(Source: ECI/ABP News/ABP Majha)
Chandrababu Naidu : జగన్ బొమ్మ ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు వెనక్కి.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు
Pattadar Passbooks: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు గత ప్రభుత్వం జగన్ ఫోటోతో అందించిన పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త వాటిని అందించాలని అధికారులకు ఆదేశించారు.
AP Pattadar Passbooks : ఆంధ్రప్రదేశ‌్‌లో రైతులకు అందించే పట్టాదారు పాసు పుస్తకాలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో జగన్ ఫోటోతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందించారు. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు అప్పట్లో విపక్షాలు కూడా పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు చేశాయి. తాము అధికారంలోకి వస్తే పట్టాదారు పాసుపుస్తకాల విషయంలో కొత్త విధానాన్ని అమలు చేస్తామని అప్పట్లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో నూతన విధానాన్ని అమలు చేయడానికి అనుగుణంగా ఆయన అధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించిన ఆయన పట్టాదారు పాసుపుస్తకాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తాము హామీ ఇచ్చిన విధంగానే పట్టాదారు పాసు పుస్తకాలను మార్చనున్నట్లు వెల్లడించారు. గత వైసిపి ప్రభుత్వంలో తొలిసారి అప్పటి సీఎం జగన్ బొమ్మతో ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. ఇది అనేక విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు వీటిని మార్చి కొత్త వాటిని ఇస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాలు పంపిణీ..
కుప్పం పర్యటనలో రైతులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలను మారుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అందిస్తామని వివరించారు. ఇది ఇప్పుడు రైతులను ఆనందానికి గురి చేస్తోంది. త్వరలో ఈ మేరకు చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆదేశాలను జారీ చేసినట్లు చంద్రబాబు నాయుడు రైతులకు వివరించారు. కొద్దిరోజుల్లోనే ఈ మేరకు ప్రక్రియను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. రెండు మూడు నెలల్లో ప్రక్రియను పూర్తి చేసి రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన చంద్రబాబు..
పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించడం పట్ల ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ రెడ్డి తాత, ముత్తాతల సంపాదించిన భూమి కాదని, రైతుల భూమిపై జగన్ రెడ్డి ఫోటో ఎందుకని ప్రశ్నించారు. తన భూమికి కూడా జగన్ బొమ్మ వేసుకోవాలా..? అని ఈ సందర్భంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అన్ని పట్టాదారు పాసుపుస్తకాలను మారుస్తానని అప్పట్లోనే చంద్రబాబునాయుడు స్పష్టమైన హామీని ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా చంద్రబాబునాయుడు అధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి సంబంధించిన రాజమద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందించనున్నారు. ఇప్పటికే జగన్ అందించిన పట్టాదారు పాసు పుస్తకాలను వెనక్కి తీసుకొనున్నట్లు ఆయన ప్రకటించారు. వాటికి బదులు కొత్త వాటిని అందిస్తామని వివరించారు.