Andhra Pradesh News: అమరావతిలో రెండో ల్యాండ్ పూలింగ్ ఆపండి, ఇంకా ఎంతమందిని చంపుతారు: సిపిఎం
AP Capital Amaravati | ఏపీ రాజధానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, రైతుల ఆవేదనకు నిదర్శనమే రైతు రామారావు మరణం అని, ల్యాండ్ పూలింగ్ ఆపాలని సీపీఐ డిమాండ్ చేసింది.

రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కాలయాపన చేస్తున్నదని, దీంతో మనోవేదనకు గురైన రైతు దొండపాటి రామారావు గుండెపోటుతో మరణించారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు..
మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ భార్గవ్ తేజ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లిన మందడం రైతు దొండపాటి రామారావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి మరణించిన సంఘటన ఇప్పుడు రాజధాని ప్రాంతం లో సంచలనం గా మారింది. శనివారం ఆయన భౌతిక కాయాన్ని మందడం లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న బాబురావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై. నేతాజీ రాజధాని ప్రాంత కార్యదర్శి ఎం. రవి తదితరులు మందడంలో రామారావు నివాసానికి వెళ్లి భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రామారావు మరణం బాధాకరమని సంతాపం వ్యక్తం చేశారు.

రాజధాని మొదటి దశ పూర్తి కాకుండా రెండో దశకు భూములు తీసుకోవడం తప్పు: సిపిఎం నేతలు
సిపిఎం నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని, వారి సమస్యలను పరిష్కరించడం లేదని తెలిపారు. సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 11 ఏళ్ల తర్వాత రాజధాని అమరావతి సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగానే ఉన్నాయని, రైతుల, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర లేదని అన్నారు. వారికి ఇవ్వాల్సిన ప్లాట్లు అభివృద్ధి చేసుకుంటానికైనా అవకాశం ఇవ్వడం లేదని, రైతులు పలు సందర్భాల్లో తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు.
ఒకవైపు తొలి దశలో సమీకరించిన భూములనే అభివృద్ధి చేయకుండా రెండో దశ పూలింగ్ అంటూ తొలిదశ రైతులను మరింత ఆవేదనకు గురి చేశారని పేర్కొన్నారు. పైగా మందడం చుట్టూ 60 మీటర్ల వెడల్పుతో రోడ్లు ఉన్నా, ఊరి మధ్యలో నుండి రోడ్డు వేయాలనే పేరుతో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారని ఇప్పటికే భూములు ఇచ్చి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులు ఇళ్లు కూడా తీసుకుంటామనడంతో తీవ్రవత్తిడికి గురయ్యారని తెలిపారు. గతంలో వారు పోలింగ్ కు ఇచ్చిన భూములకు ఇచ్చిన ప్లాట్లు వాగు ప్రాంతంలో ఉన్నాయని సమావేశంలోనే మంత్రి ముందు రామారావు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఇప్పటికే భూములు ఇచ్చి తీవ్రంగా నష్టపోయామని ఆవేదనతో ఉన్న రైతులకు రెండో దశ పూలింగ్ నిర్ణయం మరింత ఒత్తిడికి గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు రామారావు మరణంతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, రెండో దశ పోలింగ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మందడం గ్రామం మధ్యలో నుండి వెళ్లే రహదారి ఏర్పాటు నిర్ణయాన్ని పునరాలోచించాలని సూచించారు. రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. తొలుత రాజధానిని ప్రకటించిన తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ప్రచార ఆర్భాటంతో మునిగిందని, అనంతరం అధికారంలోకి వచ్చిన వైసిపి మరింత ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు. మరోసారి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం తమ ఆశలను నెరవేరుస్తుందని రైతులు
భావించారని, కానీ ఈ ప్రభుత్వం కూడా వారి ఆశలను చేస్తున్నదని అన్నారు.
పదేళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా రాజధాని కి న్యాయం చేయలేదని, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని విమర్శించారు. 11 ఏళ్లలో కనీసం చట్టబద్ధత కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పార్లమెంట్ లో చట్టబద్ధతపై బిల్లు పెడతామని చెప్పారని, అది కూడా చేయలేదని అన్నారు. ఈ నేపథ్యంలో రైతుల్లో తీవ్ర ఆవేదన పెరిగిందని వారి బాధలకు, ఆవేదనకు నిదర్శనమేరైతు రామారావు మరణమని పేర్కొన్నారు. అమరావతి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రామారావు కుటుంబానికి, రాజధాని ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు.





















