Prattipati Pullarao: మాజీ మంత్రి ప్రత్తిపాటిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు - కులం పేరుతో దూషించారని ఫిర్యాదు
Chilakaluripeta: నియోజకవర్గంలో మంచి నీటి చెరువు వద్ద ఎన్టీఆర్ సుజల పథకం పున:ప్రారంభం సమయంలో తలెత్తిన ఘర్షణకు గానూ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
Chilakaluri Peta: మాజీ మంత్రి, టీడీపీ నేత అయిన ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో మంచి నీటి చెరువు వద్ద ఎన్టీఆర్ సుజల పథకం పున:ప్రారంభం సమయంలో తలెత్తిన ఘర్షణకు గానూ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ను కులం పేరుతో మంత్రి దూషించారని మున్సిపల్ సూపర్‌వైజర్ కోడిరెక్క సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ పీఏఓ యాక్ట్ 323, 34, 353, 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ - 1గా ప్రత్తిపాటి పుల్లారావు, ఏ - 2గా మదన్ మోహన్, ఏ - 3గా బండారుపల్లి సత్యనారాయణ, ఏ - 4గా కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు శ్రీనివాసరావు, ఏ - 5గా రాష్ట్ర టీడీపీ నాయకులు కరీముల్లాలపై కేసులు నమోదు పెట్టారు.
అసలేం జరిగిందంటే..
టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఉండేది. చిలకలూరిపేట పట్టణంలో పాత మంచి నీటి చెరువు కట్ట పక్కనే ఉన్న ప్రాంతంలో ఆ పథకం కింద వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు దీన్ని ప్రారంభించారు. ఇప్పుడది మూడేళ్లుగా మనుగడలో లేదు. కానీ, దీనిని తిరిగి ప్రారంభిస్తున్నట్లు గురువారం ప్రకటించారు.
ఇందుకోసం పురపాలక సంఘానికి చెందిన స్థలంలో రెండు బోర్లు వేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు బోర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అక్కడ ఎలాంటి తదుపరి చర్యలు నిర్వహించవద్దని గురువారం నోటీసులు ఇచ్చారు. ఇదే విషయాన్ని వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన పోలీసులకు ప్రత్తిపాటి అనుచరులకు వాగ్వివాదం జరిగింది.
ప్లాంట్ ప్రారంభానికి వచ్చిన పత్తిపాటి పుల్లారావుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ (టీపీఎస్) కోడిరెక్క సునీత, రెవెన్యూ అధికారి ఫణికుమార్ ప్లాంట్ నిర్వహణకు అనుమతుల్లేవని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో ఓ మహిళా సిబ్బందికి గాయాలు కాగా, ఆమెను ఆస్పత్రికి తరలించారు.