Pawan Kalyan: పొత్తులపై పవన్ క్లారిటీ, బీజేపీ మాట కోసం వెయిటింగ్
జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఇప్పటం రైతులకు రూ.50 లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
జనసేన తొమ్మిదో ఆవిర్భావ వేడుకలో జనసేనా తన భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందు ఉంచారు జనసేనాని పవన్ కల్యాణ్. రేపటి నుంచి జనసైనికులు చేపట్టబోయే కార్యక్రమాలపై స్పష్టత ఇచ్చారు. జనసేన ప్రజల్లో ఎంత బలంగా ఉందో తెలిపారు.
సొంత పార్టీ శ్రేణులు, నేతల నుంచి ఇతర పార్టీల నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు పవన్ కల్యాణ్. తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం అన్ని పార్టీలకు ఆయనక అభివాదం చేశారు. తన సంస్కారం వైసీపీ నాయకులకు కూడా నమస్కారం చెప్పమంటోందని సెటైర్లు వేశారు పవన్. ఈ సందర్భంగా వైసీపీలోని కొందరి నాయకులపై విమర్శలు చేశారు. మేకపాటి గౌతం రెడ్డిని స్మరించుకున్నారాయన.
పార్టీని నడపడం అంటే అదే
పార్టీని నడపడం అంటే బలమైన సిద్ధాంతాన్ని పట్టుకొని ఉండటమన్నారు పవన్. అది ఒకరిద్దరితోనే ప్రారంభమవుతుందన్నారు. ఆనాడు ఆరుమందితో ప్రారంభమైన జనసేన ఇవాళ లక్షల మంది జనసైనికులతో బలంగా నిలబడిందన్నారు. 150 మందితో ప్రారంభమై ఐదు లక్షల మంది క్రియాశీల సభ్యుల దిశగా పుంజుకుంటుందన్నారు పవన్. ఇవాళ పార్టీ కార్యకర్తలు సుమారు యాభై లక్షల వరకు ఉందన్నారు.
బలపడుతున్నాం
వైసీపీ, టీడీపీతో పోల్చుకుంటే జనసేన చాలా త్వరగా పుంజుకున్నామన్నారు పవన్. 7 శాతం నుంచి 27శాతానికి, 27 శాతం నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శాతంగా జనసేన ఎదగబోతుందన్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో వ్యక్తుల వ్యక్తిత్వం బయటపడుతుందన్నారు. నాయకత్వం అంటే ఎంతమందిని ప్రభావితం చేయగలమన్నది ముఖ్యం. నాయకత్వం అంటే తన సర్వస్వం కోల్పోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమన్నారు పవన్. ద్వేషించే శత్రువులను కూడా క్షేమించి వదిలేయడం అన్నారు.
వెలుగులోకి తీసుకురావాలి
ఈ రాష్ట్ర భవిష్యత్ చీకట్లోకి వెళ్లకూడదనుకుంటే ఆ పని జనసేన క్రియాశీల సభ్యులపై ఆధారపడి ఉందన్నారు పవన్. తాను నడిచి చూపిస్తానన్నారు. చాలా అరుదుగా కొత్త తరానికి దిశానిర్దేశం చేయాల్సి వచ్చిందన్నారు. ఈ చీకటి పాలన అంతం చేసి వెలుగులోకి తీసుకురావాల్సి వచ్చిందన్నారు.
ప్రశ్నించడం అనేది తేలిగ్గా తీసుకోవద్దన్నారు పవన్. చాలా బలమైన ఆయుధంగా మార్చుకోవాలని సూచించారు. 2014లో సూటిగా ప్రశ్నించాం ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నామన్నారు. 2019 దీటుగా ఎదుర్కొన్నాం బలపడ్డాం. 2024లో గట్టిగా నిలబడదాం ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తామన్నారు పవన్.
వెల్లంపల్లి, వెల్లుల్లిపాయ్
మంత్రులపై పవన్ సీరియస్ సెటైర్లు వేశారు. తాను మాట్లాడక ముందే వైసీపీ లీడర్లు తెగ సంబరపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. బంతి చామంతి, గోడకు కొట్టినా తిరిగిరాని బంతి అవంతి అంటూ విమర్శలు చేశారు. వెల్లులిపాయి, వెల్లంపల్లి అంటూ సెటైర్లు పేల్చారు. దీంతో సభలో ఒక్కసారి ఉత్సాహం నింపారు.
