PM-Kisan Yojana And Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రైతులకు డబుల్ బొనాంజా - వీళ్లకు మాత్రం నిరాశే!
PM-Kisan Yojana, Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రైతులకు శనివారం 7వేల రూపాయలు ఖాతాల్లో పడబోతున్నాయి. పీఎం కిసాన్ నిధులతోపాటు అన్నదాత సుఖీభవ నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్నాయి.

PM-Kisan Yojana And Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆగస్టు డబుల్ బొనాంజా ఇస్తోంది. ఓవైపు ప్రధానమంత్రి కిసాన్ నిధులు వస్తుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చే అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల అవుతున్నాయి. ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారణాసిలో నిధులు రైతుల ఖాతాల్లో వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శిలో జరిగే కార్యక్రమంలో పాల్గొని నిధులు విడుదల చేస్తారు.
పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో శనివారం పర్యటిస్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాదాపు రెండువేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేస్తారు. ప్రతి రైతుకు ఏడాదికి ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడత నిధులను శనివారం విడుదల చేయనున్నారు. ఒక్కో రైతుకు రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు. 19వ విడత నిధులను ఫిబ్రవరిలో విడుదల చేశారు. అక్కడి నుంచి నాలుగు నెలలు అంటే జూన్‌లో విడుదల చేయాల్సి ఉండే కానీ వివిధ కారణాలతో విడుదల ఆలస్యమవుతూ వచ్చింది.
రైతులకు ఇచ్చేది ఎంత?
పీఎం కిసాన్ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రెండు వేల రూపాయలు ఇస్తోంది. 20వ విడత 20 వేల, ఐదు వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేస్తారు. 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు పడబోతున్నాయి. ఈ డబ్బులు పడాలి అంటే రైతులు తమ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించి ఉండాలి. ఈకైవేసీ చేసి ఉండాలి. భూముల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో ఉంచాల్సి ఉంది. ఇవి చేయని వారి ఖాతాల్లో డబ్బులు పడబోవని మొదటి నుంచి అధికారులు చెబుతున్నారు. ఈ విడతలో ఎవరైనా ఈ కారణాలతో మిస్ అయితే అధికారులతో మాట్లాడి ఈకేవైసీ చేయించుకుంటే నిధులు జమ అవుతాయి.
ఏపీ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆగస్టు రెండో తేదీనే అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలకు క్లియరెన్స్ వచ్చింది. సూపర్ సిక్స్‌లో పీఎం కిసాన్- అన్నదాతా సుఖీభవ పేరుతో ఏడాదికి 20 వేల రూపాయలు అందజేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందులో భాగంగా ప్రభుత్వం పీఎం కిసానపేరు నిధులు విడుదలైన రోజునే రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలి విడదల నిధులు విడుదల చేస్తుంది. కేంద్రం ఇస్తున్న రెండు వేలకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పీఎం కిసాన్- అన్నదాతా సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత రైతులతో మాట్లాడతారు. మిగతా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు,మంత్రులు,కూటమి నేతలు పాల్గొంటారు.





















