Pinnelli on Kotamreddy: కార్పొరేటర్ స్థాయి కూడా లేని కోటంరెడ్డిని జగన్ 2 సార్లు గెలిపించారు: పిన్నెల్లి ఘాటు వ్యాఖ్యలు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వ్యవహారంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు.
గడిచిన మూడు రోజులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వ్యవహారంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. కోటంరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అని అభిప్రాయపడ్డారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను గత ప్రభుత్వంలో టీడీపీలో ఎలా చేర్చుకున్నారో, ప్రస్తుతం అదే తీరుగా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ట్రాప్ చేసి తీసుకుంటున్నారని ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ట్రాప్, ట్యాపింగ్ లో దొరికిపోయినందునే శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి చెప్పారు.
కార్పొరేటర్ స్థాయి కూడా లేని వ్యక్తి కోటంరెడ్డి..
తనను అరెస్ట్ చేసుకోవచ్చునని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని, తప్పు చేస్తే ఎవరినైనా జైలుకు పంపిస్తారని ఆ విషయం అందరికీ తెలుసునన్నారు. కార్పొరేటర్ స్థాయి కూడా లేని వ్యక్తి అయిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండు సార్లు బి ఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీలో కాలు పెట్టేలా చేశారని చెప్పారు. ప్రజలతో ఒప్పించి, ఎమ్మెల్యేగా గెలిపించిన నేత వైఎస్ జగన్ పై శ్రీధర్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నువ్వు ఉన్నావు అని అవకాశం ఇచ్చారు తప్ప, నిన్ను మించిన పోటుగాళ్లు లేరు అని దానర్థం కాదంటూ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వీడ్కోలు పలుకుతుండగా గన్‌మెన్ల కంటతడి
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా తనకు ఉన్న నలుగురు గన్ మేన్ లలో ఇద్దరిని తొలగించిందని ఆవేదన చెందారు. అది ప్రభుత్వం తనకు ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు. తాను కూడా ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని, అందులో భాగంగా తనకు ఉంచిన ఇద్దరు గన్ మేన్‌లను కూడా ఇచ్చేస్తున్నానని అన్నారు. వారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నానని చెప్పారు. ఆదివారం (జనవరి 5) నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు గన్ మేన్ లకు వీడ్కోలు పలుకుతుండగా వారు కంటతడి పెట్టారు.
గన్ మెన్ల విషయంలో నెల్లూరు పోలీసులు అబద్ధాలు ఆడుతున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ‘‘నేను మాత్రం తగ్గేదే లేదు. ఇది సినిమా డైలాగు అనుకోవద్దు’’ అని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. మరింత కసితో ఇంకా ముందుకు పోతానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ విసిరారు. తనకు కార్యకర్తలు.. అభిమానులే రక్ష అని అన్నారు. తాడో పేడో తేల్చుకుంటానని తేల్చి చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా పోలీస్ సెక్యూరిటీ తగ్గించారు. దీనికి కారణం మాత్రం ఏపీ ప్రభుత్వం తెలపలేదు. ఈ మేరకు పోలీసులు కోటంరెడి భద్రతను తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చారు. ‘గడపగడపకు..’ కార్యక్రమం మొదలైనప్పటి నుంచే ఎమ్మెల్యే కోటంరెడ్డికి అదనంగా ఇద్దరు గన్ మేన్లను ఇచ్చామని, ఇప్పుడు తీసేస్తున్నామని పోలీసు వర్గాలు మాత్రం తెలిపాయి.