Undavalli Arun: పవన్ వారాహి యాత్ర సక్సెస్ కానీ, స్పీచ్ లతో పవన్ కన్ఫ్యూజన్ సృష్టించారు- ఉండవల్లి అరుణ్ కుమార్
Undavalli Arun Kumar: చిట్ ఫండ్ నిబంధనలు మార్గదర్శి పాటించదని మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
Undavalli Arun Kumar: మార్గదర్శి వ్యవహారంలో తాను పదిహేను సంవత్సరాల కిందట చెప్పినవన్నీ నిజాలేనని పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి ఆరుణ్ కుమార్ అన్నారు. ఈ విషయాలను మార్గదర్శి యాజమాన్యం కూడా ఒప్పుకుందని చెప్పారు.
మార్గదర్శిపై ఉండవల్లి కామెంట్స్....
చిట్ ఫండ్ నిబంధనలు మార్గదర్శి పాటించదని మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తాను గత కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నవన్నీ కూడా వాస్తవాలేనని అయితే వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రాకపోవటానికి కారణాలు ఉన్నాయని తెలిపారు. కేంద్రం నుండి వివిధ రాష్ట్రాల్లో ఉన్న పెద్దలతో రామోజీకి పరిచయాలు ఉన్న కారణంగా నిబందనలకు విరుద్దంగా మార్గదర్శి నడుస్తుందని చెప్పారు. అంతే కాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మినహా మిగిలిన పార్టిలు, అన్ని మార్గదర్శికి అనుకూలమేనని అన్నారు. మార్గదర్శి విషయంలో తాను చెప్పినవన్నీ నేడు నిజం అయ్యాయని అన్నారు.
రాజ్యాంగంలోనే ఉమ్మడి పౌరస్మృతి...
ఆర్ధిక అసమానతలు పోగొట్టడంపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా, తెలగు దేశం పార్టీ, జనసేన పార్టీలు శ్వేతపత్రం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీతో కలసి ఉన్నంత మాత్రాన గుడ్డిగా ఆ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే జనసేన సైతం శ్వేతపత్రం ఇవ్వాలని కోరారు.
అది మామూలు విషయం కాదు...
యూనిఫామ్ సివిల్ కోడ్ మాములు విషయం కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. చాలా కులాల్లో విడాకులు కుల పెద్దలు ఇచ్చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కులాలకే ఒకే కోడ్ తేలేమని ఆయన అన్నారు. అలాంటప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. ఉమ్మడి పౌరస్మృతి భారతీయ జనతా పార్టీ ఎజెండాలో ఉంది కాని ఆ పార్టీ ప్రారంభించింది కాదని చెప్పారు. రాజ్యాంగంలోనే ఉమ్మడి పౌరస్మృతి గురించి ఉందని, ఆర్ధిక అసమానతలు తొలగిపోయే విధంగా వెళ్లాలని రాజ్యాంగంలో ఉందని చెప్పారు. ఎవరు ఏ పని చేసినా సరైన వేతనం, చదువుకునే పరిస్థితి ఉండేలా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని రాజ్యాంగంలో ఉందని వివరించారు.
ఐపీసీ అన్ని మతాలకు ఒక్కటేనని, ఎక్కడ పేదరికం ఉందో అక్కడ జనాభా ఎక్కువ ఉందన్నారు. ముస్లిం జనాభా ఎక్కువని అనవసర ప్రచారం జరుగుతోందన్నారు. లా కమిషన్ ఒక రిపోర్ట్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ ను ముట్టుకోవద్దు అని లా కమిషన్ చెప్పిందని తెలిపారు. ఈ ఏడాది 22వ లా కమిషన్ మళ్ళీ రిపోర్ట్ ఇచ్చిందని వెల్లడించారు.
కేంద్రమే కారణం...
పోలవరం డయా ఫ్రామ్ వాల్ డ్యామేజ్ లో బాద్యులను ప్రభుత్వం గుర్తించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్రాన్ని విమర్శించే పరిస్థితి ఏ పార్టీకి లేదని అభిప్రాయపడ్డారు. మనకున్న అష్ట దరిద్రాలకు కారణం కేంద్రమే అని మండిపడ్డారు. రాష్ట్ర విభజన విషయం షో రూమ్ పంచుకోవడం లాంటిదేనని, షో రూమ్ తెలంగాణకు, వెనక గోడౌన్ మనకు వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇంత పకడ్బందీగా ఉన్న వ్యవస్థలో ఇన్ని లోపాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.
వారాహి యాత్ర విజయవంతం... కానీ!
జనసేన అధినేత పవన్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు తర్వాత తాను పెద్దగా దృష్టి పెట్టలేదని చెప్పారు. పవన్ వారాహి యాత్ర విజయవంతమైందని, మిగిలిన హీరోలకంటే పవన్ కు కొంచెం అభిమానులు ఎక్కువే కాబట్టి యాత్రకు తరలివచ్చారని అన్నారు.
పవన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో తెలియదని, కానీ వారాహి యాత్రలో తన స్పీచ్ లతో కన్ఫ్యూజన్ సృష్టించారని వ్యాఖ్యానించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial