Sajjala Ramakrishna Reddy: అవినాష్ రెడ్డికి సంబంధం లేదు, అంతా టీడీపీ కథనం ప్రకారమే జరుగుతోంది - సజ్జల
బీజేపీలో తన కోవర్టుల ద్వారా సీబీఐ విచారణను చంద్రబాబు ప్రభావితం చేయిస్తున్నారని సజ్జల అన్నారు. చంద్రబాబు గతంలో వైఎస్‌పై ఫ్యాక్షనిస్ట్ ముద్ర వేసి కుట్రలు చేశారని అన్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం లేదని వైఎస్సార్ సీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వివేకానంద రెడ్డిని మర్డర్ చేశాడని చెప్తున్న అవినాష్‌పై ఆధారాలు ఉండి ఉంటే ఇన్ని కుట్రలు జరగవని అన్నారు. ఇదంతా ఒక అబద్ధం అని కొట్టిపారేశారు. గూగుల్‌లో ఏమొచ్చింది అనేది తనకు తెలియదని అన్నారు. వివేకా హత్య మాత్రం ఘోరంగా జరిగిందని, నేరస్తులు పట్టుబడాలని ఆకాంక్షించారు. టీడీపీ కోరుకునే విధంగా సీబీఐ దర్యాప్తు జరుగుతోందని అన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగకపోగా తప్పుడు రాతలు రాయిస్తున్నారని విమర్శించారు. ఇదంతా ఒక కో ఆర్డినేషన్‌తో జరుగుతోందని సజ్జల రామక్రిష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.
గత ఎన్నికల ముందు వివేకా హత్య కేసు ద్వారా తమ నాయకుడు జగన్ ను నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని చెప్పారు. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయని సజ్జల పేర్కొన్నారు. ‘‘వివేకాను కోల్పోవడం వైఎస్సార్ సీపీకి, జగన్‌కు నష్టమే. వివేకా తిరిగి పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించింది కూడా జగన్మోహన్ రెడ్డే. వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు. కొందరిని టార్గెట్ చేస్తూ విచారణ చేస్తున్నారు. వివేకా బావమరిది శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్ రెడ్డి వెళ్లారు. శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయారని తనకు చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డే చెప్పాడు. వివేకా ఫోన్‌లోని రికార్డులను ఎందుకు డిలీట్ చేశారు?’’ అని సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రశ్నించారు.
బీజేపీలో తన కోవర్టుల ద్వారా సీబీఐ విచారణను చంద్రబాబు ప్రభావితం చేయిస్తున్నారని సజ్జల అన్నారు. చంద్రబాబు గతంలో వైఎస్‌పై ఫ్యాక్షనిస్ట్ ముద్ర వేసి కుట్రలు చేశారని అన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్‌పై కూడా కుట్రలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పకడ్బందీగా కథనం తయారు చేస్తారని, ఆ కథనాన్ని ఎల్లో మీడియాలో వేయించి ప్రచారం చేయిస్తారని చెప్పారు. ఆ అంశాలనే టీడీపీ నేతలు పదేపదే ప్రెస్ మీట్లలో చెబుతూ ఉంటారని అన్నారు.