YS Jagan: ప్రజల వద్దకే నేరుగా పథకాలు.. సీఎం జగన్ వెల్లడి, తాజాగా వారి అకౌంట్లలోకి 703 కోట్లు
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.
గతంలో పథకాల కోసం ప్రజలు ఎదురుచూసేవారని.. ఇప్పుడు ప్రజలనే నేరుగా వెతుక్కుంటూ పథకాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఏపీలో పథకాలు అమలు చేసేటప్పుడు మనం కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడడం లేదని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి ఇంకా అందకుండా ఉన్న వారి ఖాతాల్లో మంగళవారం ఆయన డబ్బు జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.
‘‘ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 9,30,809 మందికి వారి బ్యాంక్ అకౌంట్లలో రూ.703 కోట్లను జమచేస్తున్నాం. పేదలకు అండదండలు అందించే విషయంలో ఏమాత్రం రాజీ లేదు. కొవిడ్ సమయంలో ప్రభుత్వ రాబడి తగ్గినా ప్రజలకు ఏదీ ఆపలేదు. అందరికీ న్యాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వ బకాయిలు కూడా కలిపి చెల్లిస్తున్నాం. 2019- 20 రబీకి సంబంధించి రూ.9 కోట్లను ఇప్పుడు జమ చేస్తున్నాం. పొదుపు సంఘాలకు మరో రూ.53 కోట్లు, జగనన్న విద్యా దీవెన పథకంలో రూ.19 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకంలో రూ.39 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో రూ.19 కోట్లు జమ చేస్తున్నాం’’ అని జగన్ చెప్పారు.
ఈ పథకాల కింద నిధుల విడుదల
‘‘వైఎస్సార్ చేయూత కింద 2,50,929 మందికి రూ. 470.40 కోట్లు ఇవాళ అందిస్తున్నాం. వైఎస్సార్ ఆసరా కింద 1,136 మందికి రూ.7.67 కోట్లు ఇస్తున్నాం. వైఎస్సార్ సున్నావడ్డీ కింద మహిళలకు 59,661 మందికి రూ. 53,51కోట్లు అందిస్తున్నాం. వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు కింద 2019–20 ఏడాది కింద 62,622 మందికి రూ. 9.01కోట్లు, ఖరీఫ్ 2020 కింద 58,821 మందికి 10.06 కోట్లు ఇస్తున్నాం. వైఎస్సార్ రైతు భరోకకింద 2,86,059 మందికి రూ. 58.89 కోట్లు ఇస్తున్నాం. జగనన్న విద్యా దీవెన కింద 31,940 మందికి రూ.19.92 కోట్లు ఇస్తున్నాం. వైఎస్సార్ వసతి దీవెన కింద 43,010 మందికి రూ. 39.82 కోట్లు ఇస్తున్నాం. వైఎస్సార్ కాపు నేస్తం కింద 12,983 మందికి రూ.19.47 కోట్లు ఇస్తున్నాం. వైఎస్సార్ వాహన మిత్ర కింద 8,080 మందికి రూ.8.09 కోట్లు ఇస్తున్నాం. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 3,788 మందికి రూ. 3,79 కోట్లు ఇస్తున్నాం. వైఎస్సార్ నేతన్న నేతన్న నేస్తం కింద 794 మందికి రూ.1.91 కోట్లు అందిస్తున్నాం. ఇవికాక 90 రోజుల్లో ఇళ్లపట్టాలు 1,10,986 కు ఇస్తున్నాం’’ అని జగన్ తెలిపారు.