Adudam Andhra: ఆడుదాం ఆంధ్రా క్రీడా పాలసీపై ఏపీ సీఎస్ సమీక్ష- అధికారులకు కీలక ఆదేశాలు
మహాత్మా గాంధీ జయంతి నాడు ప్రారంభించ ప్రతిపాదించిన ''ఆడుదాం ఆంధ్ర'' పేరిట నిర్వహించనున్న క్రీడా సంబరాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్రా పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహాత్ముని జయంతి సందర్బంగా ఈ క్రీడా సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆడుదాం ఆంధ్రా....
అక్టోబరు రెండవ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నాడు ప్రారంభించ ప్రతిపాదించిన ''ఆడుదాం ఆంధ్ర'' పేరిట నిర్వహించనున్న క్రీడా సంబరాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎస్ డా. కెఎస్ జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు 2023-2028 క్రీడా పాలసీ పై సీఎస్ జవహర్ రెడ్డి వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్ర క్రీడల శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు దీని పై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందుకు అవసరం అయిన ప్రణాళికలను జిల్లా స్దాయిలో రూపొందించాలని పిలుపునిచ్చారు.
సచివాలయాల స్థాయి నుంచి....
గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుండి మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఇందుకు గాను గ్రామ, మండల స్థాయిల్లో అనువైన క్రీడా ప్రాంగణాలు, మైదానాలను గుర్తించి వాటిని వివిధ క్రీడల నిర్వహణకు వీలుగా అన్ని విధాలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అంతే గాక ఈ క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు వీలుగా గ్రామ స్థాయి నుండి యువత పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యే విధంగా ప్రోత్సాహించాలని సూచించారు. గ్రామ స్థాయిలో యువజన సంఘాలను భాగస్వాములను చేసే విధంగా అదికారులు ప్రత్యేక చొరవ చూపించాలని సూచించారు. అవసరం అయితే జిల్లా స్దాయిలో ఉన్న అదికారులు గ్రామాల్లో పర్యటించి క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను వివరించి అవగాహనా కార్యక్రమాలను రూపొందించాలని పిలుపునిచ్చారు.
ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా క్రికెట్,బాడ్మింటన్, వాలీబాల్,కోకో,కబడ్డి వంటి క్రీడలతో పాటు ఇతర సాంప్రదాయ క్రీడలను కూడా నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేయాలని ఏపీ సీఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కనుమరుగు అవుతున్న సాంప్రదాయ క్రీడలను గురించి అందరికి అవగాహన కల్పించేలా మహత్ముని స్పూర్తితో యువతను ముందుకు నడిపించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దొహదపడతాయని అన్నారు.
క్రీడా పాలసీపై అధ్యయం చేయండి...
2023-2028 రాష్ట్ర క్రీడా విధానం గురించి కూడా సిఎస్ అధికారులతో సమీక్షించారు. వివిధ క్రీడల్లో రాణిస్తున్న క్రీడా కారులను ప్రోత్సహించేందుకు అదే విధంగా స్పోర్ట్స్ అధారిటీ ద్వారా వివిధ క్రీడా పరమైన మౌలిక సదుపాయాలను మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామ స్థాయి నుండి యువత పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేలా, ముఖ్యంగా ప్రతిభ గల క్రీడా కారులను ప్రోత్సాహించే విధంగా నూతన క్రీడా పాలసీ ఉండేలా చూడాలని సీఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.