విధ్వంసంతో పాలన స్టార్ట్
ఇసక పాలసీ సరిగా లేకపోవడంతో వందల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. 32 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయన్నారు. అసలు వైసీపీ పాలన మొదలైందే విధ్వంసంతో ప్రారంభమైందని విమర్శించారు. ఇంతటి నెగటివ్ మైండ్‌తో ఉన్నారేంటీ అనే ఆశ్చర్యం కలిగింది.
వైసీపీ ప్రతిజ్ఞ
"ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి, పోలీసులను ప్రైవేటు ఆర్మీగా వాడేస్తాం, న్యాయస్థానాలను లెక్కే చేయం, పెట్టుబడుల్లో వచ్చే వాటాలు లాక్కుంటాం, గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా పెడతాం, సంపూర్ణ మద్యపాన నిషేధం ద్వారా ప్రజలను తాగిస్తాం, ఒక్క చాన్స్ ఇస్తే ఆంధ్రాను వెనక్కి తీసుకెళ్తాం. ఇంకో ఛాన్స్ ఇస్తే స్కూల్‌కు వెళ్లే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కుంటాం" అనేది వైసీపీ ప్రతిజ్ఞ అని చెప్పారు పవన్
అమరావతే రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అంగీకరించిన వైసీపీ ఇప్పుడు రాజధాని మార్చేస్తామంటున్నారన్నారు పవన్. పీపీఎస్‌లు క్యాన్సిల్ చేసుకోవడాన్ని గుర్తు చేశారు. రాజధాని మారినప్పుడల్లా పాలసీలు మారవన్నారు పవన్. భూములు ఇవ్వబోమంటున్న రైతులకు అప్పట్లోనే భరసా ఇచ్చామన్నారు. అలాంటి టైంలో వైసీపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. ఆ రోజే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని నిలదీశారు.
ఇప్పుడున్న ముఖ్యమంత్రి మరో వెయ్యి ఎకరాలు అదనంగా ఇవ్వాలని అప్పుడు సభలో సూచించారని పవన్ గుర్తు చేశారు. తాను మద్దతు ఇచ్చిన ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తే వైసీపీ నేతలు ఎక్కడకెళ్లారని ప్రశ్నించారు. ప్రశ్నించేవాడు లేనప్పుడు ఏమైనా చేస్తారా అని నిలదీశారు. ఇష్టారాజ్యంగా మూడు రాజధానులు అంటూ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రిమినల్స్ రాజ్యంలో ఇంతే మరి
అమరావతి ఎక్కడికీ కదలదని... ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని కుండబద్దలు కొట్టారు పవన్. అమరావతి రైతులపై పడే ప్రతి లాఠీ దెబ్బ తనపై పడినట్టన్నారు. అమరావతి కేసుల్లో తీర్పులు ఇచ్చిన న్యాయవ్యవస్థలను కూడా తప్పుపట్టే స్థితికి ప్రభుత్వం వెళ్లిందన్నారు. వ్యక్తులపై దాడి చేస్తున్నారని ఇది మంచిపద్దతి కాదని హితవు పలికారు పవన్. క్రిమినల్స్ రాజ్యం ఏలితే ఇలానే ఉంటుందన్నారు పవన్. దీనికి అందరం బాధ్యులమే అన్నారు.
వైసీపీ పాలనలో ముందుగా రైతులను టార్గెట్ చేశారన్నారు పవన్. తర్వాత కూలీల పొట్ట కొట్టారని మండిపడ్డారు. ఆ తర్వాత పోలీసులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టారన్నారు. వైసీపీ లీడర్లు పోలీసుల చొక్కాలు పట్టుకొని బెదిరిస్తున్నారని కొన్ని సంఘటనలు గుర్తు చేశారు పవన్ కల్యాణ్. తమ మాట వినడం లేని చాలా మంది అధికారులను వీఆర్‌ఎస్‌కు పంపించారన్నారు.
సీపీఎస్‌పై మాట మార్చారు
సీపీఎస్‌పై ఎన్నికలకు ముందు ఒక మాట తర్వాత నాలుక మడతేశారన్నారు పవన్. ఇప్పుడు అడుగుతుంటే ఉన్న టెక్నికాలిటీస్ తెలియవని చెప్పడం ఏంటని నిలదీశారు. ఇలా ప్రతి అంశంలోనూ ఏదో మెలిక పెడుతూ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం పెంచుతామంటే తగ్గిస్తామని అర్థమని ఎద్దేవా చేశారు. రోడ్లు సరిగా వేయకపోవడం వల్ల రాష్ట్రంలో ప్రమాదాలు పెరిగాయని, చావులు పెరిగియాన్నారు. ఇదంతా ప్రభుత్వం ఇస్తున్నా డాటా అని వివరించారు.
