Jagan Adani Meet: జగన్‌తో అదానీ రహస్య భేటీలో ఆ డీల్! రూ.1,400 కోట్ల ఆఫర్ - సీపీఐ రామక్రిష్ణ
ఈ వ్యవహారంలో జగన్‌కు రూ.1,400 కోట్ల కమిషన్ రానుందని రామక్రిష్ణ ఆరోపించారు. ఈ విషయం బయటకి రాకుండా సమావేశాన్ని రహస్యంగా నిర్వహించారని అన్నారు.
ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఆదానీ గ్రూపు అధిపతి గౌతమ్ ఆదానీ వ్యక్తిగతంగా సమావేశం కావడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. స్వయంగా ఆదానీ ప్రత్యేక విమానంలో సీఎం ఇంటికి రావడం, ఆ భేటీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో అనేక ఊహాగానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి చెందిన 1,400 ఎకరాల భూముల అమ్మకానికి సంబంధించిన ఓ ఒప్పందం కోసమే సీఎం జగన్‌ను అదానీ కలిశారని అన్నారు. ఈ వ్యవహారంలో జగన్‌కు రూ.1,400 కోట్ల కమిషన్ రానుందని ఆరోపించారు. ఈ విషయం బయటకి రాకుండా సమావేశాన్ని రహస్యంగా నిర్వహించారని అన్నారు. విజయవాడలో శనివారం (అక్టోబరు 1) ఆయన విలేకర్లతో మాట్లాడారు.
ఆదానీ గ్రూపు పెట్టుబడుల సమావేశం అయితే సంబంధిత శాఖ అధికారులు కూడా ఉంటారు కదా అని ప్రశ్నించారు. సమావేశ వివరాలను ఎందుకు రహస్యంగా ఉంచారని అడిగారు. విశాఖ ఉక్కుకు చెందిన 1,400 ఎకరాలను అదానీకి కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెడీ అయ్యాయని ఆరోపించారు. తద్వారా వచ్చే కమిషన్ రూ.1,400 కోట్లు తీసుకొని ఎన్నికలకు వెళ్లాలని జగన్ ఆలోచనగా ఉందని రామక్రిష్ణ అన్నారు. అసలు విమానాశ్రయం నుంచి అదానీ వెళ్లేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారని.. ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం ఇంతగా దిగజారి ఉండదని అన్నారు.
ఇప్పటికే ఏపీలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులను ప్రభుత్వం అదానీకి అప్పగించిందని.. విండ్, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులూ ఇచ్చిందని గుర్తు చేశారు. థర్మల్ పవర్ విషయంలోనూ అదానీ కంపెనీ నుంచే బొగ్గు కొనుగోలు చేస్తున్నారని అన్నారు.
మరోవైపు, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సీఎం జగన్ బినామీదే అని అన్నారు. ఈ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, అదానీ కలిసి స్మార్ట్‌మీటర్ల కాంట్రాక్టు దక్కించుకున్నారని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో మీటరు బిగించేందుకు రూ.7,100-రూ.7,900 ఖర్చు వసూలు చేస్తుంటే, ఇక్కడ రూ.36 వేలుగా నిర్ణయించారని అన్నారు. ఇందులో తాడేపల్లి ప్యాలెస్‌కు మామూళ్లు వెళ్తున్నాయని అన్నారు.
ఎవరు అమ్ముడుపోయారో
కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని.. అసలు కమీషన్ల కోసం వాళ్లే అదానీకి అమ్ముడుపోయారని రామక్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.