Where was Kohinoor Diamond Actually Found: కోహినూర్ వజ్రం: తెలుగు నేలపై పుట్టి లండన్ రాణి కిరీటంలో చేరిన వజ్రం కథ! పవన్ చెప్పిన చరిత్ర రహస్యాలు
Kohinoor Diamond: కోహినూర్' డైమండ్‌పై పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే నిజంగానే ఆంధ్రలో లభించిన కోహినూర్ వజ్రం ఎందుకు బ్రిటన్‌లో ఉంది.

Who was First Owner of Kohinoor Diamond: 'హరిహర వీరమల్లు' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ 'కోహినూర్' డైమండ్ గురించి మాట్లాడడంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది ఈ అపురూప వజ్రం. తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం చరిత్ర చాలా గొప్పది. అయితే ఆంధ్ర ప్రాంతంలో దొరికిన ఈ డైమండ్ ఎక్కడో లండన్‌లో ఉన్న బ్రిటిష్ రాణి కిరీటంలోకి ఎలా చేరిందో ఇప్పుడు చూద్దాం.
కాకతీయ సామ్రాజ్యంలో దొరికిన "వెలుగుల కొండ " వజ్రం
కోహినూర్ అనే మాటకు పర్షియన్"వెలుగుల కొండ" అని అర్ధం. కృష్ణా తీరంలోని "కొల్లూరు " గనుల్లో ఈ వజ్రం దొరికినట్టు చెబుతారు. ఒకప్పుడు భారతదేశంలో అతి విలువైన వజ్రాలు ఈ గనుల్లోనే దొరికేవి. 19 శతాబ్దం వరకూ ఇక్కడ వజ్రాల తవ్వకం పనులు తీవ్రంగా జరిగేవి. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మునిగిపోయింది. కాకతీయ సామ్రాజ్య కాలంలో కొల్లూరు గనుల్లో దొరికిన భారీ వజ్రం గురించి ఆనాటి రాతల్లో ఉంది.
కాకతీయులపై దాడి చేసిన ఢిల్లీ సుల్తానుల (అల్లావుద్దీన్ ఖిల్జీ) ప్రతినిధి మాలిక్ కపూర్ ఒక భారీ వజ్రాన్ని తీసుకువచ్చినట్టు గఖిల్జి తన ఆత్మకథలో రాసుకున్నాడు. అప్పటి నుంచి 1526లో మొగల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీంలోడిని ఓడించి ఢిల్లీని ఆక్రమించుకునేంత వరకు వివిధ వంశాల ఢిల్లీ సుల్తాన్‌ల అధీనంలోనే ఆ భారీ వజ్రం ఉంటూ వచ్చింది. అప్పటి నుంచి ఆ వజ్రానికి "బాబర్ డైమండ్ " అనే పేరు వచ్చింది. అంతకు ముందు ఆ వజ్రంకి ఏ పేరు ఉండేది అనేది చరిత్రలో స్పష్టత లేదు. కానీ చాలామంది దానిని కాకతీయ వజ్రంగా పిలిచేవారని అంటారు.
అప్పటి నుంచి 225 సంవత్సరాల పాటు ఆ వజ్రం మొగల్ చక్రవర్తులు వశంలోనే ఉంటూ వచ్చింది. ఐదో మొగల్ చక్రవర్తి షాజహాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయించిన (1635) 'నెమలి సింహాసనం'లో తన ఖజానాలోని విలువైన వజ్రాలను పొదిగించాడు. వాటిలో కోహినూర్ కూడా ఒకటి.
ఢిల్లీ నుంచి ఇరాన్ కు చేరిన కోహినూర్ (1738)
అప్పటి నుంచి ఒక 100 ఏళ్ల తర్వాత మొగల్ సామ్రాజ్యం అత్యంత పతనావస్థకు చేరుకున్న సమయంలో పర్షియా (ఇరాన్)నుంచి ఢిల్లీ పై 1738లో దాడి చేసిన నాదిర్షా నెమలి సింహాసనాన్ని, ఢిల్లీ ఖజానాని దోచుకున్నాడు. అప్పటి మొగల్ సుల్తాన్ మహమ్మద్ షా వజ్రాన్ని తన తలపాగాలో దాచేసాడు. ఈ విషయాన్ని ఒక ద్రోహి ద్వారా తెలుసుకొన్న నాదిర్ షా నిండుకొలువులో స్నేహపూర్వకంగా తలపాగాలు మార్చుకుందామని ప్రతిపాదించి స్వయంగా మహమ్మద్ షా తలపాగాను దానితోపాటు కోహినూర్ తీసుకుని వెళ్లిపోయాడని చరిత్రకారులు చెబుతారు.
అప్పుడు తొలిసారి ఆ వజ్రాన్ని కళ్ళారా చూసిన నాదిర్ షా దానికి కోహినూర్ అంటే "వెలుగుల కొండ "అనే పేరు పెట్టాడు. సంఘటన గురించి నాదీర్ష ఆత్మకథ రాసిన నాదిర్ షా జీవిత కథ రాసిన మహమ్మద్ ఖాజిమ్ స్పష్టంగా పేర్కొన్నాడు. కోహినూర్ తోపాటు అత్యంత విలువైన 'తైమూరు రూబీ, దర్యానూర్ 'వజ్రాలను సైతం నాదిర్ ఇరాన్ కి పట్టుకుపోయాడు.
