Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త! నేడు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం, ఖాతాలో ₹7,000 జమ!
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి రానుంది. ఏటా మూడు విడతల్లో 14వేల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. నేడు ఐదు వేలు వేయనుంది.

Annadata Sukhibhava: సూపర్ సిక్స్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో పథకాన్ని నేటి నుంచి అమలు చేస్తోంది. రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు తయారు చేసిన అన్నదాత సుఖీభవ పథకాన్ని నేటి నుంచి అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రతి రైతు ఖాతాలో 14వేల రూపాయలు వేయనుంది. తొలి విడతగా ఇవాళ(2 ఆగస్టు 2025)న ఐదు వేల రూపాయలను జమ చేయనుంది.
అన్నదాత సుఖీభవ పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాసం జిల్లా దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంలో ప్రారంభిస్తారు. ఇక్కడ రైతులతో మాట్లాడి వారి ఖాతాల్లోకి నిధులు మళ్లిస్తారు. ఉదయం పదిన్నరకు కార్యక్రమ స్థలానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అక్కడే రైతులతో మాట్లాడుతారు. అనంతరం పార్టీ శ్రేణులతో కూడా చర్చించనున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ పథకం లబ్ధిదారులు 2, 68, 165 మంది రైతులు ఉన్నారు.
పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నారు. అంటే రెండు ప్రభుత్వాలు కలిపి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు లబ్ధి చేకూర్చనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తే కేంద్రం ఆరు వేలు ఇస్తుంది. రెండు ప్రభుత్వాలు కూడా మూడు విడతల్లో నగదు జమ చేయనున్నారు. తొలి విడతగా కేంద్రం రెండు వేల రూపాయలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో రైతుకు శనివారం నాడు ఏడు వేల రూపాయలు జమ కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు పథకాలకు 46, 85, 838 మంది రైతులు అర్హులుగా తేలారు. వారి ఖాతాల్లోనే నగదు జమ కానుంది. వీళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 2, 342. 92 కోట్ల రూపాయలు జమ చేస్తుంటే, కేంద్రం 831 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. టీడీపీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎంపీరు, జోనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు అంతా పాల్గొన్నారు. సూపర్ సిక్స్‌లో భాగంగా చాలా కార్యక్రమాలు అమలు చేశామని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సుపరిపాలలో తొలి అడుగు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు మాట ఇచ్చినట్టు ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న విషయం పెద్దలకు తెలియాలని వివరించి చెప్పాలని తెలిపారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విమర్శలను, తప్పడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు.
ఎక్కడికక్కడ రైతులతో టీడీపీ శ్రేణులు మాట్లాడి పథకం గురించి వివరించాలని చెప్పారు. ఎవరికైనా అర్హత ఉండి పథకం వర్తించకపోతే వెంటనే వారిని సచివాలయ సిబ్బందితో అనుసంధానించి ఎందుకు వారి పేరు అర్హుల జాబితాలో లేదా ఉన్నా ఎందుకు డబ్బులు రాలేదు తెలుసుకొని వారికి సహాయం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో నగదు పడేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. అవసరం అయితే 155251 నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని చెప్పారు.





















