YS Jagan: సింగయ్య మృతి, మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు: గుంటూరు ఎస్పీ
Andhra Pradesh News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో వ్యక్తి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎఫ్ఐఆర్‌లో వైసీపీ అధినేత జగన్ పేరు చేర్చినట్లు గుంటూరు ఎస్పీ తెలిపారు.

గుంటూరు: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో వ్యక్తి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సింగయ్య అనే వ్యక్తి మృతి కేసులో మాజీ సీఎం జగన్ ను నిందితుడిగా చేర్చారు. ఈ విషయాన్ని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం రాత్రి ఎస్పీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. జూన్ 18న మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటచింతల పర్యటన సందర్భంగా గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో యాక్సిడెంట్ జరిగింది. నల్లపాడు పిఎస్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు కాన్వాయ్ చేరుకున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు సింగయ్యను పోలీసులు ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అతని భార్య చీలి లూర్ధు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 106(1) BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఘటనా స్థలంలో ఉన్నవారు తీసిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ వీడియోలను పోలీసులు పరిశీలించారు. వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారు ముందు టైరు కింద ఓ వ్యక్తి పడినట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. అన్ని వీడియోలు పరిశీలించిన తర్వాత జగన్ కార్ కింద పడి సింగయ్య చనిపోయినట్లు గుర్తించాము. దాంతో కేసులోని సెక్షన్లు మార్చి.. జగన్ తో పాటు డ్రైవర్ రమణారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, విడుదల రజిని, పేర్ని నానిలపై కేసు నమోదు చేసాం. మాజీ సీఎం జగన్ పర్యటనలో 3 వాహనాలకు అనుమతి ఇవ్వగా తాడేపల్లి నుంచి 50 వాహనాల్లో బయలుదేరారు. ఈ ఈ విషయంపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. సింగయ్య మృతికి సంబంధించి దొరికిన వీడియోల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని' గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి పలు వీడియో ఫుటేజీలు, అక్కడకు వచ్చిన ప్రత్యేక్ష సాక్షులను విచారించి, పలు సాంకేతిక ఆధారాలతో కూడిన సాక్ష్యాలను సేకరించి సెక్షన్లును 105, 49 BNS లకు మార్చారు.
YCP @YSRCParty అధ్యక్షులు జగన్ మోహన్
— YS Sharmila (@realyssharmila) June 22, 2025
రెడ్డి @ysjagan గారి వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది ఈ ఘటన. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి ? 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్… pic.twitter.com/gcYTGdWbtM
✓ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ప్రయాణించిన,
1) రమణా రెడ్డి (కారు డ్రైవర్)
2) వైయస్ జగన్మోహన్ రెడ్డి (మాజీ ముఖ్యమంత్రి)
3) కే.నాగేశ్వర్ రెడ్డి (పీఏ)
4) వైవి సుబ్బారెడ్డి (మాజీ ఎంపీ)
5) పేర్ని. నాని@వెంకటేశ్వరరావు (మాజీ ఎమ్మెల్యే)
6) విడదల. రజిని (మాజీ మంత్రి) మొదలగు వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.






















