Fact Check: ఏపీ పదో తరగతి ఫలితాల విడుదలపై పుకార్లు- అసలు 10th రిజల్ట్స్ ఎప్పుడంటే?
జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. ఫలితాల విడుదలపై ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి ఫలితాలపై రోజుకో తేదీని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వివిధ ఛానల్స్ లోగోలతో ఉండే స్క్రీన్‌షాట్లను పోస్టు చేస్తూ ఇవాళే పదోరగతి ఫలితాలు అంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర గందరగోళంలో పడిపోతున్నారు. తెలిసిన వారికి ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారు.
జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. ఫలితాల విడుదలపై ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇస్తున్నారు. ఎలాంటి సమాచారమైనా అధికారిక ప్రకటన ఉంటుందని అంతవరకు ఎలాంటి పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
పదో తరగతి వాల్యుయేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మే 5వ తేదీ లేదా 7వ తేదీన ఫలితాలు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరీక్షలు ముగిసిన నాలుగో రోజు నుంచే వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీలయితే వచ్చే పదో తేదీలోపు కాదంటే 12వ తేదీ లోగా ఫలితాలు విడుదలకు ఛాన్స్ ఉందని అని అంటున్నారు.
ఈ విషయాన్ని సాక్షాత్తూ విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ మీడియాతో పంచుకున్నారు. అయితే ఈలోపే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగిపోతోంది. పదో తరగతి ఫలితాలపై విద్యార్దులను గందరగోళానికి గురి చేసేలా తేదీలను ప్రకటించినట్లుగా ప్రచారం జరగటంతో విద్యా శాఖ అదికారులు సైతం రంగంలోకి దిగారు..
తప్పుడు ప్రచారాలు నమ్మోద్దంటున్న డైరెక్టరేట్ ఆఫ్ ఎగ్జామ్స్
పదో తరగతి ఫలితాలపై వరుసగా వివిధ రకాల తేదీలు ప్రకటిస్తున్నారు గుర్తు తెలియన వ్యక్తులు. అయితే ఇదంతా అధికారికం కాదు. విద్యాశాఖ అధికారులు ప్రకటించినట్టుగానే చెబుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దీనిపై డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ డి.దేవానందరెడ్డి స్వయంగా ప్రకటన జారీ చేశారు. అసలు ఇప్పటి వరకు ఫలితాల తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటిచలేదని స్పష్టత ఇచ్చారు. ఇలాంటి ప్రచారాలను నమ్మోద్దని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను పూర్తిగా ఖండించి వాస్తవాలు తెలియ చేసేందుకు చివరకు ఆయనే స్వయంగా వీడియో ప్రకటన చేయాల్సి వచ్చింది.
కళ్యాణ మండపాల్లో వాల్యుయేషన్
పరీక్షలకు సంబందించిన ప్రశ్నా పత్రాలను దిద్దేందుకు అధ్యాపకులకు పూర్తి స్థాయి సదుపాయాలు కల్పనకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఆయా సెంటర్లలో అతి కొద్ది సదుపాయాలు మధ్యే ప్రశ్నాపత్రాలను దిద్దే పరిస్థితి ఉంది. దీనిపై అనేక సార్లు అధ్యాపకులు, విద్యార్ది సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళనలు చేశారు. పరీక్ష కేంద్రాల్లో సదుపాయాలు లేవని,మహిళా ఉపాధ్యాయులకు కనీసం రెస్ట్ రూంలు కూడా లేకుండాపోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేపర్లు దిద్దే ఉపాధ్యాయులకు కనీసం భోజన సదుపాయాలు కూడా లేకపోవటంతో ఆందోళలు వ్యక్తం అయ్యాయి. పరీక్షలు వేసవి కాలంలో రావటం, వాటిని దిద్దేందుకు కూడా మండే ఎండల్లోనే ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడుతున్నారు.
వీటన్నింటికి చెక్ పెట్టేందుకు విద్యా శాఖ ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఆయాన కేంద్రాలకు సమీపంలోని ఎయిర్ కండిషన్డ్ కళ్యాణ మండపాలను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని భావిస్తోంది. అక్కడే గట్టి భద్రత మధ్య పేపర్లు దిద్దించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ఎడాది నుంచే ఈ విధానం అమలులోకి తేవాలని భావించినప్పటికి చాలా చోట్ల కళ్యాణ మండపాలు ముందుగానే బుకింగ్ అయ్యాయి. దీంతో వచ్చే ఎడాది నుంచి ముందుగానే కళ్యాణ మండపాలను బుక్ చేసుకోవటం ద్వార ఎయిర్ కండిషన్ సదుపాయాలతోపాటు వాష్ ఏరియా విశ్రాంతికి అవసరమైన స్థలం కూడా ఉంటుంది. కాబట్టి ఫలితాలు విడుదల కూడా వేగంగా జరిగే అవకాశం కలుగుతుందని విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు.