UPSC Mains Result 2024: అవమానం తట్టుకోలేక జాబ్‌కు రాజీనామా - యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా ఏపీ కానిస్టేబుల్ !
UPSC Mains Result 2024: అవమానంతో కుంగిపోలేదు, ఆ జాబ్ ని మించిన స్థాయికి చేరుకోవాలన్న ఏపీకి చెందిన మాజీ కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి కల నెరవేరింది. సివిల్ సర్వీసెస్‌లో 780వ ర్యాంకు సాధించారు.
UPSC Topper Uday Krishna Reddy - అమరావతి: దేశంలో అత్యుత్తమ సర్వీసులైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ - 2023 తుది ఫలితాలలో 1,016 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో తెలుగువారు దాదాపు 50 మంది వరకు సెలక్ట్ అయ్యారు. విజేతలు ఒక్కొక్కరిది ఒక్కో విజయగాథ. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించి టాప్ 5లో నిలిచారు. UPSC సివిల్ సర్వీసెస్‌లో 780వ ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి అవమానాన్ని తన విజయానికి తొలిమెట్టుగా చేసుకుని విజయతీరాన్ని చేరారు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని.. ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల రాసిన పాటను నిజం చేశారు ఆంధ్రా పోలీస్.
సివిల్స్ ర్యాంక్ సాధించిన ప్రకాశం జిల్లా వాసి
ఉదయ్ కృష్ణారెడ్డి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెనికి చెందిన వారు. చిన్నతనంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఐదేళ్ల వయసులోనే తల్లి జయమ్మ చనిపోయారు. ఆపై ఇంటర్ చదవుతున్న సమయంలో తండ్రి శ్రీనివాసులు రెడ్డి సైతం మరణించారు. ఆసమయంలో ఉదయ్, అతడి సోదరుడికి నానమ్మ అండగా నిలిచారు. తల్లిదండ్రుల ప్రేమను పంచుతూ వారిని చదువుపై ఫోకస్ పెట్టేలా చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కానిస్టేబుల్ జాబ్ కు అప్లై చేశారు. ఎగ్జామ్, ఈవెంట్స్ విజయవంతంగా పూర్తిచేసి కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ఉదయ్ కృష్ణారెడ్డి 2013 నుంచి 2018 వరకు పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేశారు.
జీవితాన్ని మలుపు తిప్పిన అవమానం..
కానిస్టేబుల్ గా చేస్తున్న సమయంలో ఓ సీఐ ఉదయ్ కృష్ణారెడ్డితో దురుసుగా ప్రవర్తించారు. తనను టార్గెట్ గా చేసుకుని దాదాపు 60 మంది పోలీసుల ముందు అవమానించడాన్ని తట్టుకోలేకపోయారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత ఉద్యోగం సాధించాలని నిర్ణయానికి వచ్చి అదేరోజు కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేవారు ఉదయ్. పోలీస్ జాబ్ వదిలేశాక, హైదరాబాద్ కు వచ్చి సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరయ్యారు. రాత్రింబవళ్లు శ్రమించి అందుకు తగ్గ ఫలితాన్ని రాబట్టారు.
దేశంలో అత్యంత కష్టమైన సర్వీసులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్. ఇందులో ర్యాంక్ సాధించారంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇతర ఉన్నత ఉద్యోగాలతో జాబ్ మొదలుపెట్టడంతో ఎందరికో డ్రీమ్ నెరవేరుతుంది. అందుకే ఉదయ్ కృష్ణారెడ్డి మొదటి మూడు ప్రయత్నాలలో విఫలమయ్యారు. కానీ ఎలాగైనా సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలన్న తపనతో నాలుగో ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. యూపీఎస్సీ తాజాగా ప్రకటించిన 2023 సివిల్ సర్వీసెస్ లో 780వ ర్యాంక్ సాధించారు. ఆయనను ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (IRS)కు కేటాయించే ఛాన్స్ ఉంది. వచ్చిన ర్యాంక్ తో అక్కడే ఆగిపోకుండా.. జాబ్ లో చేరినా.. ఐఏఎస్ కు ఎంపిక అయ్యేందుకు మళ్లీ ప్రిపేర్ అవుతానని ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.