Posani On Lokesh: నన్ను మర్డర్ చేయించాలని చూస్తున్నారు - లోకేశ్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు
మంగళవారం (ఆగస్టు 22) పోసాని క్రిష్ణమురళి అమరావతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
తనను చంపడానికి నారా లోకేశ్ ప్రయత్నిస్తున్నారని సినీ నటుడు, వైఎస్ఆర్ సీపీ నేత పోసాని క్రిష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోతే లోకేశే బాధ్యత వహించాలని అన్నారు. మంగళవారం (ఆగస్టు 22) పోసాని క్రిష్ణమురళి అమరావతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుంగనూరులో చంద్రబాబు పోలీసులపై దాడిచేయించినట్లుగా పోసానిని మర్డర్ చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, వైఎస్ జగన్ వ్యక్తిత్వం నచ్చి ఆయన వద్దకు వెళ్లానని అన్నారు. తన జీవితాంతం వైఎస్ జగన్ వెంట ఉంటానని అన్నారు. చావుకు తాను ఎప్పుడూ భయపడబోనని పోసాని తేల్చి చెప్పారు. మంగళగిరి కోర్టుల చుట్టూ తనను తిప్పాలని చూస్తున్నారని అన్నారు. మంగళగిరికి వచ్చిన సమయంలో ఏదో ఒకప్పుడు తనను చంపాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు. చావుకు తాను భయపడబోనని అన్నారు.
చంద్రబాబు అక్రమాలు తాను బయట పెట్టినందుకే తనపై కక్ష గట్టారని చంద్రబాబు, లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంతేరులో 14 ఎకరాలు కొన్నారని నేను అన్నానని లోకేశ్ తనపై పరువు నష్టం దావా వేశారని పోసాని అన్నారు. సీఎం జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన లోకేష్‌పై.. పరువు నష్టం దావా వేయకూడదా? అని నిలదీశారు. చంద్రబాబు వ్యవస్థలను బాగా మేనేజ్ చేస్తారని, అందుకే ఎన్ని కేసులు ఉన్నాకానీ అన్నిటిపైనా స్టే లు రావడం వల్ల జైలుకు వెళ్లలేదని అన్నారు.
ఇంకా కొంత మందికి కులం పిచ్చి ఎక్కించి తనను తిట్టిస్తున్నారని అన్నారు. గతంలో సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లినపుడు పసుపు నీళ్లతో కడిగించారని అన్నారు. కులాభిమానం ఉండొచ్చు కానీ, దురాభిమానం ఉండకూడదని అన్నారు. పెదకాకానిలో తనకు 16 ఎకరాలు ఉన్నాయని కొంత మంది దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క ఎకరం ఉందని నిరూపించినా రాసిస్తానని అన్నారు. తనకు సొంతూరు పెదకాకానిలో పొలాలు లేవని.. స్థలాలు మాత్రం ఉన్నాయని అన్నారు.
హెరిటేజ్ పైనా విమర్శలు
లోకేశ్ కి తెలియకుండానే లోకేశ్ తల్లి, భార్య హెరిటేజ్‌కి డైరెక్టర్లు అయ్యారా అని ప్రశ్నించారు. హెరిటేజ్ చంద్రబాబుది అంటే ఆ సొమ్ము లోకేశ్ ది కాదా అని అడిగారు. నేను చచ్చిపోతే నా ఆస్తి నా తర్వాత నా కొడుకుకి వచ్చినట్లే హెరిటేజ్ లోకేశ్‌కి చెందుతుంది కదా అని అన్నారు.
అమరావతిలో 5 శాతం భూములు పేద ప్రజలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉందని పోసాని అన్నారు. ఆ చట్టాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారని అన్నారు. గతంలో రైతుల కష్టాలను తీర్చడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కులాలకు అతీతంగా రూ.11 వేల కోట్లకుపైగా రుణమాఫీ చేశారని గుర్తు చేశారని అన్నారు. అప్పుడు తమకు ఈ రుణమాఫీ వద్దని రైతులు చెప్పారా? అని ప్రశ్నించారు. పెదకాకానిలో తనకు కొన్ని ఇళ్ల స్థలాలు ఉన్నాయని, తన కష్టార్జితంతో వాటిని కొన్నానని అన్నారు. అవసరమైతే ఆ భూములన్నీ పేదలకు ఫ్రీగా ఇచ్చేస్తానని అన్నారు. పేదల భూములపై కేసులు వెనక్కి తీసుకోవాలని అమరావతి రైతులను పోసాని కోరారు.