Yatra 2 News: కోరం లేక అసెంబ్లీ వాయిదా- యాత్ర-2 కోసమేనంటూ టీడీపీ ఆగ్రహం
YSRCP On Yatra 2: వైసీపీ ప్రభుత్వం శాసనసభను అపహస్యం చేసేలా వ్యవహరిస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శాసనసభ సమావేశాల చివరి రోజు...సభను ప్రభుత్వం నవ్వుల పాలు చేసిందన్నారు.
AP Politics : వైసీపీ (YCP) ప్రభుత్వం శాసనసభను అపహస్యం చేసేలా వ్యవహరిస్తోందని ఏపీ టీడీపీ (AP TDP) అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu ) మండిపడ్డారు. శాసనసభ సమావేశాల చివరి రోజు...సభను ప్రభుత్వం నవ్వుల పాలు చేసిందన్నారు. యాత్ర-2 సినిమా విడుదల కోసమే అసెంబ్లీని వాయిదా వేశారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్య, మహిళల భద్రతపై తెలుగుదేశం శాసనసభ పక్షం ఆందోళన చేసింది. ఉదయం అసెంబ్లీ సమీపంలో అగ్నిమాపక కేంద్రం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పారని, కోరం లేకపోవడంతో సభను 9.15కి వాయిదా వేశారని అన్నారు. 2 గంటలు గడిచిన అసెంబ్లీని సమావేశ పరచకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఏ చట్టం తీసుకొచ్చినా అది ఆంధ్రప్రదేశ్ వినాశనానికే దారి తీసిందన్న ఆయన, పేదలకు ఉపయోగపడిందేమీ లేదన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాల జీవోలను దహనం చేసినట్లు వెల్లడించారు.
కౌరవ సభను మళ్లీ గౌరవ సభగా మారుస్తామన్న అచ్చెన్నాయుడు...శాసనసభను సైతం ఐదేళ్లుగా వైసీపీ కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు వైసీపీ ప్రభుత్వం రూపంలో దరిద్రం పట్టుకుందన్నారు అచ్చెన్నాయుడు. ప్రభుత్వం చేసిన ప్రతీ చట్టమూ రాష్ట్ర వినాశనం కోసమే చేసిందని, ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు పెరిగిపోయాయని విమర్శించారు. జే టాక్స్‌తో పరిశ్రమలు పరారయ్యాయని, యువత బేజారయిందని మండిపడ్డారు. ప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందన్న ఆయన...రాష్ట్రంలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, మహిళల భద్రత ప్రధాన సమస్యలుగా ఉన్నాయని, 27 వేల ఖాళీలతో మెగా డీఎస్సీ ఇస్తామని జగన్ యువతను మోసగించారని విమర్శించారు.