ఆదాయం ఏమైంది
ఏడు లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు పవన్ కల్యాణ. ఆదాయాన్ని పద్దతిగా పంపిణీ చేయాలి, అవసరం అయితే అప్పులు తీసుకురావాలి, తర్వాత ఆదాయం సృష్టించే మార్గాలను అన్వేషించాలన్నారు. లక్షల కోట్ల ఆదాయం వస్తున్నా ప్రభుత్వం ఎందుకు అప్పులు చేస్తుందని, ఉద్యోగాలకు ఎందుకు వేతనాలు పెంచడం లేదన్నారు. ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలు ఎందుకు మూయించేస్తున్నారని నిలదీశారు. అమ్మఒడి నిధులు ఎందుకు ఆపేశారు... ఆరోగ్యశ్రీ ఏమైందని ప్రశ్నించారు పవన్.
ప్రస్తుతం రాష్ట్రంలో అమ్ముతున్న లిక్కరు ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కరు కాదన్న పవన్ కల్యాణ్ పులివెందుల మేడ్ లిక్కర్ అన్నారు. ప్రభుత్వం లిక్కర్ అమ్ముతోందని ఎద్దేవా చేశారు. గుడిని బడిని నిర్మించాల్సిన ప్రభుత్వం లిక్కర్ అమ్మడం ఏంటని నిలదీశారు. విగ్రహాలను విరగ్గొట్టే నిందితులను ఎందుకు ఇంత వరకు అరెస్టు చేయలేదన్నారు. హిందూ ధార్మిక పరిషత్‌పై ఎందుకు నియంత్రిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. తాము ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
జనసేన సౌభాగ్య పథం అబివృద్ధి పథం
ఆంధ్రప్రదేశ్‌ను జనసేన సౌభాగ్య పథం పేరుతో సమూలంగా మార్చేస్తామన్నారు పవన్. దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లాగా పేరు మారుస్తామన్నారు. " బలమైన పారిశ్రామిక పాలసీ తీసుకొస్తాం. వైట్ రేషన్ కార్డుదారులకు, అల్పాదాయ వర్గాల వారికి ఇసుకు ఉచితంగా ఇస్తాం. అదనపు గదులు నిర్మించుకున్నా ఉచితంగానే ఇస్తాం. మీ ప్రతిభకు తగ్గట్టు రాణించేందుకు పది మందికి ఉపాధి కల్పిస్తామని చెబితే పది లక్షలు అకౌంట్లలో వేస్తాం. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యం. ప్రభుత్వంలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాం. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు" పవన్. ప్రతి ఏటా ఐదు లక్షల ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేలా పాలన ఉంటుందన్నారు. విశాఖను విశ్వనగరంగా మారుస్తామన్నారు.
జనసైనికులను, ప్రజలను ఇబ్బంది పెడితే భవిష్యత్‌లో భీమ్లానాయక్ ట్రీట్మెంట్ అంటే ఏంటో చూపిస్తాం అన్నారు పవన్. వైసీపీ బాధితులందరికీ అండగా నిలబడతామని హామి ఇచ్చారు. అధికార మధంతో కొట్టుకుంటున్న వైసీపీ అనే మహిషానికి కొమ్ములు విరగొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని నిర్మిస్తామన్నారు.
పొత్తులపై క్లారిటీ
బీజేపీ నాయకులు రోడ్డు మ్యాప్ ఇస్తామన్నారని అప్పుడే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు పవన్ కల్యాణ్. ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదన్నారు పవన్ కల్యాణ్. వైసీపీది విధ్వంసం అని జనసేనది వికాసమన్నారు పవన్ కల్యాణ్.
అందరికీ ధన్యవాదాలు
రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి జనసేన తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి వచ్చిన ఆడబెబ్బులి లాంటి వీరమహిళలకు, కొదమ సింహాల్లాంటి జన సైనికులకు, సత్తువ, ధైర్యంతో కొత్త తరం లోకల్ బాడీలో గెల్చిన వారికి, పోటీ చేసినవారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్పిన పవన్.
ఇప్పటం గ్రామానికి సాయం
పొలాల్లో సభ నిర్వహించుకోమని అనుమతి ఇచ్చిన రైతులకు పవన్ కృతజ్ఞతలు చెప్పారు. రైతులకు తన ట్రస్టు తరఫున 50 లక్షల ఇస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ ఆఫీస్‌లో ఓ ప్రోగ్రామ్‌లో గ్రామ పంచాయతీకి చెక్ అందజేస్తాను అన్నారు.