Siricilla Farmers Flood Rescue | నర్మాల వద్ద వాగులో చిక్కుకున్న 5గురు రైతులను రక్షించిన ఆర్మీ | ABP
సిరిసిల్ల జిల్లాలో వరద విలయతాండవం చేస్తోంది. గంభీరావుపేట మండలంలో నర్మాల వద్ద మానేరు వాగు ఉప్పొంగడంతో వ్యయసాయ పనులు కోసం నిన్న ఉదయం వాగుదాటి వెళ్లిన ఐదుగురు రైతులు తిరిగి ఒడ్డుకు రాలేదు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. రంగంలోకి దిగిన ఎన్ డీఆర్ ఎఫ్ టీమ్ నిన్నటి నుండి రైతులను కాపాడేందుకు గంటలతరబడి శ్రమించినా సాధ్యం కాలేదు. ఎగువ ప్రాంతాల నుండి భారీగా చేరుతున్న వరద నీటితో మానేరు వాగు ఊహించని స్దాయిలో ఉప్పొంగడంతో వాగు దాటడం ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది సైతం అవ్వలేదు. వాగు దాటి చిక్కుకున్న రైతుల వద్దకు వెళ్లే అవకాశం లేకపోవడంతో రాత్రంతా రైతులు బిక్కుబిక్కు మంటూ వాగు అవతలివైపు కొండల మధ్య గడపాల్సిన దుస్దితి ఏర్పడింది. ప్రవాహ వేగం తగ్గే అవకాశాలు లేకపోవడంతో డ్రోన్ ల సహాయంతోనే రైతులకు నిన్నటి నుండి ఆహారం, త్రాగునీటి సరఫరా చేస్తూ వచ్చారు అధికారులు.
ఓవైపు ఎడతెరిపి లేని భారీ వర్షాలు, మరోవైపు ఉగ్రరూపం దాల్చిన వాగులో వరద తీవ్రత చూసిన రైతుల కుటుంబ సభ్యులలో భయాందోళన నెలకొంది.తమ కుటుంబ సభ్యులు ప్రాణాలతో తమను చేరుకుంటారా లేదా టెన్షన్ ఒడ్డున్నవారిలో కనిపించింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ రైతులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆర్మీ సిబ్బందికి సమారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈదురు గాలులతోపాటు భారీ వర్షాల ప్రభావంతో ఆర్మీ హెలికాప్టర్ కూడా వచ్చే అవకాశం లేకపోవవడంతో నర్మాల వద్ద నిన్న మధ్యాహ్నం నుండి నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.
ఎట్టకేలకు మధ్యాహ్నం సమయానికి స్పాట్‌కు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ చేరుకోవడంతో రెస్య్కూ ఆపరేషన్ మొదలైంది. వాగుకు అవతలి వైపు ఎత్తైన కొండకు సమీపంలో చిక్కుకు పోయిన రైతుల వద్దకు చేరుకున్న హెలికాప్టర్ ,ఐదుగురు రైతులను క్షేమంగా హెలికాఫ్టర్ లో ఒడ్డుకు చేర్చింది.హెలికాఫ్టర్ దిగుతూ ఒక్కొక్కరుగా రైతులు తమ కుటుంబ సభ్యులను చేరుకోవడంతో గంటల తరబడి కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. హెలికాప్టర్ దిగిన రైతులు, తమ కుటుంబ సభ్యలను హత్తుకుని బోరున విలపించారు. ప్రాణాలమీద ఆశ వదులకున్నాం. ఇలా ఒడ్డుకు చేరుతామని అనుకోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉంటే సిరిసిల్ల జిల్లాలో వరదల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వరదల‌్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు మరో రెండు హెలికాప్టర్‌ను సైతం జిల్లాకు పంపారు అధికారులు.





















