(Source: ECI | ABP NEWS)
Ram Chander Rao: ఎరువుల కొరతపై మంత్రి తుమ్మల చర్చకు సిద్ధమా?: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు
Telangana Farmers News | ఎరువులను దళారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందులు వేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. ఎరువులను దళారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు ఆదివారం ఆయన గద్వాలలో పర్యటించారు. గద్వాల ప్రజలతో తనకు విశేషమైన అనుబంధం ఉందని అన్నారు. గతంలోనే అనేకసార్లు గద్వాలను సందర్శించానని, ఇప్పుడు కూడా జిల్లాల వారీగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన మద్దతు అందడం లేదు
గద్వాల జిల్లా కాటన్ సీడ్ ఉత్పత్తిలో కీలకంగా నిలుస్తోందని రాంచందర్ రావు అన్నారు. కానీ ఇక్కడ రైతులకు సాగునీటి సదుపాయం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన మద్దతు అందడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై నిందలు మోపుతోందని మండిపడ్డారు.
నీమ్ కోటెడ్ యూరియాను అందుబాటులోకి తెచ్చాం
యూపీఏ పాలనలో రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చేదని, అప్పట్లో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. క్యూలైన్లలో పోలీసులు లాఠీచార్జ్‌లు చేసేవారని అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చాక, నీమ్ కోటెడ్ యూరియాను అందుబాటులోకి తెచ్చిందన్నారు.
2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా ఇచ్చాం
తెలంగాణకు అవసరమైన 9.5 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా, 12.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం సరఫరా చేసిందని బీజేపీ అధ్యక్షుడు వెల్లడించారు. ఇది అవసరానికి మించి 2.5 లక్షల మెట్రిక్ టన్నులు అదనం అని అన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
‘రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసినప్పుడు తెలంగాణకు అవసరమైన యూరియాను కేంద్రం పూర్తిగా పంపిణీ చేస్తోందని చెప్పారు. తెలంగాణకు కేంద్రం అవసరమైన మేరకు యూరియా పంపుతున్నప్పటికీ మార్కెట్‌లో యూరియా కొరత ఎందుకు ఏర్పడింది? దీనిపై దర్యాప్తు చేయాలని కూడా రేవంత్ రెడ్డిని కోరాము. రాష్ట్ర ప్రభుత్వం దళారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలేలా ప్రోత్సహిస్తోంది. ఈ ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. కానీ అసలు కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం’ అని విమర్శించారు.
తుమ్మల నాగేశ్వరరావు చర్చకు సిద్ధమా?
దేశంలో ఎక్కడా లేని విధంగా ఎరువుల కొరత తెలంగాణలోనే ఎందుకు వస్తోందని ప్రశ్నించిన రాంచందర్ రావు.. ఈ అంశంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
‘కాంగ్రెస్ పార్టీ ఎరువుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేసింది. రైతుల జీవితాలతో చెలగాటమాడింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను రైతులు నిలదీయాలి. ఎరువులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించాలి’ అని అన్నారు.





















