(Source: ECI/ABP News/ABP Majha)
AP JAC Agitation Notice: మార్చి 9 నుంచి దశలవారీగా ఆందోళనలు, ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ నేతలు డేంజర్ బెల్స్!
JAC Agitation Notice:: డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. మార్చి 9 నుండి దశలవారీగా ఆందోళనలు చేపడతామని వెల్లడించారు.
JAC Agitation Notice: తమ డిమాండ్లను, సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి ఉద్యోగ నేతలు ఆందోళనల కార్యాచరణ నోటీసులు అందించారు. మార్చి 9వ తేదీ నుంచి రాష్ట్రంలో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్యోగుల కోసం కేటాయించిన బడ్జెట్ ను ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీతాల కోసం ఉద్యోగాలు వేచి చూడాల్సిన పరిస్థితి తీసుకువచ్చారని ఉద్యోగ నేతలు అన్నారు. డీఏ బకాయీలు, సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్, సరెండర్ లీవులు కూడా తీసుకుంటున్నారని వాపోయారు.
ఉద్యోగులను అవహేళన చేస్తున్నారు..
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులను అవహేళ చేస్తోందని ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల పట్ల హేళనగా పోస్టు పెడుతున్నారని తెలిపారు. సీపీఎస్ రద్దు హామీ ఇచ్చి రాష్ట్రాలు ఆ పని చేస్తున్నాయని, కానీ ఏపీ సర్కారు మాత్రం హామీని తుంగలో తొక్కిందని అన్నారు. 62 ఏళ్ల ఉద్యోగ విరమణ వయస్సు పెంపును ఇప్పటికీ కొందరు ఉద్యోగులకు అమలు చేయడం లేదని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ కనుసన్నల్లో ఉన్నారనే విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగులకు ఎలాంటి ఆటంకం ఉండబోదని, ప్రతి ఒక్కరూ ఆందోళనల్లో పాల్గొనాలని ఉద్యోగ సంఘాల నేతలు సూచించారు. ప్రతి ఒక్కరూ ఉద్యమ కార్యాచరణలో భాగం కావాలని పిలుపునిచ్చారు.
సెల్ డౌన్, పెన్ డౌన్, విరామ సమయాల్లో ఆందోళనలు
మార్చి 9వ తేదీ నుండి దశల వారీగా ఆందోళనలు చేస్తామని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. సెల్ డౌన్, పెన్ డౌన్, లంచ్ బ్రేక్ సమయాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని ఉద్యోగ నాయకులు తెలిపారు. చివరికి కలెక్టరేట్లలో స్పందన కార్యక్రమాల్లో దరఖాస్తులు అందజేస్తామని తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమాలు ముగిసిన తర్వాత తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. పీఆర్సీ వల్ల ఉద్యోగుల్లో ఉద్యోగ సంఘాల, నేతల పట్ల విశ్వాసం పోయిందని తెలిపారు. అందుకే ఉద్యోగుల్లో ద్రోహిగా మిగిలిపోకూడదనే ఈ ఉద్యమ కార్యాచరణ చేపట్టినట్లు పేర్కొన్నారు. సర్కారు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లిఖితపూర్వకమైన హామీ ఇస్తేనే ఉద్యమాన్ని విరమిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం మాత్రమే ఒంటరిగా ఆందోళన కార్యాచరణ ప్రకటించిందని వెల్లడించారు. అనంతరం మిగతా అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పోరాటం చేయాలని నిర్ణయించారు.
జీతాల కోసం కాదు మా ఉద్యమం..
'మాకు జీతాలు పెంచాలని, డబ్బులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమేమీ కోరడం లేదు. ఏ గొంతెమ్మ కోరిక కోరటం లేదు. సర్కారు వచ్చినప్పటి నుండి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు తీవ్రమైన నష్టం జరుగుతోంది. కొత్తగా పెంచిన 11వ పీఆర్సీ వల్ల... 10వ పీఆర్సీలో పొందుతున్న రాయితీలు కూడా రద్దు చేసి తగ్గించినందుకు అప్పుడు ఆందోళనలు చేశాం. ఉద్యమ ఫలితాల్లో రద్దు చేసిన వాటిలో కొంచెం తగ్గించుకుని పొందామే తప్ప కొత్తగా ఓనగూరింది ఏమీ లేదు. ఆనాటి చర్చల్లో సర్కారు బకాయిలను చెల్లిస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు నయా పైసా కూడా ఇవ్వలేదు. మాకు రావాల్సిన 11వ పీఆర్సీ స్కేల్స్ మాకు తెలియజేయలేదు. కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారికి పేస్కేల్స్ వారికి తెలియవు. మాకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను ఎక్కడికి తరలిస్తున్నారని అడుగుతున్నాం'అని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు నిలదీశారు.