Prakash Raj on AP Govt: చిత్ర పరిశ్రమను క్షోభ పెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? : ప్రకాశ్ రాజ్
Prakash Raj on AP Govt: బాక్సాఫీస్ వద్ద రాజకీయాలు ఎందుకు అని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. చిత్ర పరిశ్రమ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలన్నారు.
Prakash Raj on AP Govt: భీమ్లా నాయక్(Bheemla Nayak) వర్సెస్ ఏపీ ప్రభుత్వం(AP Govt) నడుస్తోంది. భీమ్లా నాయక్ థియేటర్ల వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు నిఘా పెడుతున్నారన్నది బహిరంగ రహస్యం. టికెట్లను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ ను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని, అందుకే ఆయన సినిమాలపై కక్షసాధిస్తుందని పవన్ అభిమానులు, చిత్ర పరిశ్రమలు చెందిన వారు ఆరోపిస్తున్నారు. పవన్ సోదరుడు నాగబాబు(Nagababu) ఇప్పటికే ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయగా తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) కూడా ఓ ట్వీట్ చేశారు.
బాక్సాఫీస్ దగ్గర రాజకీయాలా?
ఈ మేరకు ప్రకాశ్ రాజ్ ఆదివారం ట్వీట్ చేశారు. సినిమా పరిశ్రమ పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును తప్పుపట్టారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) భీమ్లా నాయక్ రిలీజ్ దృష్టిలో పెట్టుకుని టికెట్ల ధరలు పెంపునకు సంబంధించిన జీవోను విడుదల చేయలేదని పలువురు ఆరోపించారు. సినిమాను రాజకీయాలతో కలిపి చూడడం సరికాదన్నారు. 'సృజన సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్(Box Office) దగ్గర ఎందుకు? ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరు.' అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
#BheemlaNayak .. #GovtofAndhrapradesh please put an end to this onslaught..let cinema thrive 🙏🏻🙏🏻🙏🏻#JustAsking pic.twitter.com/eZxpVYYZbI
— Prakash Raj (@prakashraaj) February 27, 2022
పవన్ కల్యాణ్ సినిమాలపై ప్రభుత్వం పగబట్టింది : నాగబాబు
టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని రిపబ్లిక్(Republic) సినిమా ప్రీ రిలీజ్ లో కల్యాణ్ బాబు (పవన్ కల్యాణ్) బాహాటంగా విమర్శించడంతోపవన్ కల్యాణ్ సినిమాలపై ప్రభుత్వం వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నాగబాబు వ్యాఖ్యానించారు. వకీల్ సాబ్(Vakeelsab) నుంచి తాజాగా విడుదలైన 'భీమ్లా నాయక్' వరకూ జరిగిన పరిణామాలు చూస్తే అదే విధంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు
"రిపబ్లిక్' వేడుకలో 'మీకు నాపై కోపం ఉంటే నా మీద తీర్చుకోండి. అంతే కానీ, ఇండస్ట్రీని మీ విధానాలతో ఇబ్బంది పెట్టకండి' అని ఓపెన్ గా మాట్లాడారు. ఏపీ మంత్రులు, కొంతమంది సినీ ప్రముఖుల నుంచి చాలా విమర్శలు వచ్చాయి. టికెట్ ధరల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని గ్రహించిన పెద్దలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy)ని కలిశారు. ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఫిబ్రవరి 20న జీవో వస్తుందన్నారు. కానీ, రాలేదు. కల్యాణ్ బాబు సినిమా (భీమ్లా నాయక్) 25న విడుదల అని ప్రకటన రాగానే ఆలస్యం చేశారు. పాత రేట్లు అమలు చేశారు. దీన్ని బట్టి పవన్ కల్యాణ్ అనే హీరోని టార్గెట్ చేశారని మాకు క్లియర్ కట్ గా అర్థం అయ్యింది" అని నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. పవన్ కల్యాణ్ వంటి హీరోకి ఈ విధంగా జరిగితే, సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని నాగబాబు ప్రశ్నించారు. ఇండస్ట్రీ నుంచి ఒకరిద్దరు ఇది సరికాదని చెప్పడం తప్ప పెద్దవాళ్ళు కల్యాణ్ బాబుకు మద్దతుగా మాట్లాడకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తోటి హీరోలు, దర్శకులు, నిర్మాతలు మాట్లాడితే చంపేస్తారా? అని ఆయన సూటిగా అడిగారు. అలాగే, వాళ్ల భయాలను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలమన్నారు.
మీకు సపోర్ట్ గా ఉంటాం
'భీమ్లా నాయక్' మాసివ్ హిట్ అయ్యింది కాబట్టి, ప్రజలు ఆదరించారు కాబట్టి సరిపోయిందని, లేదంటే నిర్మాత - పంపిణీదారులు నష్టపోయేవారని నాగబాబు వివరించారు. అదృష్టం కొద్దీ సినిమా భారీ విజయం సాధించిందని ఆయన అన్నారు. ఇవాళ కల్యాణ్ బాబుకు జరిగినట్టు రేపు మరొకరికి జరిగితే? ఇదే సమస్య మరొకరికి ఏ ప్రభుత్వం ద్వారా వచ్చినా? తాను గానీ, తన తమ్ముడు కల్యాణ్ అండగా ఉంటామని నాగబాబు తెలిపారు. 'మీరు మమ్మల్ని వదిలేసినా... మీకు మా సపోర్ట్ ఉంటుంది' అని చిత్ర పరిశ్రమ ప్రముఖులకు నాగబాబు చెప్పారు.