Chandrababu Naidu Oath Ceremony: నేడు ఏపీలో కొలవుదీరనున్న ఎన్డేఏ ప్రభుత్వం- నాల్గోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
Chandrababu Naidu Swearing In: నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో కొలువు దీరనుంది. సీఎంగా నాల్గోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ప్రమాణం చేయనున్నారు. ఆయనతో గవర్నర్ నజీర్ ప్రమాణం చేయిస్తారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాల్గోసారి ఇవాళ ప్రమాణం చేయనున్నారు. రాజకీయ అతిరథులు, వివిధ రంగాల ప్రముఖులు రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణుల సమక్షంలో అంగరంగవైభవంగా కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అతిథులంతా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. వచ్చిన వారిని టీడీపీ శ్రేణులు సాదరంగా ఆహ్వానించాయి.
ఇవాళ ఉదయం 11.27 నిమిషాలకు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కోసం 12 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా సహా ఇతర కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి కానున్నారు. సినీరంగం నుంచి రజనీకాంత్, చిరంజీవి, రామ్‌చరణ్ ఇతరులు రానున్నారు. ప్రమాణ స్వీకారం కోసం వచ్చే వారికి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీఐపీలకు ఒక గ్యాలరీ, కార్యకర్తలకు, ఇతరల నేతలు వారి ప్రోటోకాల్‌ను బట్టి గ్యాలరీల్లో ఉంచనున్నారు. సుమారు 36 గ్యాలరీలను సిద్ధం చేశారు. ఇందులో వీఐపీల కోసమే నాలుగు గ్యాలరీలు రెడీ చేశారు.
వీవీఐపీలు వస్తున్న ప్రమాణస్వీకారానికి భారీ స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సుమారు 10 వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఒక్కో గ్యాలరీని ఒక్కో అధికారి ఇన్‌ఛార్జ్‌గా ఉంటారు. ఆ గ్యాలరీ పరిధిలో కొందరు విధులు నిర్వహిస్తుంటారు. డీజీ హోదా మొదలు ప్రతి అధికారికి మోనటరింగ్ బాధ్యతలు ఇచ్చారు.
పాస్‌లు ఉన్న వారినే సభా ప్రాంగణంలోని పార్కింగ్ ఏరియాలోకి రానిస్తారు. లేకుంటే వారి వాహనాలను అక్కడ ఉండనివ్వరు. పాస్ పొందిన వాళ్లంతా విధిగా తమతో తీసుకురావాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనాల కోసం వివిధ ప్రాంతాల్లో సుమారు 50 ఎకరాలు కేటాయించారు. ఎటు నుంచి వచ్చిన వాహనాలకీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇవాళ వేకువ జాము నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతున్నాయి. సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
సభా ప్రాంగణానికి చుట్టూ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఎటు నుంచైనా కాలినడకన సభ వద్దకు చేరుకోవచ్చు. పార్కింగ్ ఏర్పాటు ప్రాంతాలు:-ముస్తాబాద్ రోడ్డు, ఎలైట్ విస్టా, మేధా టవర్స్ ఇలా మూడు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరిగాయి. హైవేపై ట్రాఫిక్ ఆగిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. పాస్‌లు ఉన్న వారినే రోడ్లపైకి అనుమతి ఇచ్చి వాటిని ప్రమాణస్వీకారానికి వెళ్లేలా చూస్తున్నారు. లేకుంటే వేరే రూట్‌లో వాహనాలను పంపిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో 25 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. వారిలో జనసేన అధినేత పవన్ కల్యామ్ ఉన్నారు. మంత్రివర్గంలో 17 మంది కొత్త ముఖాలకు స్థానం కల్పించిన చంద్రబాబు... జనసేనకు మూడు, బీజేపీకి ఒక మంత్రి పదవి ఇచ్చారు.
ప్రమాణం చేయనున్న మంత్రులు వీళ్లే
1. కొణిదెల పవన్ కళ్యాణ్ (కాపు)
2. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ, కొప్పుల వెలమ)
3. కొల్లు రవీంద్ర (బీసీ మత్స్యకార)
4. నాదెండ్ల మనోహర్ (కమ్మ)
5. పి.నారాయణ (కాపు)
6. వంగలపూడి అనిత (ఎస్సీ మాదిగ)
7. సత్యకుమార్ యాదవ్ (బీసీ, యాదవ)
8. నిమ్మల రామానాయుడు (కాపు)
9. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (ముస్లిం మైనారిటీ)
10. ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి)
11. పయ్యావుల కేశవ్ (కమ్మ)
12. అనగాని సత్యప్రసాద్ (బీసీ, గౌడ)
13. కొలుసు పార్థసారధి (బీసీ, యాదవ)
14. డోలా బాలవీరాంజనేయస్వామి (ఎస్సీ మాల)
15. గొట్టిపాటి రవి (కమ్మ)
16. కందుల దుర్గేష్ (కాపు)
17. గుమ్మడి సంధ్యారాణి (ఎస్టీ)
18. బీసీ జనార్థన్ రెడ్డి (రెడ్డి)
19. టీజీ భరత్ (ఆర్య వైశ్య)
20. ఎస్.సవితమ్మ (కురబ)
21. వాసంశెట్టి సుభాష్ (బీసీ, శెట్టిబలిజ)
22. కొండపల్లి శ్రీనివాస్ (బీసీ తూర్పు కాపు)
23. మండిపల్లి రామ్ ప్రసాద్ (రెడ్డి)
24. నారా లోకేష్ (కమ్మ)