(Source: ECI/ABP News/ABP Majha)
Amaravati Protest: 1300వ రోజుకు అమరావతి ఉద్యమం - ‘నాలుగేళ్లుగా నరకంలో నవనగరం’ పేరుతో గ్రామస్థుల ఆందోళన
Amaravati Farmers Protest: అమరావతి ఉద్యమం 1300 రోజుకు చేరుకున్న క్రమంలో నాలుగేళ్లుగా నరకంలో నవగరం పేరిట రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు.
Amaravati Farmers Protest: అమరావతి రైతుల ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు నేటికీ ఆందోళన చేస్తూనే ఉన్నారు. నేటితో వీరి ఉద్యమం 1300 రోజులకు చేరుకుంది. ఈక్రమంలోనే "నాలుగేళ్లుగా నరకంలో నవనగరం" పేరిట ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మందడంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అమరావతి రైతులు, మహిళలు హాజరయ్యారు. అమరావతి రైతులకు మద్దతుగా తెలంగాణ నుంచి కూడా రైతులు వచ్చారు. 3, 139 మంది అసైన్డ్ రైతులను సీఎం జగన్ ప్రభుత్వం రోడ్డుపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులు, కుట్రలతో రాజధానిని ఆపలేరని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయమే భస్మాసుర హస్తంగా మారుతుందని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కారును గద్దె దించుతాం..!
రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అమరావతి రైతులు చెబుతున్నారు. సేవ్ అమరావతి - బిల్డ్ అమరావతి నినాదంతో ముందుకు సాగుతామని, ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంచేస్తామని చెప్పారు. ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని తెలిపారు. అమరావతిని ఏకైకా రాజధానిగా ప్రకటించేంత వరకు ఉద్యమం ఆగదని రైతులు స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగడంతో పాటు ఏపీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అమరావతి రైతులు శనివారం ఆలయాల సందర్శన యాత్ర చేపట్టారు. పలు ఆలయాలను దర్శించుకొని తమ బాధలను దేవుళ్లతో చెప్పుకున్నారు.
ఇటీవలే అమరావతి భూముల్లో ఇళ్ల పట్టాలు
అమరావతిలోని ఆర్-5జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తుళ్లూరు మండలం వెంకటాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అక్కడే నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేశారు. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణఆయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరంలో 51,392 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ లబ్ధిదారులంతా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందినవారు. వీల్లకు ఒక్కొక్కరికి సెంటు స్థలాన్ని ఇంటి కోసం అందిస్తోంది ప్రభుత్వం. మొత్తం 25 లేఅవుట్లలో ప్లాట్లు కేటాయించింది.
అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి దేశ చరిత్రలో ప్రత్యేకత ఉందన్నారు సీఎం జగన్. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని వేల పోరాటాలు దేశంలో చాలా జరిగాయని గుర్తు చేశారు. కానీ, పేదలకు ప్రభుత్వమే ఇళ్లస్థలాలు ఇవ్వడానికి సుదీర్ఘ న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లిమరీ.. 50వేల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వడం ఒక చారిత్రక ఘటంగా అభివర్ణించారు. ఇలాంటివి చూస్తే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. పెదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా రాక్షసులు అడ్డుపడ్డారని ప్రతిపక్షాలను ఉద్దేశించి జగన్ విమర్శించారు. ఈ ప్రాంతంలో గజం ధర 15 వేల నుంచి 20 వేల వరకు ఉంటుందన్నారు. అంటే ఒక్కొక్కరికి 7 నుంచి 10 లక్షల రూపాయల విలువైన ఇంటి స్థలాన్ని ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సామాజిక పత్రాలుగా ఈ ఇంటి పత్రాలు ఇస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ఇదే అమరావతి.. ఇకమీదట ఒక సామాజిక అమరావతి అవుతుందన్నారు. ఇకపై మన అందరి అమరావతి అవుతుందని చెప్పారు.