Minister Venugopala Krishna : రికార్డు స్థాయి వరదలను సమర్థంగా ఎదుర్కొన్నాం- మంత్రి వేణుగోపాల కృష్ణ
Minister Venugopala Krishna : ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండడం వల్ల వరదలను సమర్థంగా ఎదుర్కోగలిగామని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. వరద సహాయ చర్యల్లో పాలుపంచుకోకుండా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
![Minister Venugopala Krishna : రికార్డు స్థాయి వరదలను సమర్థంగా ఎదుర్కొన్నాం- మంత్రి వేణుగోపాల కృష్ణ Amaravati Minister Venugopala krishna says govt quick act in flood relief works dnn Minister Venugopala Krishna : రికార్డు స్థాయి వరదలను సమర్థంగా ఎదుర్కొన్నాం- మంత్రి వేణుగోపాల కృష్ణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/18/97634039936eb38a6963656e6b79ca591658159945_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minister Venugopala Krishna : సీఎం జగన్ ఆదేశాలతో అధికార యంత్రాంగం సకాలంలో ముందుస్తు చర్యలు చేపట్టడంతో గోదావరి వరదల్లో ప్రాణనష్టం జరగలేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ జులై నెలలో గోదావరి నదిలో భద్రాచలం వద్ద 70.9 అడుగులు, ధవళేశ్వరం వద్ద 26 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించడం చరిత్రలో తొలిసారి అన్నారు. వరదలు, తుపానులను ఒక జిల్లా కలెక్టరు,ఎస్పీ చూడాల్సి వచ్చేదని కానీ కొత్త జిల్లాల ఏర్పాటుతో ముగ్గురు కలెక్టర్లు, ముగ్గురు ఎస్పీలు పర్యవేక్షణలో సహాయ చర్యలు వేగవంతం చేపట్టామన్నారు. గోదావరి వరదలతో అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాలు అత్యధికంగా ప్రభావితం అయ్యాయని తెలిపారు. ఆయా జిల్లాల మంత్రులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అంతా నిరంతరం రేయింబవళ్లు ఫీల్డులోనే ఉండి ప్రజలకు సేవలందించారని మంత్రి తెలిపారు.
లక్షా 30 వేల మంది పునరావాస శిబిరాల్లో
ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా లంక, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేశామని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం జరగలేదని మంత్రి స్పష్టంచేశారు. వరద ప్రభావిత జిల్లాల్లో తక్షణ సహాయక చర్యల కోసం ప్రతి కలెక్టరుకు రూ. 5 కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పారు. వరద ప్రభావానికి లోనైన 5 జిల్లాల్లో 191 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లక్షా 30 వేల 574 మందిని తరలించి వారికి తాగునీరు, ఆహారం కనీస అవసరాలను కల్పించామన్నారు. 256 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించడం తోపాటు వదర ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పునరావాస కేంద్రాలల్లోని వారికి కోటి 64 లక్షల ఆహార పొట్లాలను సిద్ధం చేసి పంపిణీ చేశామని అన్నారు. అదే విధంగా 14 లక్షల మంచినీటి ఫ్యాకెట్లను అందించామని వివరించారు.
ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం
ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని మంత్రి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ప్రాంతంలోని బాధితులకు 10 వేల ఆహార పొట్లాలను అందించడంతో పాటు రాజమహేంద్రవరం నుంచి మరో 10 వేల ఆహార పొట్లాలను కూడా పంపిస్తున్నట్టు మంత్రి వేణుగోపాల కృష్ణ వివరించారు. పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి తిరిగివెళ్లే ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు ఆర్థిక సాయం చేస్తున్నామని మంత్రి తెలిపారు. అదే విధంగా వదర ప్రభావానికి గురై పునరావాస కేంద్రాల్లో లేని వారికి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిప్పు, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళా దుంపలు, కిలో ఆయిల్ తోపాటు పాలు వంటి సరుకులను ఉచితంగా అందిస్తున్నామన్నారు.
ప్రతిపక్షాల లేనిపోని ఆరోపణలు
పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చినా గోదావరి ఏటిగట్లకు గండ్లు పడకుండా నివారించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. కోనసీమ ప్రాంతంలో 31 చోట్ల ఏటిగట్లు బలహీనంగా ఉండి గండ్లు పడే అవకాశం ఉన్న చోట్ల ఇసుక బస్తాలు వేసి గండ్లు పడకుండా కాపాడామని ఆయన పేర్కొన్నారు. వరద ప్రభావానికి గురైన ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అంతా అహర్నిశలు శ్రమిస్తుంటే వాస్తవాలను కప్పి పుచ్చి కేవలం రాజకీయ లబ్దికోసం ప్రతిపక్షనేతలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సీఎం జగన్ హెలీకాప్టర్ లో వెళ్లి ఏరియల్ సర్వే చేస్తే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రతిపక్షనేత విమర్శించారని వారి హయాంలో ఎలా వెళ్లారని మంత్రి వేణుగోపాల కృష్ణ ప్రశ్నించారు. చంద్రబాబు టైంలో నిత్యం కరువు పరిస్థితులే ఉండేవని విమర్శించారు. ప్రతిపక్షం అంటే ఆపదలో ఉన్న వారికి ఓదార్పు ఇవ్వాలని ప్రభుత్వం అందించే సహాయ చర్యల్లో ఏమైనా లోపాలున్నాఎవరికైనా సహాయ చర్యలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తేవాలి తప్ప లేనిపోని ఆరోపణలు చేయడం సబబు కాదని మంత్రి వేణుగోపాల కృష్ణ హితవు పలికారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)