Chandrababu: ఇంటిపై స్టిక్కర్ వేస్తే 6093 అని రాయండి, నా ఇంటిపై జగన్ స్టిక్కర్ వేస్తే తాట తీస్తా! చంద్రబాబు
TDP Chief Chandrababu: మీ ఇంటిపై స్టిక్కర్ వేస్తే దానిపై 6093 అని నెంబర్ రాయాలని ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఎవరైనా నా ఇంటిపై జగన్ స్టిక్కర్ వేస్తే తాట తీస్తా అని హెచ్చరించారు.
TDP Chief Chandrababu: పల్నాడు.. సత్తెనపల్లి: రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఒకవైపు.. సైకో మరొక వైపు ఉన్నారని, ఆ సైకోను ఓడించడానికి అందరూ కలిసి రావాలంటూ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇల్లు నీది... దానిపై స్టిక్కర్ జగన్ ది. పొలం మీది పాస్ పుస్తకంపై ఫోటో జగన్ ది. మీ ఇంటిపై స్టిక్కర్ వేస్తే దానిపై 6093 అని నెంబర్ రాయాలని ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఎవరైనా నా ఇంటిపై జగన్ స్టిక్కర్ వేస్తే తాట తీస్తా అని హెచ్చరించారు. పి4 అనే కొత్త పథకం నిన్నే ఇచ్చా అన్నారు. ప్రభుత్వం, ప్రవేటు వ్యక్తులు, ప్రజలు పార్టనర్ షిప్ తో కలిసి పని చేస్తే పేదరికమే ఉండదు అని అభిప్రాయపడ్డారు.
అమ్మ ఒడి పదిహేను వేలు అన్నాడు. ఇప్పుడు పదమూడు వేలు ఇస్తున్నాడు. వసతి దీవెన, విద్యా అంటూ ఏమి ఇస్తున్నారు. పీజీ చదువుకునే వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వటం లేదు. విద్యా దీవెన ఏమైంది నీ చెత్త దీవెన. పిల్లలు చదువుకోవటానికి ఇతర రాష్ట్రాలకు పోతున్నారు. మెడికల్, ఇంజనీరింగ్ కాలేజ్ లు టీడీపీ పెడితే వైసీపీ మూసేసింది అని చంద్రబాబు ఆరోపించారు. సైకోకు చదువు రాదు, కనుక మీ పిల్లలకు చదువు లేకుండా చేస్తున్నాడు. అప్పు చేసి పప్పు కూడు తింటే ఏమొస్తుంది. ధీరూభాయ్ అంబానీకి ఇద్దరు పిల్లలు. ఒకరు బాగా అభివృద్ధి చెందితే మరొకరు సాధారణ వ్యక్తిగా మిగిలిపోయారు. ఏపీలో ఇంకా ఎక్కువ వనరులు ఉన్నాయి. తెలివి ఎక్కువై కులాల మధ్య పోరాటంతో అస్తిత్వాన్నే కోల్పోయాం. విజన్ 2029కి దేశంలో నెంబర్ వన్ గా ఉండాలని ప్రణాళిక వేసుకున్నాం. జగన్ పాదయాత్ర చేస్తే నేను ఇబ్బంది పెట్టలేదు. కానీ అప్పుడు ముద్దులు పెట్టి ఇప్పుడు పిడి గుద్దులు గుద్దుతున్నాడు. రాష్ట్ర వినాశనానికి కారణం అయ్యాడు అంటూ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు చంద్రబాబు.
రాష్ట్రంలో గంజాయి కూడా మాఫియాగా తయారైంది. గంజాయి సాగు కూడా వాణిజ్య సాగుగా మారిపోయింది. రెండు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. మీ పేరుతో పది లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పంతా జగన్ కడతాడా. ఇష్టానుసారంగా అప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. సాగర్ నీళ్ళు ఈ ఏడాది ఇవ్వలేదు. పట్టిసీమ తో నీటి ఎద్దడి లేకుండా చేశాను. కానీ నీళ్ళు అడిగితే రైతులపై కేసులు పెట్టాడు సైకో ముఖ్యమంత్రి జగన్. మేం అధికారంలోకి వస్తే రైతులపై కేసులు ఎత్తివేస్తాను భయపడవద్దు అని భరోసా కల్పించారు.
