సీట్ల లెక్క తేల్చేస్తారా ? ఎన్నికల యుద్ధం ప్రకటించేస్తారా ? జనసేన కీలక భేటీ
పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత...జనసేనాని శనివారం పార్టీ నేతలతో విస్త్రత స్థాయి నిర్వహిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు మారిపోయాయి. మొన్నటి వరకు ఎటూ తేల్చుకోలేని పవన్ కల్యాణ్...సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసిన తర్వాత వ్యూహాన్ని మార్చేశారు. బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ...తెలుగుదేశం పార్టీతో కలిసి బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత...జనసేనాని శనివారం పార్టీ నేతలతో విస్త్రత స్థాయి నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులతో భాగంగా పోటీ చేయాల్సిన అసెంబ్లీ సీట్లు, ఏయే నియోజకవర్గాల అన్న అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పవన్ కల్యాణ్ పలు సూచనలు, సలహాలు చేయనున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు, పీఏసీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు జిల్లాల అధ్యక్షులు పాల్గొంటారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, కార్యకర్తలపై అక్రమ కేసులు, కౌలు రైతు భరోసా యాత్ర వంటి అంశాలపైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం 4న మంగళగిరిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నారు. టీడీపీతో కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఉమ్మడి కార్యచరణపై జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. టీడీపీ, వైసీపీ జాయింట్ యాక్షన్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే దానిపైనా ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అవడంతో...ఎన్ని సీట్లు డిమాండ్ చేయాలి ? ఎవరెవరు ఎక్కడెక్క పోటీ చేయాలి వంటి అంశాలపై పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఇప్పటికే 20 నుండి 25 లోపు ఎమ్మెల్యే సీట్లు, 2 నుండి 3 ఎంపీ సీట్లు జనసేనకు కేటాయించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయ్.
రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత మీడియాతో సుదీర్గంగా మాట్లాడారు. చంద్రబాబుతో ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే విభేదించానన్నారు పవన్ కల్యాణ్. వ్యక్తిగతంగా ఏనాడూ ఘర్షణ లేదని... 300 కోట్ల స్కామ్ పేరు చెప్పి మాజీ సీఎంకు అవినీతి మరక అంటగడుతున్నారని మండిపడ్డారు. గుజరాత్‌లో ప్రారంభమైన కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారని, అది హార్డ్‌వేర్‌ను సరఫరా చేస్తుందని, ఏదైనా తప్పు జరిగితే ఆ సంబంధిత వ్యక్తులను విచారించాలని అన్నారు. సైబరాబాద్ వంటి సిటీని నిర్మించిన వ్యక్తిని ఇలాంటి కేసులో ఇరికించడం బాధాకరమన్న పవన్, ఈడీ విచారించాల్సిన ఇలాంటి కేసులను రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుందని మండిపడ్డారు.
టీడీపీ-జనసేన పొత్తుపై స్పందించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, చంద్రబాబు భేటీ తరువాత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. ఇంత కాలం ప్రజల్లో అభిమానులు ఉన్న అనుమానాలు సందేహలు పటాపంచలు అయ్యాయని చెప్పారు. పవన్ ప్రకటన వైసీపీకీ చరమగీతం పలకడానికి నాందిగా అభివర్ణించారు. జనసేన, తెలుగుదేశం పార్టీలు కలయికతో 160 సీట్లు వస్తాయని నమ్మకం ఉందన్నారు. జనసేన కలయికతో టీడీపీ మరింత బలం పెరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంటే 130 స్థానాల్లో గెలుపొందడం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు. ద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి సానుభూతి పెరిగిందే తప్ప ఒరిగిందేమీ లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 88 సీట్లలో గెలుపొందడం ఖాయమన్నారు.