TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం (సెప్టెంబరు 28) ఆయన విలేకరులతో మాట్లాడారు.
వైసీపీ ప్రభుత్వ పనితీరు పాలకుల ఆర్థిక విధానాల్లోని డొల్లతనాన్ని బహిర్గతం చేసేలా కాగ్ (సీ అండ్ ఏజీ) ఇచ్చిన రెండు నివేదికలు ఉన్నాయని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికల్లోని వాస్తవాలను పరిశీలించిన తరువాత కాగ్ ఇచ్చిన రిపోర్ట్ నెం 3/23ని అసెంబ్లీ, శాసన మండలిలో 25వ తేదీన ప్రవేశపెట్టారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం (సెప్టెంబరు 28) ఆయన విలేకరులతో మాట్లాడారు.
“వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎంత చట్టబద్ధత కల్పించి, వాటి ఆర్థిక వనరులు సదరు సంస్థల్లోని ప్రజాప్రతినిధుల అధికారాల అమలుపై కూడా కాగ్ రిపోర్ట్ నెం 2/23ని కూడా ఉభయసభల్లో ప్రవేశపెట్టింది. కాగ్ నివేదికలపై నాలుగేళ్ల నుంచీ వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం చలనం లేనట్టే వ్యవహరిస్తోంది. ఇలా వ్యవహరిస్తున్న సర్కార్ పై వాస్తవంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. అలానే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ గా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యవహరిస్తున్నారని, సదరు కమిటీ సమావేశాలు కూడా జరక్కుండా ఈ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోంది. వైసీపీ ప్రభుత్వానికి కాగ్ అన్నా, న్యాయస్థానాలన్నా, ఎఫ్.ఆర్.బీ.ఎం యాక్ట్ అన్నా లెక్క లేదు. ఏ చట్టాలూ తమనేమీ చేయలేదన్న దుర్మార్గపు విధానాలతో ఈ ప్రభుత్వం ముందుకెళుతోంది. కాగ్ తన తాజా నివేదికల్లో ప్రధానంగా 10 అంశాలు లేవనెత్తింది. వాటిలో ప్రధానమైనది రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించింది.
విశాఖ కేంద్రంగా పాలన మూణ్ణాళ్ల ముచ్చటే
నాలుగున్నరేళ్లుగా అమరావతిలో కాలయాపన చేసిన జగన్ రెడ్డి.. అక్కడ నాలుగు శాతంకూడా అభివృద్ధి చేయకుండా దసరా నుంచి తన మకాం విశాఖకు మారుస్తానంటున్నాడు. విశాఖపట్నం నుంచి పాలన చేయాలనుకుంటున్న జగన్ రెడ్డి మురిపెం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగలనుంది. నవంబర్, డిసెంబర్ అయ్యాక జనవరిలో సార్వత్రిక ఎన్ని కల నోటిఫికేషన్ వస్తే, జగన్ రెడ్డి అక్కడా దుకాణం కట్టేయాల్సిందే. ఈ మాత్రం దానికే నా జగన్ రెడ్డి అమరావతికి భూములిచ్చిన రైతుల్ని దారుణంగా చిత్రహింసలకు గురి చేశాడు? మూడు రాజధానుల జపం చేసి ప్రజల్ని, రాష్ట్రాన్ని నిలువునా ముంచేశాడు. తన మూణ్ణాళ్ల ముచ్చటకోసం రూ.30వేలకోట్ల విలువైన అమరావతిలోని ప్రాజెక్టుల్ని నాశనంచేయడం ద్వారా తన సైకో మనస్తత్వాన్ని ఈ ముఖ్యమంత్రి బయటపెట్టాడు.
ప్రభుత్వానికి చెంపపెట్టే..
కాగ్ స్థానిక సంస్థల పనితీరుపై ఇచ్చిన ఫెర్ఫార్మెన్స్ ఆడిట్ రిపోర్ట్ కూడా వైసీపీ ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టు అనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇచ్చిన నిధులు రూ.8 వేల కోట్లు వాడుకుందని ఇప్పటికే రాష్ట్ర సర్పంచ్ ల సంఘం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అలానే వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తున్న ఎన్.ఆర్.ఈ.జీ. ఎస్ నిధుల దుర్వినియోగంపై కూడా కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పాటు చేయాల్సిన కమిటీలకు తిలోదకాలిచ్చి మరీ వైసీపీ ప్రభు త్వం పాలన పేరుతో వార్డు సచివాలయ వ్యవస్థను జూలై 2019లో ప్రవేశ పెట్టడాన్ని కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. స్థానికసంస్థల నుంచే స్వయం పాలన సాగాలన్న సదుద్దే శంతో రాజ్యాంగం తీసుకొచ్చిన అధికరణనే ఈ ప్రభుత్వం తుంగలో తొక్కడం నిజంగా చాలా చాలా బాధాకరం. వార్డు సచివాలయ వ్యవస్థను తీసేసే వరకు రాష్ట్రానికి ఎలాంటి నిధులివ్వమని కేంద్రం చెబితే ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థపై పెట్టిన సొమ్మంతా దుర్విని యోగమైనట్టే కదా!
‘బుగ్గన నోరే తెరవలేదు’
ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడితే, వైసీపీ ప్రభుత్వం కనీస బాధ్యతగా కూడా స్పందించలేదు. బుర్ర కథలు చెప్పే ఆర్థిక మంత్రి బుగ్గన నోరు కూడా తెరవలేదు. రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేయడానికి జగన్ రెడ్డి కంకణ కట్టుకున్నాడు అని చెప్పడానికి కాగ్ తాజాగా బయట పెట్టిన రెండు నివేదికలే సాక్ష్యం” అని అశోక్ బాబు తేల్చిచెప్పారు.