Pawan Kalyan: జనసేన 10 ఏళ్ల మైలురాయి - ఈనెల 11 నుంచి పవన్ కళ్యాణ్ బిజీబిజీ, మంగళగిరిలో బహిరంగ సభ
Janasena Chief Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగు రోజుల షెడ్యూల్ ను పవన్ కళ్యాణ్ ఖరారు చేసుకున్నారు.
Janasena Chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపటి (మార్చి 11) నుంచి నాలుగు రోజులు పాటు పర్యటన షెడ్యూల్ ఖరరారైంది. 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్బావ సభ నిర్వహించనుండగా అంతకు మూడు రోజులు ముందు పవన్ షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నారు..
రేపటి నుంచి పవన్ బిజీ బిజీ...
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాలుగు రోజుల షెడ్యూల్ ను పవన్ కళ్యాణ్ ఖరారు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన 11వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకుంటారు. అనంతరం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళతారు. 11వ తేదీ మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ పాల్గొంటారు. మార్చి 12వ తేదీన పార్టీ నేతలతో కలసి పవన్ కళ్యాణ్ సమీక్షిస్తారు. అదే సమయంలో పార్టీలో కొందరు నేతలు, కార్యకరక్తల చేరికల కార్యక్రమాన్ని పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది.
కాపు నేతలతో సమావేశం...
అంతే కాదు మధ్యాహ్నం నుంచి మరో కీలక సమావేశం పవన్ నిర్వహిస్తారు. చేగొండి హరి రామజోగయ్య ఆధ్వర్యాన కాపు సంక్షేమ సేన ప్రతినిధులతోనూ పవన్ సమావేశం అవుతారు. మార్చి 13వ తేదీన 11 గంటలకు ఆవిర్భావ సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. 14వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు మంగళగిరి కార్యాలయం నుంచి జనసేన ఆవిర్భావ సభకు బయలుదేరతారు. సాయంత్రం ఐదు గంటలకు మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. పార్టీ శ్రేణులు ఆవిర్భావ సభ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు, తాడిగడప.. పోరంకి, పెనమలూరు, పామర్రులో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలు...
జనసేన పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గాల వారీగా ఇప్పటికే పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా సమన్వయకర్తలను కూడ నియమించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల నుండి ప్రతి నియోజవకర్గం నుండి నాయకులకు సమన్వయకర్తల బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు పార్టీ పబ్లిక్ అకౌంట్స్ కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణకు ప్రాధాన్యత....
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే క్యాడర్ కోసం ప్రత్యేకంగా మరో కమిటిని కూడ జనసేన ఏర్పాటు చేసింది. తెలంగాణకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆహ్వనాలు, ఆతిథ్యం కోసం ఈ కమిటీ పని చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి
స్పెషల్ అట్రాక్షన్ గా వారాహి...
జనసేన పార్టీ 10వ ఆవిర్బావ సభలో వారాహి వాహనం స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. వారాహి వాహనంపై ప్రయాణిస్తూ పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్రం కార్యాలయం నుంచి మచిలీపట్టణం సభకు వెళ్ళనున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వారాహి వాహనానికి స్పెషల్ క్రేజ్ వచ్చింది. ఎన్నికల ప్రచారం కోసం పవన్ ఇదే వాహనాన్ని వినియోగించనున్నారు. వారాహి వాహనం పై రాజకీయంగా విమర్శలు వచ్చిన క్రమంలో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే వాహనం వారాహిని చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు 14వ తేదీన మంగళగిరి నుంచి విజయవాడ మీదగా మచిలీపట్టణంకు వెళ్ళే రూట్ లో ట్రాఫిక్ డైవర్షన్ పై పోలీసులు చర్యలు చేపట్టారు.