Aarogyasri For Prisoners: ఖైదీలకూ ఆరోగ్యశ్రీ! మానవతా దృక్పథంతో ఏపీ సర్కారు నిర్ణయం
Aarogyasri For Prisoners: ఆంధ్రప్రదేశ్ జైళ్లలోని ఖైదీలకు ఇక నుండి మెరుగైన వైద్యం ఉచితంగా అందనుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారికీ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయనుంది.
Aarogyasri For Prisoners: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం ఏపీ. మానవతా దృక్పథంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం... జైళ్లలో ఖైదీల మరణాలు తగ్గేందుకు దోహదం చేస్తుంది. జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు ఇక నుండి ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా, పూర్తి ఉచితంగా అందించనున్నారు.
అమలుకు జీవో విడుదల..
ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరు పేదలు, మధ్య తరగతి వర్గాలకు రాష్ట్రంలో ఉచిత వైద్యం అందిస్తున్నారు. దీని వల్ల చాలా మంది పేదలు ఎంతో సాంత్వన పొందుతున్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో వివిధ రకాల చికిత్సలు, ఆపరేషన్లు పూర్తి ఉచితంగా చేస్తూ వస్తున్నారు. ఈ సదుపాయాన్ని ఖైదీలకూ వర్తింప జేయాలని సర్కారు నిర్ణయిస్తూ ఈ మేరకు తాజాగా జీవో విడుదల చేసింది. ఇలా జైళ్లలో ఉన్న ఖైదీలకు ఉచితంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందించే విధానం, పథకం దేశంలో అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది.
వారికీ మెరుగైన వైద్యం..
గతంలో ఎవరైనా ఖైదీకి అనారోగ్యం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకు వెళ్లే వారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడే వాళ్లు. ఆ ప్రభుత్వ ఆస్పత్రిలో సదరు సదుపాయం లేకపోతే.. దూరంగా ఉన్న పెద్దాసుపత్రికి ఖైదీలను తరలించే వారు. ఇలా ఖైదీని ఆస్పత్రి మార్చాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుండేది. ఈ ప్రక్రియ పూర్తయి వేరే ఆస్పత్రికి వెళ్లినా.. ఖైదీలకు ఆరోగ్య శ్రీ వర్తించేది కాదు. దీని వల్ల ఖైదీలకు మెరుగైన వైద్యం కోసం నానా పాట్లు పడాల్సి వచ్చేది. దీంతో ప్రభుత్వం మానవథా దృక్పథంతో వ్యవహరించడంతో ఖైదీలకు కూడా మంచి నాణ్యమైన వైద్యం అందనుంది.
ప్రభుత్వ నిర్ణయంతో మరణాలు తగ్గుతాయి..
2019 డిసెంబర్ లో జరిగిన ప్రిజన్ డెవెలప్మెంట్ బోర్డు భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖైదీలకు అందుతున్న వైద్య సదుపాయాలపై రిపోర్టు ఇవ్వాల్సిందిగా జైళ్ల శాఖను ఆదేశించారు. దీంతో జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాస రావు జైళ్లు, వాటి పరిస్థితి, ఖైదీలపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించారు. అందులో కొన్ని ప్రతి పాదనలూ చేశారు. వాటికి రాష్ట్ర ఆమోదం తెలుపుతూ ఈ ఏడాది జులై 22న జీవో విడుదల చేసింది. ఈ జీవో వల్ల సాధారణ ప్రజల్లాగే ఖైదీలూ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందుతారు. ప్రభుత్వ దవాఖానాలో సరైన సదుపాయం లేకపోతే వారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జైళ్లలో మగ్గుతూ సరైన వైద్యం అందక మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది.
Also Read: Pavithrotsavam in Tirumala: భక్తులకు టీటీడీ అలర్ట్ - శ్రీవారి ఆలయంలో దర్శన సమయాలలో మార్పులు