Family Doctor: ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం దేశానికి రోల్ మోడల్, 24 గంటల వైద్య సేవలు - సీఎం జగన్
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం వేదికగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.
రాష్ట్రంలో పేద ప్రజలకు 24 గంటలు వైద్యం ఉచితంగా అందాలనే ఉద్దేశంతో ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లుగా సీఎం జగన్ చెప్పారు. దేశచరిత్రలోనే వైద్యసేవల విధానంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టాం. ఈ కాన్సెప్ట్ దేశ చరిత్రలోనే రోల్ మోడల్‌గా నిలుస్తుందని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఏపీలో ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం వేదికగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఫ్యామిలీ డాక్టర్ సేవలు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్ లు ఉంటాయని, ఇందులో 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానిస్తామని చెప్పారు.
వీటిలో సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు అందుతాయని వివరించారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారని, ఇక్కడ ఎప్పుడు ఫోన్ చేసినా డాక్టర్ అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ ఫ్యామిలీ డాక్టర్ పరిధిలో నయం కాని రోగాలను వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ద్వారా ఆరోగ్యశ్రీకి రిఫర్ చేస్తారని చెప్పారు.
డాక్టర్ కోసం ప్రజలు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఆస్పత్రులు, డాక్టర్ల చుట్టూ ఆరోగ్యం దెబ్బతిన్నవారు తిరగాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చామని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం వల్ల వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చని, విలేజ్ క్లినీక్‌లో సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు ఉంటారని చెప్పారు.
తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి - జగన్
చిలకలూరి పేట సభలో ఎప్పటిలాగే సీఎం జగన్ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. తనను ఎదుర్కోలేక చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని జగన్ వాపోయారు. స్కాములు తప్ప స్కీములు తెలియవని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా, దోచుకో తినుకో పంచుకో అనేది మాత్రమే తెలిసిన లంచావతారాలకు, గజ దొంగలకు, వయసు పెరిగినా బుద్ధి పెరగని క్రిమినల్ వాళ్లు అని అభివర్ణించారు. సామాజిక అన్యాయం తప్ప, న్యాయం తెలియని పరాన్నజీవులు అంటూ మాట్లాడారు. వీరంతా చంద్రబాబు, ఎల్లో మీడియా రూపంలో కనిపిస్తారని చెప్పారు. వీరికి తోడుగా దత్తపుత్రుడు కలిశాడని అన్నారు. వీళ్లందరూ మీ బిడ్డను ఎదుర్కోలేక కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. జిత్తులు, ఎత్తులు, పొత్తులు, కుయుక్తులతో వీళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం వేదికగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఫ్యామిలీ డాక్టర్ సేవలు ప్రారంభం అవుతాయని చెప్పారు.