Amaravati : అమరావతి లో రెండో విడత భూ సమీకరణ ఏయే గ్రామాల్లో ఎన్నెన్ని ఎకరాలు అంటే...!
Amaravati : అమరావతిలోని ఏయే గ్రామాల్లో ఎన్నెన్ని ఎకరాలు ఏపీ ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణ చేపట్టనుంది. పూర్తి వివరాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం అదనంగా భూ సమీకరణ చెయ్యాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. క్యాబినెట్ కూడా దానికి ఆమోదం తెలపడంతో ఇక భూ సమీకరణ ప్రక్రియ మొదలైనట్టే. రెండో విడతలో ప్రభుత్వ భూములతో కలిపి గ్రామాల వారీగా రాజధాని కోసం తీసుకోబోతున్న భూముల వివరాలు ఇలా ఉన్నాయి.
తుళ్లూరు మండలం (ఎకరాల్లో)
పెదపరిమి 6513.52
వడ్డ మాను 1936.87
హరిచంద్రపురం 2428.25
మొత్తం 10878.64
అమరావతి మండలం
వైకుంఠపురం 3361.48
యండ్రాయి 2166.04
కర్లపూడి 2944.10
మొత్తం 9617.58
గతంలో అమరావతి కోసం 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు సేకరించింది ప్రభుత్వం. ఇది తొలిదశలో చేసిన ల్యాండ్ పూలింగ్. ఇప్పుడు రెండో దశలో మరో 16,666 ఎకరాలు భూ సమీకరణ కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి ప్రభుత్వ భూములు కూడా కలిపి మొత్తం 20,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లోనికి రానున్నాయి.
అమరావతి లో రెండో దశ భూముల సేకరణ జరిగే విధానం ఏంటంటే...!
రెండోదశ పూలింగ్ ప్రక్రియ దశలు ఈ విధంగా ఉండబోతున్నాయి.
ముందుగా సెక్షన్ 55(4) కింద కాంపిటెంట్ అధికారి ప్రాంతాల వారీ పూలింగు ప్రకటన చేస్తారు. కొత్తగా సమీకరించే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ భూ సమీకరణ పథకం 2025 రూల్స్ వర్తిస్తాయి. దానివల్ల ప్రభుత్వానికి లీగల్ సమస్యలు రావు. రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను ఎపిసిఆర్‌డిఎ చట్టం 2014లో సెక్షన్ 43(3) కింద నమోదు చేస్తారు.
సెక్షన్ 48(1), 50 ప్రకారం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
పూలింగు ఏరియాలో నియమించే అధికారులు రైతుల నుంచి అభ్యంతరాలు ఏవైనా ఉంటే స్వీకరిస్తారు. ఈ అభ్యంతరాలను తెలిపేందుకు 30 రోజులపాటు అవకాశం ఇస్తారు. భూముల సరిహద్దులు, విస్తీర్ణాన్ని సర్వేచేసి రైతులు ఇచ్చిన దరఖాస్తులకు ఆమోదం తెలుపుతుంది CRDA.
అనంతరం రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు తిరిగి ఇచ్చేందుకు గతంలో మాదిరి కాకుండా సింగిల్ టైం లోనే సెటిల్ చేస్తారు.2025 పూలింగు చట్టంలో సెక్షన్లు 44, 53కి అనుగుణంగా అభివృద్ధి అవసరాలకు 50 శాతం భూమిని కేటాయిస్తారు. దీనిలో పార్కులు, ఆటస్థలాలు, తోటలకు, ఓపెన్‌స్పేస్‌కు 10 శాతం, రోడ్లు, యుటిలిటీ సేవలకు 30 శాతం, సామాజిక సదుపాయాలకు ఐదుశాతం, గృహాలకు ఐదుశాతం కేటాయింపులు చేస్తారు.సెక్షన్ 57(2) ప్రకారం తుది నోటిఫికేషన్ జారీచేసిన అనంతరం సిఆర్‌డి.ఏ చేతిలోకి భూమి బదిలీ అవుతుంది.
తరువాత సెక్షన్ 57(3) ప్రకారం రైతులకు ల్యాండ్ పూలింగ్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్ ఇస్తారు. దీనికి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ అవసరం లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం.ఈ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్ పద్ధతిలోనే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దానినే అసలు ధ్రువపత్రంగా గుర్తిస్తారు.
పూలింగ్ ఏరియాలో జాయింట్ కలెక్టర్ నిర్ధారించిన అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములపై అభ్యంతరాలకు 15 రోజుల గడువు ఇచ్చి అనంతరం 6 నెలల్లో మూడో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదే అమరావతి ల్యాండ్ పూలింగ్ కి సంబంధించిన తుది నోటిఫికేషన్‌గా ఎండ్ అవుతుంది.
పాత చేదు అనుభవాల దృష్ట్యా లీగల్ సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతున్న ప్రభుత్వం
గతంలో ఉన్న అనుభవాలు, అభ్యంతరాలపై ల్యాండ్ పూలింగ్ ఇష్టం లేని రైతులు కోర్టును ఆశ్రయించడం వంటి ఇబ్బందులు పెట్టకుండా కొత్త పూలింగ్ చట్టంలో సెక్షన్ 55 (2) కింద రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నట్లుగా అంగీకారపత్రం తీసుకుంటుంది ప్రభుత్వం. దీనికోసం ఆధార్ ఆధారిత గ్యారంటీతోపాటు రిజిస్ట్రేషన్ తరహాలో ముందుగానే ఆమోదం తెలిపినట్లు వేలిముద్ర తీసుకుంటారు. పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి సెక్షన్ 49 ప్రకారం రైతులు భూములు వ్యవసాయ అవసరాలకు వినియోగించకుండా నిషేధం అమలులోకి తెచ్చి రాజధాని పనుల కోసం కేటాయిస్తారు. దానితో అమరావతిలో రెండో విడత పూలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది.





















