Mangalagiri: 50 వేలు కాదు, ఫైనల్ 40వేలు - మంగళగిరి ఆలయంలో పోస్ట్ కోసం బేరాలు, వైరల్ గా మారిన వీడియో!
పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో మరో వివాదం వెలుగు చూసింది. ఆలయంలో అంతర్గత బదిలీల్లో చేతి వాటం జరుగుతుందని, అర్చకులు చర్చించుకుంటున్న బేరసారాల వీడియో వైరల్ గా మారింది.
మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో మరో వివాదం వెలుగు చూసింది. ఆలయంలో అంతర్గత బదిలీల్లో చేతి వాటం జరుగుతుందని, అర్చకులు చర్చించుకుంటున్న బేరసారాల వీడియో వైరల్ గా మారింది.
మంగళగిరి ప్రాంతంలో అత్యంత కీలకమయిన ఆలయం పానకాల లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం. రాజధాని ప్రాంతంలోని ఈ ఆలయంలో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. కీలకమయిన అధికారి అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆడియోతో పాటుగా వీడియో కూడా వైరల్ అవుతోంది. దొంగ లెక్కలు చూపి దేవుని సొమ్ము అనే భయం లేకుండా ప్రతి నెల లక్షల రూపాయలు సొంత ఖాతాలోకి జమ చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు, మొక్కులో భాగంగా ఆలయానికి భారీగా విరాళాలు భక్తులు సమర్పించుకుంటారు.
అన్నదానంలో మొదలైన చేతివాటం...
దేవస్థానంలో అన్నదాన విభాగంలో మొదలైన వివాదం కాస్త, అన్ని విభాగాలకు పాకిందని స్థానికంగా చెబుతున్నారు. రోజుకు వంద మంది భక్తులు వచ్చి అన్నదానంలో భోజనం చేస్తుంటే, 300మందికి అన్నదానంలో వడ్డించినట్లుగా లెక్కలు చూపించారని విమర్శలు ఉన్నాయి. ఈ విధంగా రోజుకు ఏడువేల నుంచి 12వేల వరకు స్వాహా చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉత్సవాలలో సైతం తప్పుడు బిల్లులను పెట్టి లక్షల రూపాయలు చేతులు మారాయని విమర్శలు వస్తున్నాయి.
వివాదాస్పదంగా మారిన ఆడియో, వీడియో లీక్..
ఇటీవల దేవస్థానానికి చెందిన అర్చకుడి సమక్షంలో రికార్డయిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో అంతర్గగంగా ఉన్న వ్యహరాలు, ఆర్థిక వ్యవహరాలు, వసూళ్ళ పర్వంపై చర్చ జరిగింది. అంతర్గంగా కీలక శాఖలో పని చేసేందుకు పోస్టింగ్ కోసం 50వేల రూపాయలను దేవస్థానం అధికారి బేరం పెడితే అందులో 40వేల రూపాయలకు బేరం ఫైనల్ అయినట్లుగా ఆడియోలో చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆలయంలో జరుగుతున్న అవినీతి వ్యవహరాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతుందని భక్తులు మండిపడుతున్నారు.
అవన్నీ అసత్య ప్రచారాలు....
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారి రామకోటి రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడిన ఆడియో వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఆడియో, వీడియోలు అవాస్తవమని, ఆ అధికారి ఖండిస్తున్నారు. కరోనా సమయంలో వీడియో బయటకు వచ్చిందని, అప్పుడు తాను విధుల్లో లేనని అంటున్నారు. ప్రధాన అర్చకులు మాట్లాడిన ఆడియో వీడియో నిజమైనదా తేల్చాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయ అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు, ఏసీబీ అధికారులు విచారించి అవినీతి జరిగి ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు నోరు మెదపాలని.. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అవినీతిని ఆరోపణలపై విచారణ చేసి భవిష్యత్తులో ఆలయ సొమ్ము స్వాహా కాకుండా కాపాడాల్సిన బాధ్యత పాలకులు, అధికారులపై ఉందని అంటున్నారు.
దేవాదాయ శాఖలో విచారణ...
మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారిదిగా చెబుతున్న ఆడియో, వీడియో బయటకు రావటంతో దేవాదాయ శాఖ అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారని చెబుతున్నారు. దేవస్థానంలో అంతర్గత పోస్ట్ కోసం వేల రూపాయలు చేతులు మారటం వెనుక గల అసలు విషయాలు వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఉన్నతాధికారులు కమిటిని నియమించాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.