Chandrababu: సీనియర్ నేతలు, ఎంపీలతో చంద్రబాబు సమావేశం - ప్రభుత్వం ఏర్పాటు, ఢిల్లీ టూర్‌పై చర్చ
Chandrababu's meeting with MPs ; తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాజాగా గెలిచిన ఎంపీలు, సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో చేరడంపై చర్చించారు.
Andhra Pradesh News: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ సీనియర్ నేతలతో గురువారం మధ్యాహ్నం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 164 స్థానాల్లో కూటమి విజయం సాధించగా, 21 పార్లమెంట్ స్థానాల్లో జయభేరి మోగించింది. ఇందులో 16 పార్లమెంటు స్థానాలను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారాన్ని చేపట్టడంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ఎంపీ స్థానాల్లో విజయం సాధించిన నాయకులతో సమావేశమయ్యారు. ఎన్డీఏ భేటీకి వెళ్లిన చంద్రబాబు నాయుడు సమావేశముకు సంబంధించిన కీలక అంశాలను నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరెవరికి పదవులు దక్కనున్నాయి..? ఎటువంటి శాఖలు తీసుకోవాలన్న దానిపై చంద్రబాబునాయుడు ముఖ్య నేతలతో చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉన్న శాఖలను తీసుకునే ఉద్దేశంలో ఉన్న చంద్రబాబు నాయుడు.. అందుకు అనుగుణంగా ఎవరికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని దానిపైన నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ పార్టీకి అండగా ఉన్న నాయకులకు పదవులు ఇవ్వడంపైనా చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు పైన పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని, బిజెపి ఇచ్చేదాన్ని బట్టి తీసుకుందామని, అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం గట్టిగా ప్రయత్నిద్దామని చంద్రబాబు గెలిచిన ఎంపీలకు చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి పదవులు ఐదు వరకు వచ్చే అవకాశం ఉందని టిడిపి అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్న దానిపైన నేతల సలహాలు, చంద్రబాబు తీసుకున్నారు. జాబితాలో శ్రీకాకుళం స్థానం నుంచి మూడోసారి గెలిచిన రామ్మోహన్ నాయుడు, విశాఖ స్థానం నుంచి గెలిచిన భరత్ తోపాటు మరికొందరి ఎంపీలు పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంబంధించిన అంశాలపైనా ఎంపీలు, ముఖ్య నాయకులతో చంద్రబాబు చర్చించారు.