Temples In AP: ఏపీలో దేవాలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం- అధికారులకు ఆగస్టు వరకే డెడ్‌లైన్
అన్నిరకాల ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, రూముల బుకింగ్ తదితర సేవలన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్న ప్రభుత్వం. అవసరమైన సాఫ్ట్‌వేర్ కూడా అభివృద్దికి చర్యలు
ఏపీలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఆగస్టు మాసాంతానికల్లా ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఉపముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన కొట్టు సత్యనారాయణ... దేవాలయాల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా టి.టి.డి. తరహాలో అన్ని రకాల సేవలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఎనిమిది ప్రధాన దేవాలయాలు, 6(ఎ) కేటగిరీలోని 180 దేవాలయాల్లో అన్నిరకాల ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, రూముల బుకింగ్ తదితర సేవలన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయా దేవాలయాల్లో జరిగే ఆర్థిక లావాదేవీల ఖాతాలు అన్నింటినీ అన్ లైన్ ద్వారా ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ కూడా అభివృద్ది పరుస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో జరిగే ఆర్థిక వ్యవహారాలను పూర్తిస్థాయిలో ఆడిటింగ్ చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు సత్యనారాయణ. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్ పూర్తిచేసి ఆడిట్ రిపోర్టులను సత్వరమే అందజేయాలని ఆదేశాలు జారిచేసినట్టు పేర్కొన్నారు. 6(ఎ) కేటగిరీలోని 195 దేవాలయాలకు సంబంధించి 185 దేవాలయాల ఆడిట్ రిపోర్టులు ఇప్పటికే అందాయని, 6(బి) కేటగిరీలోని 1,461 దేవాలయాలకు సంబంధించిన ఆడిట్ ఈ ఏడాది నవంబరు కల్లా పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఆడిట్ నివేదికలను అన్నింటినీ ఆన్ లైన్‌లో పెడతామని, నివేదికల్లో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వెంటనే వివరణ ఇవ్వాల్సినదిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తామని ఆయన తెలిపారు.
అర్చకుల సంక్షేమ నిధి ట్రస్టు ద్వారా అర్చకులకు పలు రకాలుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు చెప్పారు సత్యనారాయణ. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 719 మంది అర్చకులకు లబ్ది చేకూర్చే విధంగా రూ.16.96 కోట్లు, ఈ ఏడాది ఇప్పటి వరకూ 158 మంది అర్చకులకు లబ్ది చేకూర్చే విధంగా రూ.3.20 కోట్లు వెచ్చించామన్నారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న సుమారు 11 వేల ఫైళ్లను పరిష్కరించామని మంత్రి తెలిపారు.
కోటి రూపాయలలోపు ఆదాయం ఉన్న ఐదు దేవాలయాలను ధార్మిక పరిషత్ కమిటీ ద్వారా ట్రస్టు బోర్డులు ఏర్పాటు చేసినట్టు ఉపముఖ్యమంత్రి తెలిపారు. కోటబొమ్మాళి కొత్త అమ్మవారి దేవాలయం, శాండ్ హిల్ రామ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం, విశాఖపట్నం వెలంపేట దుర్గాలమ్మవారి దేవాలయం, పొన్నూరు భావన్నారాయణ స్వామి దేవాలయం, ఆరుగొండ అర్థగిరి వీరాంజనేయ స్వామి దేవాలయాలకు ధార్మిక పరిషత్ కమిటీ ద్వారా ట్రస్టు బోర్డులు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని పలు దేవాలయాలకు సంబంధించి దాదాపు 6 లక్షల ఎకరాల దేవాదాయ భూముల ఉన్నాయని, వాటిలో 2 లక్షల ఎకరాలు అర్చకుల యాజమాన్యంలో ఉన్నాయని వెల్లడించారు. మరో 2 లక్షల ఎకరాలు పలు లిటిగేషన్లలో ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. దేవాదాయ భూముల ఆక్రమణను పటిష్టంగా నియంత్రించేందుకు ఎండోమెంట్ చట్ట సవరణకు చర్యలు చేపట్టామని త్వరలోనే ఆప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శాఖా పరంగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి వారం రెండు రోజులు పాటు అంటే సోమవారం, మంగళవారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ లేకుండా సి.జి.ఎఫ్.
ఇవ్వకూడదనే నిబంధనలకు అనుగుణంగానే మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కట్టిన దేవాలయాలు అన్నింటికీ నిధులను మంజూరు చేస్తున్నామన్నారు. సి.జి.ఎఫ్. గ్రాంట్‌గా రూ.120 కోట్లు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. సి.జి.ఎఫ్. కింద రూ.167 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని, ఈ నెలఖారు కల్లా కనీసం రూ.100 కోట్లు వసూలు చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్థేశించామన్నారు.