Agri Gold Funds: అగ్రిగోల్డ్ బాధితులకు నగదు జమ.. 7 లక్షల మంది ఖాతాల్లో రూ.666.84 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నిధులు విడుదల చేశారు. రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు రూ.207.61 కోట్లు, రూ.10 వేల నుంచి రూ. 20 వేల లోపు వారికి రూ. 459.23 కోట్లు జమ చేశారు.
అగ్రి గోల్డ్ బాధితులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నగదు జమ చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ విధానంలో మీట నొక్కి నిధులు విడుదల చేశారు. దీంతో బాధితుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. రూ.10,000 నుంచి రూ.20,000 లోపు డిపాజిట్‌దారుల ఖాతాల్లో ఆ మొత్తం జమ కానుంది. రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు రూ.207.61 కోట్లు, రూ.10 వేల నుంచి రూ. 20 వేల లోపు వారికి రూ. 459.23 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది.
రెండు రోజుల క్రితం వరకూ అర్హులైన అగ్రిగోల్డ్ ఖాతాదారులు.. డిపాజిట్లకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు, బ్యాంకు పాస్‌బుక్, చెక్కు, పే ఆర్డర్, రశీదులు, ఆధార్ కార్డులను వాలంటీర్లు సేకరించారు. రూ.10వేల లోపు డిపాజిట్ దారులకు గతంలో చెల్లించారు. ఇప్పుడు రూ.10000 నుంచి రూ. 20000 వరకూ డిపాజిట్ దారులకు చెల్లిస్తున్నారు. అయితే ఇప్పటికీ లక్షల మంది అగ్రిగోల్డ్ డిపాజిట్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తాము రెక్కలు, ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ము వెనక్కి రావడం లేదన్న అసహనం వ్యక్తం చేశారు. హమీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు మోసం చేశాయన్న భావనలో ఉన్నారు.
తొలిదశలో రూ.238.73 కోట్లు..
అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి దశ పరిహారాన్ని 2019లో అందించారు. రూ.10000 లోపు డిపాజిట్‌దారులైన 3.40 లక్షల మందికి రూ.238.73 కోట్లను జమచేశారు. అప్పుడు అర్హులైనా కూడా పరిహారం పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పుడు రెండో దశ పరిహారాన్ని అందించింది.
అగ్రిగోల్డ్ స్కాం ఏంటి..?
1995లో అగ్రిగోల్డ్ సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థ కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీం పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించింది. విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన ఈ స్కాం.. క్రమంగా ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించింది. భారీగా ఏజెంట్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని ప్రజల నుంచి పెట్టుబడులు సమీకరించింది. కమీషన్ల పేరుతో ప్రజలను ఆకర్షించింది. అగ్రిగోల్డ్ కింద డబ్బులు జమచేసిన వారిలో ఎక్కువగా దిగువ మధ్య తరగతి వారే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ డిపాజిట్లను కట్టించుకుంది. వేల కోట్ల రూపాయలలో డిపాజిట్లను సేకరించింది.
తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 32 లక్షల మంది నుంచి డబ్బులు డిపాజిట్ల రూపంలో స్వీకరించింది. ఈ డబ్బు అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వెచ్చించారు. 7 రాష్ట్రాల్లో కలిపి పదహారు వేల ఎకరాలను కొనుగోలు చేసింది. 2014 నుంచి సంస్థ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గడువు పూర్తయినా డిపాజిట్లు తిరిగి ఇవ్వకపోవడం, వడ్డీలు చెల్లించకపోవడం, ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడం వంటివి జరిగాయి. 2015లో లక్షలాది మంది బాధితులు బయటకొచ్చి ఆందోళనలు చేశారు. దీంతో అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావుపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేశారు.
సెబీ, రిజర్వ్ బ్యాంకుల అనుమతి లేకుండానే డిపాజిట్లు సేకరించినట్లుగా పోలీసులు గుర్తించారు. అగ్రిగోల్డ్ కేసును సీఐడీకి బదలాయించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. హైకోర్డు ఆదేశాలతో 2016 డిసెంబరు 27న అటాచ్ చేసిన ఆస్తులను సీఐడీ అధికారులు వేలం వేశారు. కానీ పెద్ద నోట్ల రద్దు ఇతర కారణాల వల్ల ఈ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో డిపాజిటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.