పవన్ సభకు భూముల ఇచ్చిన గ్రామంలో ఇళ్ల తొలగింపు- కక్ష సాధింపే అంటున్న స్థానికులు
ఏపీలో ఇటీవల కాలంలో ఫేమస్ అయిన గ్రామం ఇప్పటం. గుంటూరు జిల్లా పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న ఈ గ్రామంలోనే ఇటీవలే జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవస్థాపక సభ పెట్టారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఇళ్ల తొలగింపు కాకరేపుతోంది. ఇప్పటంలో అక్రమంగా కట్టారంటూ ఇళ్ల కూర్చివేతకు అధికారులు ప్రయత్నించారు. ఇది న్యాయబద్ధంగా లేదంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. వాళ్లకు టీడీపీ, జనసేన మద్దతుగా నిలిచాయి.
మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్ల తొలగింపును స్థానికులు అడ్డకోవడంతో వాతావరణం వేడెక్కింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై టీడీపీ, జనసేన ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కక్ష సాధింపులో భాగంగానే ఇప్పటంలో ఇళ్లు తొలగిస్తున్నారని స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలీసులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం రోడ్డు విస్తరణ పనులలో భాగంగానే తొలగిస్తున్నామని చెబుతున్నారు. ఇంతకాలం లేని అభివృద్ధి ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందని స్థానికులు నిలదీయం అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది.
ఇప్పటంలో ఇళ్ళు కోల్పోతున్న బాధితులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని అనేక చోట్ల అక్రమ కట్టడాలు ఉన్నాయి వాటిని తొలగించకుండా తమను టార్గెట్ చేసుకున్నారని విమర్శించారు. అనేక సంవత్సరాలుగా నివాసం ఉండే వారిపై కావాలనే కక్ష పెంచుకుని తొలగింపు పనులు చేపట్టారంటున్నారు. ఓ ప్రైవేట్ స్కూల్ ఎదురుగా గతంలో తొలగించిన ఇళ్ళను అధికార పార్టీ నాయకుల అండదో మళ్లీ నిర్మించుకున్నారని ఎత్తి చూపుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు అందరూ సహాకరం ఉంటుంది కానీ ఇలా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కచ్చితంగా సమాధానం చెప్పేందుకు సిద్ధం అంటున్నారు.
రోడ్డు విస్తరణకు స్థలం అవసరమైతే అధికారులు ముందస్తుగా చర్చలు జరిపి చర్యలు తీసుకునే వీలుందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ మాత్రం అలాంటి ముందస్తు సమాచారం ఏమీ లేకుండా నేరుగా ఇళ్లను నేలమట్టం చేస్తున్నారని వాపోతున్నారు. ప్రత్యామ్నాయం చూపించకుండా ఈ చర్యలేంటని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటం వాసులకు జనసేనాని 50లక్షల విరాళం...
ఏపీలో ఇటీవల కాలంలో ఫేమస్ అయిన గ్రామం ఇప్పటం. గుంటూరు జిల్లా పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న ఈ గ్రామంలోనే ఇటీవలే జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవస్థాపక సభ పెట్టారు. వాస్తవానికి జనసేన సభను నిర్వహించేందుకు గుంటూరు, విజయవాడ ప్రాంతంల్లో చాలా చోట్ల స్థలాలను జనసేన నాయకులు పరిశీలించారు. అయితే అధికార పార్టీ అడ్డంకులు, బెదిరింపులతో సభ నిర్వహించేందుకు భూమి దొరకలేదు. అలాంటి సమయంలో ఆఖరి నిమిషంలో ఇప్పటం గ్రామంలోని పెద్దలంతో జనసేన సభకు తమ భూములు ఇచ్చారు.
దాదాపుగా 14ఎకరాల స్థలంలో పవన్ సభను నిర్వహించారు. అదే సభలో గ్రామ సంక్షేమం కోసం 50లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆ తరువాత జనసేన నాయకులు ఆ మెత్తాన్ని స్థానిక గ్రామాధికారులకు చెక్ రూపంలో అందించారు. అయితే 50లక్షల రూపాయలు విరాళాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని స్థానిక అధికారులు ఆదేశాలు ఇవ్వటంతో గ్రామస్థులు ఎదురు తిరిగారు. దీంతో అధికారులు, అదికార పార్టీ నాయకులు, జనసేన నాయకులకు మధ్య వివాదం మొదలైంది.
నాదెండ్లకు కూడా చేదు అనుభవం
రెండు రోజుల క్రితం జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పటంలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కూడా పవర్ కట్ విధించారు. దీంతో స్థానికులు సెల్ ఫోన్‌ల వెలుతురులోనే సమావేశాన్ని కొనసాగించారు. ఇది కూడా వివాదం అయ్యింది. సెల్ ఫోన్‌ల వెలుతురులో సమావేశం నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో వైసీపీకి మింగుడుపడలేదని జనసేన నాయకుల అంటున్నారు.
ఇప్పుడు ఇళ్ళ తొలగింపు...
తాజా పరిణామాలతో గ్రామంలో ఇళ్ళ తొలగింపు కూడా మరో వివాదానికి కారణమైంది. వేధింపుల్లో భాగంగానే ఇళ్ల తొలగింపునకు సిద్ధమయ్యారని జనసేన, టీడీపీ నాయకులు అంటున్నారు. అధికార పార్టీ నాయకులు కావాలనే కుట్ర చేసి.. పోలీసులు, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని పేదల పొట్టకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.