Minister Vidadala Rajini : ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, ఊరూరా ఆధునిక వైద్యం - మంత్రి విడదల రజిని
Minister Vidadala Rajini : రాష్ట్రంలో పేదలందరికీ ఉచితంగా ఆధునిక వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి విడదల రజిని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి అమల్లోకి తీసుకొస్తున్నామన్నారు.
Minister Vidadala Rajini : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గనిర్దేశంతో వైద్య ఆరోగ్య రంగం పటిష్టంగా మారిపోతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, పీహెచ్‌సీల నిర్మాణంపై మంత్రి విడదల రజిని అధికారులందరితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని, దేశ చరిత్రలోనే వైద్య ఆరోగ్యశాఖలో ఇది సరికొత్త విప్లవమని చెప్పారు. నిర్మాణంలో ఉన్న అన్ని వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక వైద్యశాలలన్నింటినీ వెంటనే పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానానికి వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, పీహెచ్‌సీలు కీలకమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రాథమిక వైద్య విభాగాన్ని పూర్తిగా మార్చేస్తోందన్నారు. ఈ విభాగంలో ఆస్పత్రుల నిర్మాణం కోసమే ఏకంగా రూ.2532 కోట్లు సీఎం జగన్ ఖర్చు చేస్తున్నారని తెలిపారు.
పేదలందరికీ ఉచితంగా ఆధునిక వైద్యం
పేద ప్రజలందరికీ ఆధునిక వైద్యాన్ని ఉచితంగా అందించే దిశగా కృషి చేస్తున్నామని మంత్రి విడదల రజిని తెలిపారు. గ్రామగ్రామాన వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను నిర్మిస్తున్నామని, రూ.1500 కోట్లతో 1032 విలేజ్ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. 184 యూహెచ్‌సీల ఆధునికీకరణ, 344 కొత్త యూహెచ్‌సీల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.665 కోట్లు కేటాయించిందని, ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయని తెలిపారు. 976 పీహెచ్‌సీల ఆధునికీకరణ, 150 కొత్త పీహెచ్‌సీల నిర్మాణం కోసం రూ.367 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.
ఏడాది చివరికల్లా
వైఎస్సార్ క్లినిక్ లు, ఇతర వైద్య ఆరోగ్య శాఖ భవనాల నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది చివరి కల్లా పూర్తి కావాలని మంత్రి విడదల రజిని ఆదేశాలు జారీచేశారు. పనుల పురోగతిపై ఇకపై ప్రతి నెలా తానే స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. అన్ని భవనాల నిర్మాణం, రూపు ఏకరీతిగా ఉండాలని తెలిపారు. ఆయా భవనాల నిర్మాణం కోసం బిల్లుల చెల్లింపుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అధికారులంతా పనిచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్
రాష్ట్రంలో 10032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి విడదల రజిని చెప్పారు. 528 అర్బన్ హెల్త్ క్లినిక్‌లు, 1125 పీహెచ్‌సీలు, 168 ఏపీవీవీపీ ఆస్పత్రుల నిర్మాణం, ఆధునికీకరణ, పలాసలో కిడ్నీ రీసెర్చి సెంటర్, 16 మెడికల్ కళాశాలల నిర్మాణం, 13 మెడికల్ కళాశాలల ఆధునికీకరణ, ఐదు చోట్ల ట్రైబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, కడపలో క్యాన్సర్, మెంటల్ హెల్త్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం మొత్తం రూ.16,252 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఇటీవల తెలిపారు. వీటిలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, ఐదు మెడికల్ కళాశాలల నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావాల్సి ఉందని, ఆ పనులు సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
Also Read : Sajjala On Chandrababu : తెలంగాణలో బీజేపీకి టీడీపీ మద్దతు, చంద్రబాబు ప్లాన్ ఇదే- సజ్జల