AP Schools: పిల్లలను బడికి పంపకపోతే సంక్షేమం కట్, నాడు-నేడు పనులకు డెడ్ లైన్ పెట్టిన ఏపీ సీఎస్
AP Schools: విద్యా శాఖపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధ్యాన కార్యదర్శి జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పనులన్నీ వచ్చే డిసెంబరు, లేదా జనవరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
AP Schools: రాష్ట్రం లోని వివిధ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులన్నీ వచ్చే డిసెంబరు, లేదా జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
పిల్లలను బడికి పంపకపోతే సంక్షేమం కట్..
విద్యా శాఖపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధ్యాన కార్యదర్శి జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నాడు- నేడు, విద్యా కానుక కిట్ల పంపిణీ, ఉపాధ్యాయుల గ్రీవియెన్సెస్, పాఠశాల విద్యకు సంబంధించి ఎన్రోల్మెంట్ డ్రైవ్ , సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు వంటి అంశాల పై అధికారులతో సీఎస్ సమీక్షించారు. నాడు-నేడు కింద చేపట్టిన పనులన్నీ వచ్చే డిసెంబరు- జనవరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వాలంటీర్ల ద్వారా చేపట్టిన నూరు శాతం ఎన్రోల్మెంట్ ప్రక్రియను ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బడికి వెళ్లే వయసున్న పిల్లలంతా బడిలో ఉండాలని లేకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావనే సందేశాన్ని తల్లి దండ్రులకు తెలియచేయాలన్నారు. పిల్లందరినీ బడికి పంపేలా తల్లిదండ్రులు బాద్యత తీసుకునే విధంగా అధికారుల చర్యలు ఉండాలని చెప్పారు.
మరుగు దొడ్లు ఉన్నా... ఎందుకు వాడరు..
పాఠశాలల్లో నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన మరుగుదొడ్లను వినియోగించని పాఠశాలలు, సంబంధిత మండల విద్యాశాఖ అధికారుల పై చర్యలకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి అన్ని పాఠశాలలకు సర్క్యులర్ ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను ఆదేశించారు.
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ..
రక్త హీణతను నివారించేందుకు విద్యార్థులందరికీ ఐరెన్ ఫోలిక్ మాత్రలు పంపిణీ చేయడం తోపాటు మధ్యాహ్న భోజన పథకంలో మరింత పౌష్టికత ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి చెప్పారు. పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని కలిగించి , క్రీడా ప్రతిభను వెలికి తీసి మంచి క్రీడా కారులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని సీఎస్ స్పష్టం చేశారు. ఇందుకు గాను క్రీడా పరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు వీలుగా మండలం కేంద్రాలు,పెద్ద గ్రామ పంచాయతీల్లోని ఒకటి రెండు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఉన్నత పాఠశాలలను గుర్తించి నివేదిక సిద్దం చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఒక మహిళా జూనియర్ కళాశాల సహా మండలానికి రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. మండల స్థాయిలో మహిళా జూనియర్ కళాశాల అందుబాటులో ఉంటే యుక్త వయస్సు రాకుండానే వివాహాలు చేసే ప్రయత్నాలను నివారించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
ప్రవీణ్ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్..
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. జిల్లాల వారీ ఎన్రోల్మెంట్ ప్రక్రియ పై సీఎస్ కు నివేదికను సమర్పించారు. వాలంటీర్ల ద్వారా చేపట్టిన 5-18 ఏళ్ళ వయస్సు కలిగిన పిల్లల నూరు శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను జూలై నెలాఖరు లోగా పూర్తి చేస్తామన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలు, డిమాండ్లను వారితో చర్చించి పరిష్కరించామని, పెండింగ్ లోని అంశాలను రాష్ట్ర స్థాయిలో చర్చించి పరిష్కారం చేయాల్సి ఉందని తెలిపారు.