ఇరాన్ నుంచి ఆఫ్గాన్‌కు అక్కడి నుంచి పంజాబ్ చేరిన కోహినూర్
1747లో నాదిర్ షా హత్యకు గురయ్యాడు. అతను మనవడు కోహినూర్ వజ్రాన్ని ఆఫ్గాన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన అహ్మద్ షా దురానీకి 1751లో తనకు రక్షణ కల్పించినందుకు ప్రతిగా ఇచ్చేశాడు. దురాని మనవడు షా సుజా 1813లో తన రాజ్యం కోల్పోయాక వజ్రంతోపాటు నాటి సిక్కు రాజ్యంలో భాగమైన లాహోర్‌కు పారిపోయాడు. అక్కడ తన కుటుంబ రక్షణ కోసం కోహినూర్‌ను సిక్కురాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్‌కు ఇచ్చేశాడు.
అలా కోహినూర్ మళ్ళీ ఇండియాకు చేరుకుంది. దానికి ప్రతిగా రంజిత్ సింగ్ 1,25,000 రూపాయలను ఆరోజుల్లోనే షా సుజాకు చెల్లించాడు. తన పట్టపు గుర్రం నుదుటిపై నుంచి పలకంలో విలువైన వజ్రాలతోపాటు కోహినూర్‌ను కూడా అలంకరించి పర్వదినాల్లో రజిత్ సింగ్ దానిపై ఊరేగేవాడట. 1839లో రంజిత్ సింగ్‌కు మూడోసారి స్ట్రోక్ వచ్చింది. ఇక తాను బతకడని తెలుసుకున్న రంజిత్ మాట్లాడలేని స్థితిలో కోహినూరు వజ్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయానికి ఇచ్చేయాల్సిందిగా సైగలు చేశాడని చెబుతారు. అయితే అది పంజాబ్ రాజ్యానికి చెందిన ఆస్తి అని అది సిక్కు సామ్రాజ్య పరిధిలు దాటి బయటికి వెళ్లకూడదని మంత్రులు కుటుంబ సభ్యులు భావించడంతో అదా ఆయన కుమారుడు ఖారక్ సింగ్ చేతుల్లోకి వెళ్ళింది.
సిక్కుల చేతి నుంచి బ్రిటీష్ రాజ్యంలోకి వెళ్ళిపోయిన కోహినూర్
రంజిత్ సింగ్ కొడుకు ఖారక్ సింగ్ పై కుట్ర చేసిన జమ్మూకశ్మీర్ రాజు గులాబ్ సింగ్ అతడిని అతడి కుమారుడిని చంపి వజ్రాన్ని కశ్మీర్‌కి తీసుకుపోయాడు. కానీ వెంటనే రంజిత్ సింగ్ సోదరుడు సిక్కు సామ్రాజ్య చక్రవర్తి షేర్ సింగ్‌కు కోహినూర్ వజ్రాన్ని ఇచ్చేసి శరణ కోరాడు. కానీ రెండేళ్ల తర్వాత షేర్ సింగ్ హత్యకు గురయ్యాడు. అతను కుమారుడు పసివాడైన దులీప్ సింగ్‌ని 1843లో రాజును చేసిన గులాబ్ సింగ్ ఒకవైపు జమ్ము రాజుగా మరోవైపు సిక్కురాజ్య ప్రధానమంత్రిగా రెండు బాధ్యతలు నిర్వహించేవాడు. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళతో సిక్కులకు విభేదాలు రావడంతో రెండు యుద్దాలు 1846,1849 జరిగాయి. ఆ రెండు రాజ్యాల మధ్య సంధి ఒప్పందం జరిగే సమయంలో సిక్కులు కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ మహారాణి క్వీన్ విక్టోరియాకు ఇచ్చేశారు.
అప్పటి నుంచి కోహినూర్ బ్రిటిష్ రాజవంశం చేతిలోనే ఉంటూ వస్తోంది. 1852లో కోహినూర్‌ను కట్ చేసి మరింత అందంగా తీర్చిదిద్దారు. కానీ 187క్యారెట్‌ల బరువు ఉండాల్సిన వజ్రం105 క్యారెట్‌లకు పడిపోయింది. 1901లో విక్టోరియా మరణం తర్వాత వరుసగా బ్రిటిష్ రాణుల చేతుల్లోనే కోహినూర్ పొదిగిన కిరీటం ఉంటూ వచ్చింది. ప్రస్తుతానికి బ్రిటిష్ రాజు 3వ చార్లెస్ కోహినూర్‌కు హక్కుదారు. కానీ ఆయన దానిని ధరించడు. ప్రస్తుతానికి కోహినూర్ పొదిగిన కిరీటం రాజవంశ మ్యూజియంలో భద్రపరిచి ఉంది.





















