వివేక హత్య కేసులో కీలక మలుపు- కొత్త దర్యాప్తు అధికారిగా చౌరాసియా- సీబీఐకి సుప్రీం నెలరోజుల డెడ్‌లైన్
ఏప్రిల్ 30లోపు కేస్ దర్యాప్తు పూర్తి చేయాలని వివేక హత్య కేసులో సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది.
వివేక హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు కేసును దర్యాప్తు చేస్తున్న టీంను మార్చిసిన సీబీఐ... కొత్త టీంను అపాయింట్ చేసింది. కొత్త సిట్‌కు డీఐజీ చౌరాసియా లీడ్ చేయనున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌ను సుప్రీంకోర్టు తొలగించింది. దర్యాప్తు కోసం కొత్త టీమ్‌ను నియమించి ఏప్రిల్ 30 లోగా కేసు దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ప్రత్యేక అధికారులుగా సీబీఐ డీఐజీ చౌరాసియా నేతృత్వంలో సభ్యులుగా ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేష్ కుమార్, సీఐ శ్రీమతి, నవీన్ పునియా, ఎస్సై అంకిత్ యాదవ్ ను నియమించింది.
వివేక హత్య కేసు క్లోజ్ చేసేందుకు సీబీఐకి సుప్రీం కోర్టు నెల రోజులు గడువు ఇచ్చింది. ఏప్రిల్ 30 లోపు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. వివేక హత్య కేసులో ఐదో నిందితుడిగా ఉన్న శంకర్ రెడ్డి భార్య తులసమ్మ వేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం... ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ఆలస్యమవుతోందని తులసమ్మ పిటిషన్ వేశారు. సీబీఐ విచారణ ఆలస్యమవుతున్నందున తన భర్తకు బెయిల్ ఇవ్వాలని, దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను మార్చాలంటూ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
రెండు రోజుల క్రితం ఈ కేసులోనే సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు ఆలస్యం ఎందుకు అవుతుందని ప్రశ్నించింది. సీల్డ్ కవర్‌లో సమర్పించిన వివరాలను పరిశీలించి కేసు పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో దర్యాప్తు అధికారిని ఎందుకు మార్చకూడదు అని సీబీఐ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ ఆదేశించింది. విచారణను నేటికి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ వేగవంతం అయ్యేందుకు దర్యాప్తు అధికారితోపాటు మరో అధికారిని నియమించింది సీబీఐ. ఆ వివరాలను కోర్టుకు సమర్పించింది. అయితే విచారణ అధికారిగా రామ్‌సింగ్‌ను కొనసాగిస్తూనే మరో అధికారి పేరు సూచించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పురోగతి లేనప్పుడు ఆయన్నే కొనసాగించడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించింది. అయితే కేసు దర్యాప్తును పదిహేను రోజుల్లో పూర్తి చేస్తామన్న సీబీఐ వాదనతో విభేదించింది. దర్యాప్తు టీంను మార్చేసింది. 30రోజుల గడువు ఇచ్చి దర్యాప్తు పూర్తి చేయాలని చెప్పింది.
ఈ కేసు దర్యాప్తు ఆలస్యమవుతున్న వేళ తన భర్త శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని తులసమ్మ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
మొన్నే కీలక వ్యాఖ్యలు
సీబీఐ దర్యాప్తు ఆలస్యంపై తులసమ్మ వేసిన పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు... విచారణ అధికారిని మార్చాలని ధర్మాసనం ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తించింది. కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని, హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. ‘విచారణ చేసే అధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండి’ అని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
సీబీఐ దాఖలు చేసిన సీల్డ్ కవర్ రిపోర్టు మొత్తం చదివామని ధర్మాసనం చెప్పింది. కేసు అంతా రాజకీయ దురుద్దేశంతో కూడినదే అని రిపోర్ట్‌లో రాశారని న్యాయమూర్తి చెప్పారు. మెరిట్స్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని సూచించింది. అనంతరం కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.