అర్థరాత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- దేనిపై చర్చించారంటే?
పోలవరంతోపాటు విభజన సమస్యల పరిష్కారానికి రిక్వస్ట్ చేసినట్టు తెలుస్తోంది. విభజన జరిగి తొమ్మిదేళ్లు అయినా ప్రధాన సమస్యలు పరిష్కారం కావడం లేదని అమిత్‌షా దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లారని చెబుతున్నారు.
ఢిల్లీలో ఉన్న ఏపీ సీఎం జగన్ రాత్రి 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని సమస్యలు, రాష్ట్రవిభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ముందస్తుగా పదివేల కోట్లు మంజూరు చేయాలని అమిత్‌షాను రిక్వస్ట్ చేసినట్టు సీఎంవో ప్రకటించింది.
పోలవరంతోపాటు రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి కూడా రిక్వస్ట్ చేసినట్టు తెలుస్తోంది. విభజన జరిగి తొమ్మిదేళ్లు అయినా ప్రధాన సమస్యలు పరిష్కారం కావడం లేదని అమిత్‌షా దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లారని చెబుతున్నారు. దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తెలంగాణ వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.
అమిత్‌షాతో సమారు 40 నిమిషాల పాటు సీఎం జగన్ సమావేశమయ్యారు.
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు చాలా వరకు అమలు కాలేదని వాటిని వీలైనంత త్వరగా అమలు చేయాలని రిక్వస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పోలవరం డయా ఫ్రం వాల్ దెబ్బతిందని... దాని మరమ్మతుకు 2020 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందని వాటిని విడుదుల చేయాలని వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 2600.74 కోట్లు ఖర్చు పెట్టిందని వాటిని రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు అంచనాలను 55,548 కోట్లుగా టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ తేల్చిందని వాటిని కూడా జమ చేయాలని కోరారు.
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్రానికి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద ఇంకా రావాల్సిన 36,625 కోట్లను వెంటనే విడుదల చెయ్యాలని కోరారు జగన్. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా రుణపరిమితి తగ్గించేశారని... ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు.
తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు ఉంకా విడుదల కాలేదని వాటిని ఇచ్చేలా చూడాలన్నారు. 2014-2017 మధ్య విద్యుత్ సరఫరా చేసినందుకు 7,058 కోట్లు రావాల్సి ఉందని గుర్తు చేశారు. పీఎంజీకేఏవై కింద రాష్ట్ర ప్రభుత్వమే 56 లక్షల కుటుంబాలకు రేషన్ ఇస్తోందని.... దీనికి నిబంధనలు సడలించి రాష్ట్రంపై పడుతున్న 5,527 కోట్ల భారాన్ని తగ్గించాలన్నారు. రాష్ట్రానికి 77వేల టన్నుల రేషన్ సరకులు కేటాయించాలని రిక్వస్ట్ చేశారు.
ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పారని అది అమలు అయ్యేలా చూడాలన్నారు. దీని వల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్నుల రాయితీ లభిస్తాయని ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. కేంద్రం మంజూరు చేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీలు మాత్రే ఉన్నాయని... మిగిలిన 12 కాలేజీలకు అనుమతులు మంజూరు చేయాలన్నారు.
అమిత్‌షాతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్ తన అధికారిక నివాసంలో బస చేశారు. ఇవాళ(గురువారం) మరికొందరు కేంద్రంత్రులతో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది.