Pinnelli Ramakrishna Reddy News : ‘పిన్నెల్లి’కి నేటితో ముగుస్తున్న గడువు, పల్నాడు జిల్లాలో టెన్షన్
Pinnelli Ramakrishna Reddy Case Updates: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేయకుండా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు ఈ రాత్రితో ముగియనుంది.
YSRCP Leader Pinnelli: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే (Macherla Former MLA) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy)ని పోలీసులు అరెస్టు చేయకుండా హైకోర్టు (AP High Court) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు గురువారం రాత్రితో ముగియనుంది. తదుపరి చర్యలు తీసుకోవడానికి హైకోర్టు ఆదేశాల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. బుధవారం సైతం పిన్నెల్లి జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లి సంతకం చేశారు. ప్రస్తుతం పిన్నెల్లి నరసరావుపేట పట్టణ శివారు రావిపాడు రెవెన్యూ పరిధిలో ఒక ప్రైవేటు విల్లాలో ఉంటన్నారు.
భద్రత పెంపు
పిన్నెల్లి తప్పించుకుని వెళ్తారనే సమచారం నేపథ్యంలో ఆయన ఉంటున్న ఇంటి వద్ద పోలీసులు భద్రత మరింతగా పెంచారు. తప్పించుకుని వెళ్లిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు సిబ్బందికి పహారా కాస్తున్న కాస్తున్నారు. పోలీసులు శుక్రవారం పిన్నెల్లిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పల్నాడు జిల్లాలో ఏం జరుగుతుందనే ఆసక్తి, టెన్షన్ అక్కడి ప్రజల్లో నెలకొంది.
పిన్నెల్లిపై ఉన్న కేసులు ఇవే
రెంటచింతల మండలం పాల్వాయిగేటు ఈవీఎంను ధ్వంసం, టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై హత్యాయత్నం, మహిళ చెరుకూరి నాగశిరోమణిపై దౌర్జన్యం, కారంపూడిలో అలర్లు, సీఐ నారాయణస్వామిపై దాడి ఆరోపణల కింద ఎమ్మెల్యే పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయా కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేస్తారని పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేయకుండా జూన్ 6 వరకు రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి రోజు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు హాజరు కావాలని సూచించింది. నరసరావుపేట దాటి వెళ్లొద్దని, ఈ క్రమంలో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోనే ఉండాలని, ఎక్కడ ఉంటున్నారో పల్నాడు ఎస్పీకి నిత్యం సమాచారం ఇవ్వాలని సూచించింది.
దేశం దాటి వెళ్లొద్దని, గురజాల మేజిస్ట్రేట్ కోర్టులో పాస్‌పోర్టును అప్పగించాలని పిన్నెల్లిని ఆదేశించింది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు తెలిపింది. జిల్లాలో శాంతి భద్రతల సమస్యలను సృష్టించొద్దని పిన్నెల్లికి సూచించింది. అనుచరులను నియంత్రించే బాధ్యత పిన్నెల్లి తీసుకోవాలని తేల్చిచెప్పింది. కేసుల గురించి మీడియాతో మాట్లాడవద్దని, సాక్షులను ప్రభావితం చేయవద్దని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే తరఫున ఆయన న్యాయవాదులు ఇటీవల గురజాల కోర్టులో పిన్నెల్లి పాస్‌పోర్టును సమర్పించారు.