Montha Cyclone: మొంథా తుపాను నష్ట నివారణ కోసం చంద్రబాబు వార్ రూమ్- ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సమీక్షలు, టెలీకాన్ఫరెన్స్‌లు
Montha Cyclone:మొంథా తుపాను నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. రియల్‌టైంలో వివరాలు తెలుసుకొని అప్రమత్తం చేశారు.

Montha Cyclone: మొంథా తుపాను తీవ్రతను తెలుసుకున్న ప్రభుత్వం నిరంతరం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చింది. అందుకే భారీ స్థాయిలో ప్రాణ నష్టాన్ని తగ్గించగలగింది. ఆస్తి నష్టాన్నికూడా కొంత వరకు కంట్రోల్ చేయగలిగారు. దీని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆర్టీజీఎస్‌లోనే ఉన్నారు. తుపాను తీరం దాటిన తర్వాత ఆయన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సమన్వయంతో పని చేశారని కితాబు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌ను మొంథా తుపాను భయపెట్టింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా తుపాను విరుచుకుపడుతుందని అధికారులు అంచనాలు వేశారు. కేంద్రం నుంచి ఆ స్థాయిలోనే రిపోర్టులు వచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్‌లోనే వార్ రూమ్ ఏర్పాటు చేశారు. సచివాలయంలో ఉన్న అన్ని విభాగాల అధికారులు, మంత్రులతో నిరంతరం సమావేశమవుతూ వచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని సమీక్షించారు. టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వస్తున్న సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. వాటిని క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేసి వాటిని పరిష్కరించారు.
గ్రామ,వార్డు సచివాలయం నుంచి అమరావతిలో సమీక్షలో ఉన్న మంత్రులు, అధికారులు, విభాగాల అధికారులు అందరూ సమన్వయంతో పని చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అంతా వారి వారి పనుల చేసుకుంటూ చంద్రబాబుకు ఎప్పటికప్పుడు రిపోర్టులు ఇస్తూ వచ్చారు. చంద్రబాబు మాత్రం ప్రభావిత ప్రాంతాల అధికారులు, ఆయా విభాగాల అధికారులు, మంత్రులతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ విరామం లేకుండా పరిస్థితిని సమీక్షించారు. రెండు సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు, రెండుసార్లు టెలీకాన్ఫరెన్సులు నిర్వహించారు. తుపాను తీరం దాటిన తర్వాత కూడా అర్ధరాత్రి టైంలో మూడోసారి ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్ష నిర్వహించారు.
ఆర్టీజీ సెంటర్‌కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైంలో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. చెట్ల తొలగింపు, సబ్ స్టేషన్లల్లో సమస్యలను తక్షణం పరిష్కరించేలా అధికారులను ప్రోత్సహించారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తూ వచ్చారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆర్టీజీఎస్ కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, నారాయణ కూడా ఉన్నారు. తుపాను ప్రభావంపై అధికారులకు సూచనలు చేశారు. వర్షప్రభావిత జిల్లాల్లో మంత్రులు, అధికారులతో ఆర్టీజీ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆదేశాలు జారీ చేశారు.
ఎంత చిన్న పల్లెటూరైనా, లంక గ్రామామైనా తుఫాను సహయక చర్యలు అందేలా సీఎం ఆదేశాలు జారీ చేశారు. పునరావాస శిబిరాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలకు వెళ్లిన మంత్రులు, ప్రత్యేకాధికారులతో ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం చర్చించారు. చివరకు సచివాలయ సిబ్బందితో కూడా ముఖ్యమంత్రి టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటి వరకు మంచిగా చేశారని కితాబు ఇచ్చారు.
చంద్రబాబు అధికారులతో సమీక్ష చేస్తున్న టైంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధానమంత్రి మోదీ ఫోన్ చేశారు. పరిస్థితిపై ఆరా తీశారు. రాత్రికి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడ ఫోన్‌లో మాట్లాడారు. ఇక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని భారీగా నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా సరే తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం నుంచి మంత్రి భరోసా ఇచ్చారు.





















