CM Jagan: మిల్లర్ల పాత్ర ఉండకూడదు- కనీస మద్దతు ధర రూపాయి కూడా తగ్గొద్దు: సీఎం
CM Jagan: పంటసాగుపై సలహాలతోపాటు వాటికి కావాల్సిన ఎరువులను రైతులకు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సంబంధిత అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర అసలు ఉండకూడదన్నారు.
కనీస మద్దతు ధర రూపాయి తగ్గినా ఊరుకునేది లేదన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లో సాయిల్ కార్డులతోపాటు ఆ భూమికి తగిన విధంగా ఎరువులు, పంటల సాగుపై సలహాలు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు మద్దతు ధర అందాల్సిందేనని వివరించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర అసలే ఉండ కూడదని చెప్పారు.
రైతు భరోసా కేంద్రాలు పౌర సరఫరాల శాఖతో అనుసంధానం..
రైతు భరోసా కేంద్రాలను పౌర సరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. అయితే ఆర్బీకేల కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగడానికి లైన్ డిపార్ట్‌మెంట్లతో సమర్థవంతమైన సమన్వయం ఉండాలని అధికారులను ఆదేశించారు. దీని కోసం మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహిస్తూ.. రైతులకు సాయిల్ కార్డులు అందజేయాలని సూచించారు.
పంటల కొనుగోలు ప్రక్రియను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షణ
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్, ఉచిత పంటల బీమా పథకం, వడ్డీలేని రుణాలు, 9 గంటలపాటు ఉచిత విద్యుత్ తదితర పథకాలతో రైతులను ఆదుకుంటున్నామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల 778 రైతుల భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అదిస్తున్నట్లు తెలిపారు. పంటల కొనుగోలు ప్రక్రియను సీఎం యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్బీకేల స్థాయిలో ఈ క్రాప్ బుకింగ్, ఉచిత పంటల బీమా ఇన్ పుట్ సబ్సిడీ, వడ్డీలేని పంట రుణాలు, పంటల కొనుగోలు సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పంటలకు సంబంధించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన, సూచనల కోసం శాస్త్రవేత్తలతో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశామని అన్నారు.
ఖరీఫ్ పంట ధాన్యం కొనుగోళ్లకు పక్కా ప్రణాళిక..
రాబోయే ఖరీఫ్ పంటలకు సంబధించి కూడా పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళ్తామని సీఎం జగన్ చెప్పారు. అన్నదాతలకు అండంగా నిలబడేందుకు తాము అనేక రకాల పథకాలు తీసుకొచ్చినట్లు జగన్ వివరించారు. రైతులు ఆర్థికంగా బాగు పడితేనే రాష్ట్రం కూడా ఆర్థికంగా మంచి స్థితిలోకి వెళ్తుందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 62 శాతం మంది జనాభా వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉన్నారని, రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35 శాతంపైనే ఉందని సీఎం జగన్ వివరించారు.
Also Read: పవన్ కాన్వాయ్ వర్సెస్ రోజా కారు, మంత్రి క్షమాపణ చెప్పాలని జనసేన డిమాండ్