ఎంత ఇస్తారు అని ఎందుకు చెప్పలేదు? ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ కి ఎంత నిధులు ఇస్తారు? హామీలు ఇస్తే సరిపోతుందా? రూ.500 కోట్లు ఇస్తారా? రూ.5 వేల కోట్లు ఇస్తారా? బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం. కానీ ఈ బడ్జెట్ లో కబుర్లు మాత్రమే చెప్పారు. వెనకబడిన ప్రాంతాలకు గ్రాంట్స్ అన్నారు. ఎప్పుడు? ఎంత అనేది క్లారిటీ లేదు.
ఇక హోదా లేనట్లే..
కనీసం బాబుకి అయినా క్లారిటీ ఉందా? ఇది పూర్తిగా బీజేపీ మేనిఫెస్టో. అసలు మానేసి కొసరు అన్నట్లు ఉంది. ప్రత్యేక హోదా అనే అంశం ఊసే లేదు. విభజన హక్కులను గౌరవిస్తాం అన్నారు. విభజనలో మొదటి అంశం హోదా. అసలు విషయం పక్కన పెట్టి, ఇతర విషయాలు ఇస్తాం అంటున్నారు. మోదీ తిరుపతిలో 10 ఏళ్లు హోదా అని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అంటే మాట తప్పినట్లా? పార్లమెంట్ వేదికగా ఇక హోదా లేదు అని అప్రూవ్ అయ్యింది.
హోదానే ఏపీకి సంజీవని..
ప్రత్యేక ప్యాకేజీలు అంటున్నారు కానీ హోదా మీద చెప్పడం లేదు. ఇచ్చిన హామీలు కూడా క్లారిటీ లేదు. బిహార్ కి హోదా లేదు అని చెప్పారు. బిహార్ కి హోదా ఇస్తామని ఎవరు మాట ఇవ్వలేదు. బిహార్ కి హోదా అని పార్లమెంట్ లో హామీ ఇవ్వలేదు. కానీ ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు హోదా ఇస్తామని చెప్పింది. హోదానే ఏపీకి సంజీవని. హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి. హోదా వస్తే ఇండస్ట్రీలు వస్తాయి. కేంద్ర సంస్థల స్థాపన కూడా ప్రస్తావన లేదు. కేవలం రూ.15 వేల కోట్లకు పండుగ చేసుకోవాలా? బిహార్ 12 మంది ఎంపీలు ఇస్తే రూ.26 వేల కోట్లు ఇచ్చారు. ఇక్కడ 25 మంది ఎంపీలను తీసుకొని ముష్టి వేస్తున్నారా? చంద్రబాబు సమాధానం చెప్పాలి. బీజేపీ మళ్ళీ మోసం చేస్తుంది అని గమనించాలి
ఒక్కో ఎంపీకి వెయ్యి కోట్ల చొప్పున 15 వేల కోట్లు ఇచ్చి కొనుక్కున్నట్లు ఇచ్చారా? విశాఖ రైల్వే జొన్ ఊసే లేదు. విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు కావాలి. 2022 కల్లా దేశం మొత్తం పక్కా ఇండ్లు అన్నారు. ఇప్పుడు మళ్ళీ మూడు కోట్ల ఇండ్లు అంటున్నారు. గత 10 ఏళ్లుగా ఆంధ్రను మోసం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నారు. లక్ష కోట్లు అడిగితే 15 వేల కోట్లు ఇచ్చారు. మోదీ మళ్ళీ మోసం చేశారు అని బాబు ధైర్యంగా చెప్పగలరా? ఈ బడ్జెట్ హర్షించేది కాదు. బాబు గారు కళ్ళు తెరవండి. బిజెపితో మద్దతు ఉపసంహరించుకోండి.
వినుకొండ హత్య పొలిటికల్ మర్డర్ కానప్పుడు డిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కరోజైనా ధర్నా చేశాడా? ఇది జాతీయ సమస్య అయినట్లు ఢిల్లీ వరకు వెళ్లి ధర్నా ఎందుకు చేస్తున్నారు? కడప స్టీల్ మీద ఒక్క రోజైనా ధర్నా చేశారా?’’ అని వైఎస్ షర్మిల అన్నారు.