Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు
Amaravati: అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాకులో నిత్యావసర సరకుల ధరల స్థితి గతులపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
AP CS Sameer Sharma Review Meet: రాష్ట్రంలో వివిధ రైతు బజారుల్లో ప్రజలకు అవసరమైన వివిధ నిత్యావసర సరుకులు, కూరగాయలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాకులో నిత్యావసర సరకుల ధరల స్థితి గతులపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రతి రోజూ నిత్యావసర సరకుల ధరలను మానిటర్ చేయాలని ధరల పెరుగుదల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిత్యావసర సరుకుల అక్రమ నిల్వలపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
నిత్యావసర వస్తువుల ధరల మానిటర్ చేసేందుకు వీలుగా ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తేనున్నట్టు సీఎస్ పేర్కొంటూ దానిని అర్ధ గణాంక విభాగం (డైరెక్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్) అధికారులు రూపొందిస్తున్నట్టు సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ ఆదేశించారు. ఈ యాప్ ను మార్కెటింగ్ శాఖ, పౌరసరఫరాల శాఖలు, తూనికలు కొలతలు శాఖ, విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగాలు వినియోగించుకుని నిరంతరం ధరలను పర్యేవేక్షించాల్సి ఉంటుందని సీఎస్ సమీర్ శర్మ చెప్పారు.
రైతు బజారుల్లో వివిధ కూరగాయలను కూడా పూర్తిగా అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ముఖ్యంగా ప్రస్తుతం టమాటా ధరలు అధికంగా ఉన్నందున మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతుల నుండి నేరుగా టమాటాలను కొనుగోలు చేసి రైతు బజారుల్లో నిర్దేశిత ధరలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.