గొడ్డలి పోటుతో బాబాయ్ ని లేపేశాడు. ఆ తప్పును నాపై వేశాడు. నీ చెల్లెలు ఏమని చెప్పింది. వివేకాపై అపనింద వేయడాన్ని ఖండిస్తున్నా అని నీ చెల్లెలు చెప్పింది గుర్తుకులేదా అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. రాష్ట్ర విభజన జరిగింది. 16000 వేల కోట్ల బడ్జెట్ ఇచ్చినా ఎవరికి లోటు లేకుండా చేశాను. ఇప్పుడు భారీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కానీ అన్నా క్యాంటీన్ ఉందా, చంద్రన్న భీమా ఉందా. విదేశీ విద్య ఉందా, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ ఉన్నాయా అని అడిగారు.
నవరత్నాలు కాదు అవి నవ మోసాలు..
ఏపీ సీఎం జగన్ ఇచ్చేది పది రూపాయలు దోచుకునేది వంద రూపాయలు అని ఎద్దేవా చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలు 9 శాతం నిన్నే పెంచింది ఏపీ సర్కార్. మద్యం రేట్లు పెంచి నాసిరకం జగన్ బ్రాండ్లు అమ్ముతున్నారు. ఆస్తి ప్రతి ఏటా పెంచుతున్నా మీరు మాత్రం కామ్ గా ఉంటారు. ఎందుకంటే అక్రమ కేసులు పెడుతున్నారు. ఇసుక ట్రాక్టర్ 5000, లారీ ఇసుక 75000/. ఇసుక ఏమైనా పండిస్తున్నారా. ఎమ్మెల్యే వంకర్రావు 20వేల కోట్లు జగన్ ప్యాలెస్ కి కప్పం కడుతున్నాడు. మిగిలినది ఆయన దోచుకుంటున్నాడు అని ఆరోపించారు. ఇక్కడ మంత్రి పేరు చెప్పను. వీళ్ళు మన ఎమ్మెల్యే లు, మంత్రులా. చెత్త పై పన్ను వేసిన చెత్త, పనికిమాలిన ముఖ్యమంత్రి జగన్ అంటూ మండిపడ్డారు చంద్రబాబు.
మంత్రి అంబటిపై చంద్రబాబు కామెంట్స్
ఇరిగేషన్ లో డయాఫ్రమ్ అంటే తెలియని వ్యక్తి, ఓనమాలు తెలియని వ్యక్తి మంత్రి ఎలా అయ్యారో అంటూ మంత్రి అంబటి రాంబాబుపై చంద్రబాబు సెటైర్లు వేశారు. నోరుంటే సరిపోదు. అంబోతులా అరిస్తే లాభం లేదన్నారు. పెదకూరపాడు అమరావతి రోడ్డు వేయలేని నువ్వు టిడిపిని విమర్శించే మగాడివా అంటూ మండిపడ్డారు. సైకో సీఎం జగన్ ముఖంలో నవ్వు చూడటానికి, నన్ను పవన్ కళ్యాణ్ ను రోజూ విమర్శిస్తుంటావు అన్నారు. మీ మంత్రి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ గౌరవం నాకు. కార్మికుడి చనిపోతే లంచం అడిగాడు. రూ.2,50,000 కోసం కక్కుర్తి పడిన వ్యక్తి మంత్రి అంబటి అన్నారు. అక్రమ మైనింగ్ చేస్తున్నాడని వాళ్ళ పార్టీ నేతలే చెబుతున్నారు, మంత్రి తమ్ముడు ఒకప్పుడు చాలా యాక్టివ్ గా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు యాక్టివ్ గా లేరు. ఇక్కడే ఉంది చిదంబర రహస్యం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.