PM Modi AP Tour: ప్రధాని రాకను వ్యతిరేకించట్లేదు, హామీలు అమలు చేయాలంటున్నాం: ప్రత్యేక హోదా సాధన సమితి
PM Modi AP Tour: ప్రధాని రాకను తామేం వ్యతిరేకించట్లేదని.. కాకపోతే ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నట్లు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు.
PM Modi AP Tour: ఏపీలో పార్టీలన్నీ కలిసి బీజేపీకి మద్దతుగా ఉంటున్నప్పుడు రాష్ట్రానికి రావాల్సిన హామీలు ఎవరు అడుగుతారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకను తామేం వ్యతిరేకించడం లేదని.. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాత్రమే కోరుతున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవాల్లో, మోడీ అనుకూలమైన వారికి చేసిన పనులు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు.
ఆదానీకి అమ్మడం కోసమే విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారంటూ చలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఇవ్వడం కాదు ఇక్కడ డివిజన్ ఎత్తేస్తున్నారని విమర్శించారు. కేకే లైన్, ఒడిశాలో కలుపుతున్నారని చెప్పుకొచ్చారు. అసలు ముఖ్యమంత్రి సభ ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలని చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎలా వేధించిందో.. సీఎం జగన్ కు రేపు అదే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. బెదిరించి మరీ తెలుగు వారి ఆస్తులను గుజరాత్ కు అప్పగించారని.. ఆదానికి కట్టబెట్టారని తెలిపారు.
నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేశారని సాధన సమితి సభ్యులు అన్నారు. విభజన హామీలు, కేంద్రం ఇచ్చిన హామీలు అమలు జరగలేదని వివరించారు. ఇక్కడ పరిశ్రమలు అమ్మడానికి వస్తున్నారా.. అంటూ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించాలన్నారు. ఇచ్చిన హామీలపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాలన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ఆత్మభిమానాన్ని నరేంద్ర మోడీ కాళ్ల దగ్గర దాసోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా కల్పించాలంటున్న తులసి రెడ్డి..
ఏపీ రాష్ట్ర పర్యటన కోసం ఇక్కడకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా అమలు చేస్తామని ప్రకటించాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ది ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని సూచించారు. వాల్తేరు డివిజన్‌తో కూడిన విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు నిధులు విడుదల చేయాలని చెప్పారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రకటించాలన్నారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రకటించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయమని చెప్పాలని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోనే మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించాలని వ్యాఖ్యానించారు.
కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని ప్రకటించాలన్నారు. పై డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక, రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రధాని మంత్రి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్నారు. ఇటీవల కాలలో రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని వివరించారు. నాలుగు రోజుల కిందట అనంతపురం జిల్లా బొమ్మణహాల్ మండలంలో విద్యుత్ తీగలు తెగిపడి 5 మంది రైతు కూలీలు మరణించారన్నారు. నిన్న ఆదివారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా ఎన్ పి కుంటలో విద్యుత్ తీగలు తెగిపడి రెడ్డప్ప రెడ్డి అనే రైతు మరణించారని గుర్తు చేశారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.