Amaravati News : వాయిదా కోరుకున్న పిటిషనర్లు ..అభ్యంతరం చెప్పని ప్రభుత్వం..! నవంబర్ 15కు అమరావతి వ్యాజ్యాల విచారణ వాయిదా !
అమరావతి పిటిషన్లపై విచారణకు పిటిషనర్లతో పాటు ప్రభుత్వం కూడా నిరాసక్తత చూపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాయిదా కోరడంతో హైకోర్టు ధర్మాసనం నవంబర్ 15కు వాయిదా వేసింది.
అమరావతి వ్యాజ్యాలపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. చీఫ్ జస్టిస్ ఏ.కే.గోస్వామి నేతృత్వంలోని ధర్మాససనం ఈ వ్యాజ్యాల పై విచారణ ప్రారంభించింది. విచారణ ప్రారంభమైన తరవాత పిటిషనర్ల తరపు న్యాయవాదులు కరోనా కారణంగా విచారణ వాయిదా వేయాలని కోరారు. వచ్చే నాలుగు, ఐదు వారాలు అత్యంత కీలకం అని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. దేశంలోని పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. దీంతో త్రిసభ్య ధర్మాసనం విచారణను నవంబర్ 15వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది.
వాయిదా కోరిన పిటిషనర్లు.. మీ ఇష్టం అన్న ప్రభుత్వ లాయర్లు..!
సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న వాదనలు వినిపించడానికి అటు పిటిషర్లు, ఇటు ప్రభుత్వం కూడా ఆసక్తిగా లేదన్న అభిప్రాయం తాజా వాయిదాతో పలువురిలో ఏర్పడుతోంది. పిటిషనర్లలో అత్యధికులు అమరావతి రైతులే ఉన్నారు. వారే మొదటగా కరోనా కారణం చెప్పి విచారణ వాయిదా కోరారు. అదే సమయంలో ఏదో ఒకటి తేల్చుసుకుని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖ తీసుకెళ్లాలన్న పట్టుదలతో ఉన్న ఏపీ ప్రభుత్వం కూడా వాదనలు వినాల్సిందేనని పట్టుబట్టలేదు. ధర్మాసనం ఇష్టం అన్నట్లుగా వాదించారు. రెండు పక్షాలు వాదనలు వినిపించడానికి సిద్ధంగా లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
విచారణకు పట్టుబట్టని ప్రభుత్వం !
మూడు రాజధానుల బిల్లుల ఆమోదం , సీఆర్డీఏ రద్దు వంటివి చెల్లవని హైకోర్టులో దాదాపు వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని హైకోర్టు రెండు రకాలుగా విభజించి గతంలోనే విచారణ ప్రారంభమైంది. అప్పటి సీజే జేకే మహేశ్వరి నేతృత్వంలోని బెంచ్ రోజువారీ విచారణ నిర్వహించింది. పిటిషనర్ల తరపు వాదనలు దాదాపుగా ముగిశాయి. ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించింది. ఇక తీర్పు రావడమే అనుకున్న సమయంలో చీఫ్ జస్టిస్ బదిలీ జరిగింది. ఆ తర్వాత మళ్లీ మొదటి నుంచి విచారణ జరపాల్సి వస్తోంది. కానీ కొత్త సీజే వచ్చిన తర్వాత అసలు రాజధాని వ్యాజ్యాలపై వాదనలు ప్రారంభం కాలేదు. ఈ ఏడాది మార్చిలో అడ్వకేట్ జనరల్ రాజధాని పిటిషన్ల విచారణ ప్రారంభించాలని కోరారు. దీంతో సీజే ఏకే గోస్వామి, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ జయసూర్య ధర్మాసనం మే 3 నుంచి రాజధాని కేసులపై కోర్టులోనే భౌతికంగా విచారణ జరపాలని.. అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగస్టు 23వ తేదీకి విచారణను వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ వాయిదా పడింది. విచారణ కావాలని అడిగిన ప్రభుత్వం కూడా వాదనలు వినిపించే విషయంలో నిరాసక్తంగా కనిపిస్తోంది.
ప్రభుత్వంలో మూడు రాజధానులపై సీరియస్ నెస్ తగ్గుతోందా..?
అటు పిటిషనర్లు, ఇటు ప్రభుత్వం రెండు పక్షాలూ రాజధాని వ్యాజ్యాలపై విచారణ జాప్యం కోసం సిద్ధమవడంతో ఇక మూడు రాజధానుల అంశం మరింత కాలం పెండింగ్‌లో పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మూడు రాజధానుల ప్రస్తావన లేకుండానే సీఎం ప్రసంగం ముగిసింది. అప్పుడే ప్రభుత్వంలో మూడు రాజధానులపై సీరియస్ నెస్ తగ్గిపోయిందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యూహం ఏమిటో రాజకీయపార్టీలకు సైతం అంతుబట్టడం లేదు.