Chandrababu Speech : జైలు నుంచి బయటకొచ్చాక చంద్రబాబు తొలి స్పీచ్ - వారందరికీ స్పెషల్
చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక సంఘిభావం తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.
Chandrababu Speech : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదల అయిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ 52 రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తనకు అండగా నిలిచారని అది మరచిపోలేనని చెప్పుకొచ్చారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు, తన కుటుంబానికి అండగా ఉండటంతోపాటు తన విడుదలకు ప్రత్యేక పూజలు, అనేక కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ జీవితాంతం తోడుగా ఉంటానని అన్నారు. నాడు తాను చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చాలా మంది రోడ్డుమీదకు వచ్చి సంఘీభావం తెలిపారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ప్రపంచం మెుత్తం తాను చేసిన అభివృద్ధిని, విధానాలను తెలియజేస్తూ ప్రజలకు వివరించారని అన్నారు. ఈ కార్యక్రమాలతో తన జీవితం ధన్యమైందని అన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఏతప్పు చేయలేదని.. చేయబోనని.. చేసినా ఉపేక్షించినా సహించను అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏ తప్పు చేయకపోవడమే తన నిబద్దత అని చెప్పుకొచ్చారు. సంఘీభావం తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. పార్టీలు, నాయకులు తనకు సహకరించారని వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. సీపీఐ,సీపీఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని కొందరు సంఘీభావం ప్రకటించారని వారందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‍లో ఐటీ ఉద్యోగులు కూడా మొన్న సంఘీభావం తెలిపారు. నేను చేపట్టిన విధానాల వల్ల లబ్ధి పొందినవారంతా మద్దతిచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.
చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు భార్య నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణలు చంద్రబాబు నాయుడుకు ఎదురెల్లి స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడుకు కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి,ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసుతోపాటు మరికొంతమంది టీడీపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభిమానులు, నేతలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ప్రధాన గేటు వద్దకు తరలి రావడంతో అక్కడ సందడి నెలకొంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ప్రధాన గేటు వరకు కాలినడకన చేరుకున్నారు. అనంతరం అక్కడ నుంచి ఎన్‌ఎస్‌జీ వాహనం వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఉండవల్లి బయలు దేరారు.
చంద్రబాబు నాయుడు భారీ ఊరేగింపు కాకుండా..ప్రధాన కూడలి వద్ద చంద్రబాబు నాయుడు అభివాదం చేసేలా టీడీపీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. ఉండవల్లిలోని తన నివాసం వరకు చంద్రబాబు నాయుడు 26 నియోజకవర్గాల మీదుగా చంద్రబాబు కాన్వాయ్ వెళ్తుంది.