Mark Shankar Health Update: మూడు రోజులపాటు హాస్పిటల్‌లోనే మార్క్ శంకర్.. కొడుకును చూసిన పవన్ కళ్యాణ్, హెల్త్ అప్‌డేట్ ఇదే
Andhra Pradesh News | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ప్రాణాపాయం తప్పింది. ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు చిన్నారిని షిఫ్ట్ చేశారు.

Pawan Kalyan visits his Son Mark Shankar | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ హెల్త్ అప్‌డేట్ వచ్చింది. మార్క్ శంకర్‌ను బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. కానీ మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
స్కూల్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..
సింగపూర్ లోని స్కూల్ బిల్డింగ్ లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరో 19 మందికి కాలిన గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ శంకర్ ను చూసి పవన్ తల్లడిల్లిపోయారు. మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకొంటున్నాడు. అయితే అగ్నిప్రమాదంలో వచ్చిన పొగ ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడం వల్ల భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులలో పొగ చేరడంతో ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందించారు. నేటి ఉదయం పరీక్షించిన డాక్టర్లు ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు మార్క్ శంకర్‌ను షిఫ్ట్ చేశారు.
పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లోని హాస్పిటల్ చికిత్స కొనసాగుతోంది. బ్రాంకో స్కోప్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఊపిరితిత్తులు, శ్వాసనాళాల లోపలి భాగాల్లో ఏమైనా సమస్య ఉంటే బ్రాంకోస్కోప్ (Bronchoscope) ద్వారా గుర్తిస్తారు. ఈ బ్రాంకో స్కోప్ పరికరం సన్నని ట్యూబ్ రూపంలో ఉంటుంది, దీని చివరన కెమెరా లేదా లెన్స్, లైట్ ఉంటాయి. దీనిని నోటి లేదా ముక్కు ద్వారా శ్వాసనాళాల్లోకి పంపి ఊపిరితిత్తులు పరిస్థితిని చెక్ చేస్తారు. పొగ వల్ల ఉపిరితిత్తులకు సమస్యలు తలెత్తుతాయా అనేది ప్రాథమికంగా దీని ద్వారా పరిశీలించనున్నారు. మార్క్ శంకర్ కు బ్రాంకో స్కోపీ చికిత్స చేస్తున్నారని తెలిపారు.






















